మండిపడుతున్న యూజర్లు

ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తంలో యూపీఐ ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. అయితే, ఈ మధ్య కాలంలో యూపీఐ సర్వర్ తరచూ డౌన్ కావడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం కూడా యూపీఐ సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఈ సేవలకు ఆటంకం ఏర్పడింది. డిజిటల్ చెల్లింపులు చేస్తుంటే జరగడం లేదంటూ సోషల్ మీడియాల్లో వందలాది మంది పోస్టులు పెడుతున్నారు. చాలా మంది యూజర్లు యూపీఐ సేవల్లో అంతరాయం గురించి ఫిర్యాదు చేసినట్లు డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ తెలిపింది.
యూజర్ల అసహనం
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్స్ పనిచేయడం లేదని యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కూడా సాధ్యం కావట్లేదంటూ వాపోతున్నారు. యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత కూడా చెల్లింపు ప్రక్రియ పూర్తి కావడం లేదని యూజర్లు వెల్లడించారు. మార్చి 26న ఇదే పరిస్థితి నెలకొనగా.. సాంకేతిక కారణంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఎన్‌పీసీఐ అప్పట్లో వివరణ ఇచ్చింది. ఏప్రిల్ 2న కూడా యూపీఐ చెల్లింపులు కొంతసేపు నిలిచిపోయాయి. రోజుల వ్యవధిలో తాజాగా మరోసారి ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ సేవల్లో ఆటంకం ఏర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com