VI: ప్రభుత్వ సంస్థగా వోడాఫోన్ ఐడియా?

ఒకప్పుడు టెలికాం రంగంలో వొడాఫోన్, ఐడియా కంపెనీలు దూసుకెళ్లాయి. అయితే, దశాబ్ధ కాలం కిందట ముఖేష్ అంబానీ దేశీయ టెలికాం వ్యాపారంలోకి నేరుగా 4జీ సేవలను లాంచ్ చేశారు. ఆ తర్వాత అంబానీ వ్యాపార వ్యూహం ముందు నిలవలేక యూనినార్, విర్జిన్ మొబైల్స్, డొకోమో, ఎయిర్ సెల్ వంటి అనేక సంస్థలు కనుమరుగయ్యాయి. అయితే ఈ క్రమంలోనే బిర్లాలకు చెందిన ఐడియా, బ్రిటీష్ కంపెనీ వొడాఫోన్ గ్రూప్ ఒక్కటిగా తమ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లాయి. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా వ్యాపారం రోజురోజుకూ భారీ నష్టాల్లోకి జారుకుంటోంది. స్పెక్ట్రమ్ చెల్లింపులు చేపట్టడం కూడా కష్టతరంగా మారింది. ఈ బకాయిలను ఈక్విటీ షేర్లుగా మార్చడంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే వోడాఫోన్ ఐడియా ప్రభుత్వ సంస్థగా మారుతుందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈక్విటీ వాటాలుగా స్పెక్ట్రమ్ బకాయిలు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దూకుడు తట్టుకోలేక తన వ్యాపారంలో వోడాఫోన్ ఐడియా నష్టాలను చవి చూసింది. స్పెక్ట్రమ్ చెల్లింపులు చేపట్టడం కూడా కష్టతరంగా మారింది. భారత ప్రభుత్వం త్వరలో ఆ కంపెనీలో తన వాటాను పెంచుకోబోతోంది. దాదాపు రూ.36,950 కోట్ల స్పెక్ట్రమ్ బకాయిలను కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ వాటాలుగా మార్చింది. దీంతో కంపెనీలో ప్రభుత్వానికి ఉన్న వాటాలు 22.6 శాతం నుంచి ప్రస్తుతం 48.99 శాతానికి చేరుకున్నాయి. ప్రస్తుత చర్యలతో దాదాపు 49 శాతం స్టేక్ భారత ప్రభుత్వం స్వాధీనం అయ్యింది. ఇది కంపెనీని ప్రభుత్వ యాజమాన్య సంస్థగా మారటానికి అత్యంత చేరువ చేసింది. భవిష్యత్తులో ఏదైనా ఇలాంటి రుణాలను ఈక్విటీలుగా బదలాయింపు ప్రక్రియ జరిగితే వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వ వాటా 50 శాతం దాటి అది ప్రభుత్వ రంగంలోని కంపెనీగా మారే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com