భాగ్యనగర్‌లో స్థలం.. గజం రూ.2 లక్షలు.. రెడ్డిగారి విల్లా రూ.41 కోట్లు

జూబ్లీహిల్స్ పోష్ లొకాలిటీలో బద్దలవుతోన్న పాత రికార్డులు
ఐదేళ్లలో బాగా పెరిగిన రూ.10కోట్ల విలువైన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు
కరోనా తర్వాత మరింత పెరిగిన జోరు
పొలిటీషియన్స్, టాలీవుడ్ సెలబ్రెటీస్‌కి ఫేవరిట్ ఏరియాగా జూబ్లీహిల్స్
ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడన్నది పాత సామెత, కొంటే హైదరాబాద్‌లోనే ఇల్లు కొనాలన్నది ఇప్పటి ట్రెండ్‌కి తగ్గ సామెత. ఎందుకంటే డబుల్ బెడ్ రూమ్ హౌస్ ల నుంచి మల్టీస్టోరీడ్ విల్లాల వరకూ హైదరాబాద్ ఎంత పాపులర్ అవుతుందంటే, రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయ్. తాజాగా హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీ ఓనర్ జూబ్లీహిల్స్‌లోని పోష్ లొకాలిటీలో ఏకంగా 41.3కోట్లకి ఓ ఇండిపెండెంట్ హౌస్‌ని కొనుగోలు చేసారన్న సమాచారం ఇప్పుడు రియాల్టీ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది.
ముఖేష్ అంబానీ ఆయన రేంజ్‌కి తగ్గట్లుగా తన ఆంటిలియా హౌస్‌ని 200కోట్ల డాలర్లతో కట్టించుకోవడమే రికార్డ్ అయితే, పెద్దగా వార్తల్లోకి ఎక్కని వారు కూడా ఇప్పుడు కోట్లకి కోట్లతో విల్లాలు, ఇండిపెండెంట్ హౌస్‌లు కొనుగోలు చేయడం మనవారిలో పెరిగిపోయిన బిలీయనీర్ల సంఖ్యతోపాటు హైదరాబాద్ రియల్ఎస్టేట్ రేట్లు ఏ రేంజ్‌లో ఉన్నాయో కూడా చాటి చెప్తోంది.
డీల్ డీటైల్స్ ఏంటంటే
విర్చౌ లాబరేటరీస్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ అధినేత ఎన్. వెంకటరెడ్డి, ఈయన జనవరి 28,2021న జూబ్లీహిల్స్‌లో 41.3కోట్లతో ఇల్లు కొనుగోలు చేసినట్లు జాప్‌కీ డాట్ కామ్( zapkey.com)అనే వెబ్‌సైట్ చెప్తోంది. రిజిస్ట్రేషన్ కాపీ మీరూ చూడొచ్చు. మొత్తం 1837 చదరపు అడుగులు(1537 చదరపు మీటర్లు)లో ఈ భవంతి విస్తీర్ణమున్నట్లు డాక్యుమెంట్‌ని బట్టి తెలుస్తోంది.
ఇంత ఖరీదు పెట్టి కొన్న భవంతికి రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా రికార్డ్ స్థాయిలోనే ఉన్నాయ్. కొనుగోలు దారులైన వెంకటరెడ్డి గారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగం స్టాంప్ డ్యూటీగా అక్షరాలా 2కోట్ల27లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.20లక్షలు చెల్లించారు. మొత్తం జూబ్లీహిల్స్ ఏరియాలో ఇదే ఆల్‌టైమ్ రికార్డ్ ధర అని జాప్‌కీ డాట్ కామ్ చెప్తోంది.
ఎన్. వెంకటరెడ్డి వివరాలు చూస్తే ఈయన ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎంబిబిఎస్ పట్టా పుచ్చుకున్నారు. 1983లో ఎం. నారాయణరెడ్డితో కలిసి విర్చౌ ల్యాబ్స్ ని ప్రారంభించారు. పాథాలజిస్ట్ రుడాల్ఫ్ విర్చౌ పేరు మీదుగా సంస్థకి ఈ పేరు పెట్టడం జరిగిందని తెలుస్తోంది. దీని మెయిన్ ప్లాంట్ హైదరాబాద్ ఐడిఏ- జీడిమెట్ల ఏరియాలోనే కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రేడియంట్స్ సప్లై చేస్తుంటుంది.ఈ సంస్థ ఫ్లాగ్‌షిప్ తయారీ ఏమిటంటే సల్ఫామిథోక్సజోల్ ప్రొడక్షన్.
