Apps Rivalry: థ్రెడ్స్‌ యాప్‌ లింక్‌లను బ్లాక్‌ చేస్తున్న ట్విట్టర్‌

Apps Rivalry: థ్రెడ్స్‌ యాప్‌ లింక్‌లను బ్లాక్‌ చేస్తున్న ట్విట్టర్‌
థ్రెడ్స్ యాప్‌ లింక్‌లు కనపడకుండా బ్లాక్‌ చేస్తున్న ట్విట్టర్‌.... సెర్చ్‌ చేస్తే ఎలాంటి రిజల్ట్ కనపడడం లేదన్న యూజర్లు.. గతంలోనూ వేరే యాప్‌ల లింక్‌లను ఇలాగే బ్లాక్‌ చేసిన ట్విట్టర్‌

మెటా తీసుకొచ్చిన థ్రెడ్స్‌ యాప్‌( Threads).. ట్విట్టర్‌‍ కిల్లర్ అవుతుందో లేదో కాని నెట్‌ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. ఐదే రోజుల్లో 10 కోట్ల మంది యూజర్లతో మైలురాయిని దాటి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ టెక్ట్స్ ఆధారిత పబ్లిక్ సంభాషణలు జరిపే థ్రెడ్స్‌ యాప్‌తో ట్విట్టర్‌( Twitter) పెను సవాల్‌ ఎదుర్కొంటోంది. ఈ రెండు యాప్‌ల మధ్య పోటీ మరింత పెరిగిన నేపథ్యంలో ట్విట్టర్‌.. కీలక నిర్ణయం తీసుకుంది. థ్రెడ్స్‌ యాప్‌ లింకులను ట్విట్టర్‌లో కనపడకుండా బ్లాక్‌‍(blocked) చేస్తోంది. ట్విట్టర్‌లో థ్రెడ్స్‌ యాప్‌ లింక్‌లను సెర్చ్‌ చేస్తే ఎలాంటి రిజల్ట్ చూపించడం లేదు. ఆండీ బైయో అనే యాజర్‌ ట్విట్టర్‌లో థ్రెడ్స్ యాప్‌ లింక్‌లు ఓపెన్‌ కావడం లేదని మొదటగా ట్వీట్‌ చేశాడు. 'url:threads.net' అనే పదాన్ని శోధిస్తే ట్విట్టర్‌ ఎలాంటి ఫలితాలు అందించలేదని పోస్ట్‌ చేశాడు. పోటీ యాప్‌ లింకులను ట్విట్టర్‌ బ్లాక్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ సబ్‌స్టాక్ లింక్‌లను సహా కొని యాప్‌ల లింకులను బ్లాక్ చేసింది.


ట్విట్టర్‌కు ప్రత్యర్థిగా మార్కెట్లో వచ్చిన మెటా యాప్ థ్రెడ్స్.. 5 రోజుల్లోనే 10 కోట్ల యూజర్లను సంపాదించి చరిత్ర సృష్టించింది. అతి తక్కువ రోజుల్లో 10 కోట్ల మార్క్ అందుకున్న తొలి యాప్‌గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందట వచ్చి సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచిన చాట్‌జీపీటీని కూడా ఈ యాప్‌ అధిగమించింది. ఇక ఇప్పుడు బిలియన్ యూజర్లను (100 CRORES) సాధించాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా దూసుకెళ్తోంది. 5 రోజుల్లోనే 100 మిలియన్ యూజర్లు వచ్చినట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటివరకు వచ్చిన యూజర్లంతా ఆర్గానిక్ నుంచేనని.. తామింకా ప్రమోషన్లు కూడా ప్రారంభించలేదని మెటా తెలిపింది.


థ్రెడ్స్ యాప్‌ న్యాయపరమైన సమస్యల్లోనూ పడింది. ఈ మెటా యాప్‌ తమ మేథో సంపత్తి హక్కులను (intellectual property rights) ఉల్లంఘించిందని ట్విట్టర్ ఆరోపించింది. థ్రెడ్స్‌పై దావా వేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ (Mark Zuckerberg)కు.. ఎలాన్ మస్క్ న్యాయవాది అలెక్స్ స్పిరో (Alex Spiro) లేఖ రాశారు. లేఖలో మెటాపై ట్విట్టర్ తీవ్ర ఆరోపణలు చేసింది. ట్విట్టర్ మాజీ ఉద్యోగులను మెటా నియమించుకుందని తెలిపింది. మెటా నియమించుకున్న ఆ ఉద్యోగులకు ట్విట్టర్ వాణిజ్య రహస్యాలు, అత్యంత గోప్యమైన సమాచారం తెలుసని లేఖలో పేర్కొంది. దీనిపై మెటా స్పందించింది. థ్రెడ్స్ లోని ఇంజినీరింగ్ బృందంలో ఎవరూ ట్విట్టర్ మాజీ ఉద్యోగులు లేరని పేర్కొంది. మరోవైపు ఈ పరిణామాలపై ట్విట్టర్ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) స్పందించారు. పోటీ మంచిదే కానీ.. మోసం కాదని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story