VOLVO: వోల్వో కార్స్‌లో భారీ లేఆఫ్స్‌

VOLVO: వోల్వో కార్స్‌లో భారీ లేఆఫ్స్‌
X
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ వోల్వో కార్స్ కీలక నిర్ణయం

ఖర్చులు నియంత్రించేందుకు ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ వోల్వో కార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ వ్యయాలపై నియంత్రణ సాధించేందుకు గాను సుమారు 3,000 కార్యాలయ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. వాహనాల డిమాండ్ తగ్గడం, పెరుగుతున్న ఆపరేషనల్ ఖర్చులు, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నదని రాయిటర్స్‌ నివేదిక పేర్కొంది. ఇటీవలే తిరిగి సీఈఓగా బాధ్యతలు చేపట్టిన హకన్ శామ్యూల్సన్ నేతృత్వంలో ఈ కీలక ప్రణాళిక అమలవుతోంది. కంపెనీ మొత్తం వ్యయాల్లో 18 బిలియన్ స్వీడిష్ క్రౌన్ల (దాదాపు 1.9 బిలియన్ డాలర్లు) మేరకు తగ్గింపు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో వైట్ కాలర్ ఉద్యోగుల్లో 15 శాతం మందిని తొలగించనుంది.

స్వీడన్ లోనే ఎక్కువ..

లేఆఫ్స్ ఎక్కువగా స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్ నగరంలో ఉన్న కార్యాలయాల్లో జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఉద్యోగ కోతలు రిసెర్చ్‌, హెచ్ఆర్‌, కమ్యూనికేషన్ విభాగాల్లో ఎక్కువగా చోటు చేసుకోనున్నాయని శామ్యూల్సన్ తెలిపారు. ఇది తాత్కాలికంగా వ్యాపార ప్రభావాన్ని చూపించగలదన్నా, దీర్ఘకాలికంగా సంస్థ నిర్మాణం మరింత సమర్థవంతంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వోల్వో కార్స్‌కు ప్రపంచవ్యాప్తంగా యూరప్‌లో 29,000 మంది, ఆసియాలో 10,000 మంది, అమెరికాలో 3,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త ఫైనాన్స్ చీఫ్ ఫ్రెడ్రిక్ హాన్సన్ మాట్లాడుతూ, “ఈ చర్యల వల్ల సంస్థపై 1.5 బిలియన్ స్వీడిష్ క్రౌన్ల ఆర్థిక భారం పడుతుంది. అయినా ఇది సంస్థ భవిష్యత్తుకు లాభదాయక మార్గం” అని తెలిపారు.

Tags

Next Story