ప్రపంచంలోనే అతి పెద్ద సల్ఫామిథోక్సజోల్ ఉత్పత్తిదారుగా విర్చౌ కంపెనీకి పేరు. ఏటా 4వేల మెట్రిక్ టన్నుల సల్ఫామిథోక్సజోల్‌ని ఉత్పత్తి చేస్తుంది. మూత్రనాళాల ఇన్ఫెక్షన్(యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్), బ్రాంకైటిస్(ఊపిరితిత్తుల్లో నెమ్ము). 2017నాటికే ఈ సంస్థ టర్నోవర్ రూ.3వేలకోట్లుగా తెలుస్తోంది.బిజినెస్ పరంగా ఇంత స్కోప్ ఉన్న ఈ కంపెనీ షేరు డీటైల్స్ కూడా చెప్తే..ఓ లుక్కేద్దామనుకునేవాళ్లకి నిరాశే మిగులుతుంది..ఎందుకంటే విర్చౌ ల్యాబ్స్ లిస్టెడ్ కంపెనీ కాదు కాబట్టి..!
Also Read : మీ కష్టం వృధాగా పోదు తాత.. నీ మనవరాలు మీ పేరు నిలబెడుతుంది!
సెలబ్రెటీల హాట్ స్పాట్
ఇక జూబ్లీహిల్స్ ఏరియాలో ఈ ఏడాది జనవరి 12న పదికోట్లతో మరో భవంతి విక్రయం జరగగా దాన్ని ఆర్వెనిసిస్ ఎనర్జీ డైరక్టర్ అయిన అర్నిపల్లి హరీష్ కుమార్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్లలో పదికోట్ల రూపాయలు దాటిన భవంతుల విక్రయాలు దాదాపు 120 జరిగినట్లు జాప్‌కీ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. వీటిలో ఒక్క 2020లోనే జరిగిన17 భవంతుల విక్రయాల్లో టాలీవుడ్ సెలబ్రెటీలు, పొలిటీషియన్లు, పారిశ్రామికవేత్తలు పాలు పంచుకున్నారు.
వారిలో జివికే గ్రూప్ ఛైర్మన్ జివి కృష్ణారెడ్డి కూడా ఒకరు. ఆయన జూన్ 26, 2020న రూ.23 కోట్ల విలువ కలిగిన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారట. అలానే మే 18, 2020న న్యూలాండ్ ల్యాబ్స్ సీఈఓ సుచేత్ రావ్ దావులూరి 20.7కోట్లతో ఇండిపెండెంట్ హౌస్ కొనుగోలు చేసినట్లు జాబ్‌కీ రికార్డులు చెప్తున్నాయ్. అంతేకాదు టాలీవుడ్ హీరో నాగ చైతన్య 27.1కోట్లతో ఓ అపార్ట్‌మెంట్‌ని ఇదే ఏరియాలో 2020 జనవరిలోనే కొనుగోలు చేశారట.
రేట్లు వింటేనే గుండెలదిరిపోతాయ్
జూబ్లీహిల్స్ ఏరియాలో ఏ ప్లాట్ చూసినా 1000 గజాలపైనే ఉండగా..వాటి ఖరీదు గజం లక్షన్నర నుంచి 2 లక్షల రూపాయల పైమాటే పలుకుతుందని బ్రోకర్లు చెప్తుంటారు. అంటే ఈ రేటు వింటే మధ్య తరగతి జనం గుండెలు ఆగిపోవడం ఖాయం. గత ఏడాదిలో కరోనా దెబ్బకి రియాల్టీకి పెద్ద షాక్ తగలగా..విచిత్రంగా ఈ సెలబ్రెటీల ఫేవరెట్ ఏరియాలో మాత్రం డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకంటే ప్రైవసీ కోరుకోవడంతో పాటు, జన సంచారం ఎక్కువగా లేనిచోట భారీ భవంతుల్లో నివసించాలనే కాన్సెప్ట్ పెరిగిపోయింది. దానికి తోడు మౌత్ పబ్లిసిటీ కూడా ఈ ఏరియాలో రేట్లు ఆకాశాన్ని అంటడానికి కారణంగా చెప్తున్నారు.
Also Read : ఆర్థిక భరోసానిచ్చే పాలసీ.. రోజుకి రూ.55 కడితే చేతికి రూ.13 లక్షలు
(తెలంగాణలో ప్రభుత్వం ఆస్తి విలువలో 6శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలుగా వసూలు చేస్తుంది. స్టాంప్ డ్యూటీ అనేది మార్కెట్ వేల్యూపై కానీ..మొత్తం ధరపై కన్సిడరేషన్ కానీ ఏది ఎక్కువైతే దాన్ని పరిగణిస్తుంది. అలానే పై కథనానికి మనీకంట్రోల్.కామ్ స్టోరీనే మాతృక..ఇది అనువాదం మాత్రమే)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com