Volvo: లగ్జరీ కార్ల ధరలు పెరగనున్నాయి..? అందులో ముందుగా వోల్వో..

Volvo (tv5news.in)
Volvo: కొత్త ఏడాది నుండి చాలా వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే చాలా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక న్యూ ఇయర్ నుండి పలు ఇతర వస్తువులపై పన్ను పెరుగుతుండడంతో వాటి ధరలు కూడా పెరగనున్నాయి. ఇది అందరిపై ఉన్న ఖర్చుల భారాన్ని మరింత పెంచనుంది. తాజాగా లగ్జరీ కోసం కొనుగోలు చేయాలనుకునే ఓ కారు ధర కూడా పెరగనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.
కోవిడ్ సమయం నుండి కారు సేల్స్ చాలావరకు తగ్గిపోయాయి. సేల్స్ తగ్గిపోయినా కూడా ఇన్‌పుట్ ఖర్చులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అందుకే ప్రముఖ కార్ల సంస్థ వోల్వో ఓ నిర్ణయానికి వచ్చింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ధరలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పలు కారు మోడళ్ల ధరలు పెరగనున్నాయని సంస్థ అధికారిక ప్రకటన చేసింది.
వోల్వో సంస్థ ప్రకటించిన దాని ప్రకారం కార్ల ధరలు ఈ విధంగా పెరగనున్నాయి.. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని ఎస్‌యూవీ ఎక్స్‌సీ40 టీ4 ఆర్ వేరియంట్ ధర రూ. 2 లక్షలకు పైగా పెరగనుంది. దీంతో ఈ కారు ధర రూ. 43.25 లక్షలకు చేరింది. దాంతో పాటుగా వోల్వో ఎక్స్‌సీ60 బీ5 ఇన్‌స్క్రిప్షన్ ఎస్‌యూవీ ధర రూ. 1.6 లక్షలు పెరిగి రూ. 63.5 లక్షలుగా ఉండనుంది.
వోల్వో సెడాన్ పోర్ట్‌ఫోలియోలోని వోల్వో సెడాన్ ఎస్90 ధర సుమారు రూ. 3 లక్షలు పెరిగి, రూ. 64.9 లక్షలకు చేరనుంది. కంపెనీలోని టాప్-ఎండ్ ఎస్‌యూవీ ఎక్స్‌సీ90 ధర దాదాపు రూ. 1 లక్ష పెరిగి సుమారు రూ. 90.9 లక్షలకు లభించనుంది. వోల్వో కార్లు ఇష్టపడే వారికి ఇదొక పెద్ద సమస్యలాగా తలెత్తింది. వోల్వోతో పాటు మరికొన్ని టాప్ ఎండ్ కార్ల కంపెనీలు కూడా వాటి ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com