UPI: నో యూపీఐ... ఓన్లీ క్యాష్

ఒకప్పుడు మనం ఎక్కడకు వెళ్లినా డబ్బులు పెట్టుకుని వెళ్లేవాళ్లం. లేదంటే డెబిట్ కార్డు పెట్టుకుని.. దగ్గరలో ఉన్న ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ఎన్ని రకాల పేమెంట్లు అయినా చేసేస్తున్నాం. ఛాయ్ తాగాలన్నా.. షాప్‌కు వెళ్లి పాల ప్యాకెట్, ఇతర ఏ వస్తువులు కొన్నా.. రోడ్డు పక్కన కూరగాయలు కొనుగోలు చేసిన యూపీఐ స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తుంటాం. చివరికి ఆర్టీసీ బస్సు ఎక్కినా.. చిల్లర సమస్య లేకుండా యూపీఐ స్కాన్ చేసి టికెట్ కొంటున్నాం. రూ.1 నుంచి రూ.లక్ష వరకు ఒకేసారి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సహా ఇతర పేమెంట్ యాప్‌లను ఉపయోగించి క్షణాల్లో చెల్లింపులు చేస్తున్నాం. అయితే, ఇప్పుడు వ్యాపారులు యూపీఐ పేమెంట్లు వద్దని చెబుతున్నారు.
డిజిటల్ చెల్లింపులపై వ్యతిరేకత
గత కొన్ని రోజులుగా కర్ణాటకలో డిజిటల్ చెల్లింపులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బెంగళూరు నగరంలో రోడ్డు పక్కన బండ్లు, ఫుడ్ కోర్ట్లు, స్థానిక షాపుల్లో 'నో యూపీఐ, ఓన్లీ క్యాష్' అంటూ కొత్తగా బోర్డులు దర్శనమిస్తున్నాయి. తమ వద్ద ఏది కొన్నా దానికి నేరుగా డబ్బులే చెల్లించాలని.. యూపీఐ పేమెంట్లను అంగీకరించేది లేదని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ఇక డిజిటల్ పేమెంట్స్‌కు బాగా అలవాటు పడిపోయిన జనం మాత్రం చేతిలో డబ్బులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటీవల కొంతమంది చిరు వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు రావడంతో మిగిలిన వ్యాపారులు కూడా అలర్ట్ అయ్యారు. తమకు వచ్చే యూపీఐ పేమెంట్ల కారణంగానే.. లక్షలకు లక్షలు జీఎస్టీ చెల్లించాలని నోటీసులు వస్తున్నాయి.
చిరు వ్యాపారికి రూ.29 లక్షల నోటీసులు
కర్ణాటకలోని ఒక చిన్న కూరగాయల షాప్ నడుపుతున్న శంకరగౌడ అనే వ్యక్తికి రూ.29 లక్షలు కట్టాలంటూ జీఎస్టీ నోటీసులు జారీ కావడం సంచలనం రేపింది. ఆ నోటీసులు చూసి శంకరగౌడ అవాక్కయ్యాడు. జీఎస్టీ రూల్స్ ప్రకారం.. రైతుల నుంచి కూరగాయలు నేరుగా కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేయకుండా అలాగే విక్రయిస్తే.. దానిపై ఎలాంటి జీఎస్టీ ఉండదు. కానీ, శంకరగౌడ విషయంలో యూపీఐ, ఇతర డిజిటల్ ట్రాన్సాక్షన్లను లెక్కలోకి తీసుకున్న అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. శంకరగౌడ అకౌంట్లో రూ.1.63 కోట్ల వరకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని వెల్లడైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com