WEB CODING: ఉద్యోగాలను మింగేస్తున్న "వెబ్ కోడింగ్"

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో అనేక రంగాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా టెక్ కంపెనీలన్నీ పునర్వవస్థీకరణ బాట పట్టాయి. అందులో భాగంగా ఉద్యోగుల తొలగింపులు, టెక్నాలజీని అన్ని స్థాయిల్లో ప్రవేశపెడుతున్నాయి. కంపెనీలో ఏఐ, ఆటోమేషన్ ఆధారిత వర్క్‌ఫ్లోను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ఉద్యోగాలను మింగేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టెక్ కంపెనీలు ఏఐ బాట పడుతూ ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్లపై ఈ ప్రభావం పడుతోంది. ఏఐ సహాయంతో కోడ్ రాయడం వల్ల జూనియర్, కింది స్థాయి డెవలపర్ల అవసరం తగ్గిపోతోంది. ఈ క్రమంలో 'వైబ్ కోడింగ్' అనే పద్ధతిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అసలు ఏమిటీ వైబ్ కోడింగ్? ఉద్యోగాల తొలగింపులకు దీనికి ఏమిటి సంబంధం? భవిష్యత్తులో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? అని తెలుసుకుందాం..
అసలు ఏమిటీ వైబ్ కోడింగ్?
'వైబ్ కోడింగ్' అనేది అభివృద్ధి చెందుతున్న సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్ ప్రాక్టీస్. ఈ పద్ధతి ద్వారా ఏఐ సహాయంతో అప్లికేషన్లు తయారుచేస్తారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌కు ప్రాంప్టింగ్ ఇచ్చి కోడ్ డెవలప్ చేయాలి. ఇంగ్లీష్ వంటి భాషల్లో మనకు ఎలాంటి ఔట్ పుట్ కావాలనుకుంటున్నామో ఏఐకి చెప్పాలి. అది ఒక కోడ్ జనరేట్ చేస్తుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఔట్పుట్ మనం అనుకున్నట్లు వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మనకు అవసరమైన విధంగా ఔట్పుట్ జనరేట్ కాకపోతే మళ్లీ ఫీడ్‌బ్యాక్ ఇచ్చి కోడ్‌ను రిఫైన్ చేసే విధంగా ప్రాంప్టింగ్ ఇవ్వాలి. అలా రిపీట్ చేసుకుంటూ.. మనకు అవసరమైన కోడ్ జనరేట్ చేసుకోవాలి. 2025 ప్రారంభంలో ఆండ్రెజ్ కార్పథీ వైబ్ కోడింగ్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. వైబ్ కోడింగ్ రెండు లెవెల్స్‌లో ఉంటుంది. లో-లెవెల్‌లో ఒక నిర్దిష్టమైన కోడ్ కోసం ప్రాంప్టింగ్ ఇస్తూ దాన్ని రిపీట్ చేస్తారు. హై-లెవెల్‌లో ఒక పూర్తి అప్లికేషన్‌ను తయారు చేసి, దాన్ని లైవ్‌లోకి తీసుకువస్తారు. మనం ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కోడ్‌ను రిఫైన్ చేసి ఇస్తుంది.
తొలగింపులకు ఏమిటి సంబంధం?
ఏఐ, ఆటోమేషన్ వల్ల మాన్యువల్ కోడింగ్, ఆపరేషనల్ రోల్స్‌కు డిమాండ్ తగ్గింది. వైబ్ కోడింగ్ వంటి పద్ధతులు రావడం వల్ల జూనియర్ డెవలపర్లు అవసరం లేకుండా పోయింది. ఇక ఏఐ ఇంటిగ్రేటెడ్ బృందాలకు కొత్త నైపుణ్యాలు అవసరం అవుతున్నాయి. ఈ కారణాల వల్ల కంపెనీలు ఉద్యోగాల్లో కోతలకు తెగబడుతున్నాయి. ఏఐ, అటోమేషన్‌తో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా కంపెనీలు సంస్థలో మార్పులు చేస్తున్నాయి.
భవిష్యత్తులో వైబ్ కోడింగ్ పర్యవసానాలు
జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఎంట్రీ లెవెల్ రోల్స్, మిడ్-సీనియర్ లెవెల్ డెవలపర్లు, కోడింగ్, టెస్టింగ్ వంటి సపోర్ట్ రోల్స్.. వైబ్ కోడింగ్ వల్ల ప్రమాదంలో పడతాయి. ఈ రోల్స్‌కు సాధారణ కోడింగ్ నైపుణ్యం అవసరమవుతుంది. అయితే ఏఐ రాక వల్ల వీరి అవసరం లేకుండా పోతోంది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు 70 శాతం జాబ్ లిస్టింగ్‌లు పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైబ్ కోడింగ్ పద్ధతిని కంపెనీలు ఇంకా ఎక్కువగా అనుసరిస్తే మరిన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైబ్ కోడింగ్‌లో నిజానికి అంత వైబ్ లేదనే విషయం స్పష్టమవుతోంది. పనిలో కేవలం ఏఐ సహాయం తీసుకోవాలే తప్ప.. ఏఐ ఇచ్చిన కోడ్‌ను ఎడిట్ చేసుకుంటూ ఏఐ ఎడిటర్లుగా మారొద్దు. హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా పూర్తిగా ఏఐతో పనికానిచ్చేద్దాం అనే టెక్ కంపెనీల ధోరణి కూడా మారాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com