GOLD: లక్ష లోపునకు తులం బంగారం ధర?

ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పసిడి ధరలకు త్వరలోనే బ్రేక్ పడనుందా? అంటే అవుననే అంటున్నారు మార్కెట్ నిపుణులు. ప్రస్తుతం తులం (10 గ్రాములు) బంగారం ధర రూ. 1.60 లక్షల సమీపంలో ఉండగా, భవిష్యత్తులో ఇది రూ. 1 లక్ష లోపునకు దిగివచ్చే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.
ప్రధాన కారణాలు:
అంతర్జాతీయ రాజకీయాల్లో వస్తున్న మార్పులే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణం కానున్నాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జూన్ నాటికి ముగిసి, శాంతి నెలకొంటే పసిడి సెగ తగ్గుతుంది. అమెరికా అధ్యక్షుడి చొరవతో రష్యా తిరిగి డాలర్లలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని పునఃప్రారంభిస్తే, డాలర్‌కు గిరాకీ పెరిగి బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 5,000 డాలర్ల వద్ద ఉండగా, 2027 నాటికి ఇది 3,000 డాలర్లకు పడిపోవచ్చని సెబీ గుర్తింపు పొందిన నిపుణులు అనుజ్ గుప్తా, అమిత్ గోయల్ విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుత ధర: రూ. 1.59 లక్షలు (సుమారు)
భవిష్యత్ అంచనా: రూ. 90,000 - రూ. 1,00,000
బ్రిక్స్ దేశాల వద్ద ప్రపంచ పసిడి నిల్వల్లో 20% ఉండటం, ఉత్పత్తిలో 50% వాటా కలిగి ఉండటం వల్ల ఆయా దేశాల ఆర్థిక నిర్ణయాలు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఒకవేళ రష్యా డాలర్ వాణిజ్యానికి మొగ్గు చూపితే, కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లను తగ్గించి, అమెరికా బాండ్లపై మొగ్గు చూపుతాయి. ఫలితంగా సామాన్యులకు బంగారం ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
