వాట్సాప్ ఇకపై ప్రైవసీ యాప్ కాదు!

వాట్సాప్ ఇకపై ప్రైవసీ యాప్ కాదు. మీ వాట్సాప్ మెసేజ్‌లు ఇకపై రికార్డ్ అవుతాయి. సర్వర్‌లో స్టోర్ అవుతాయి. వాట్సాప్ ద్వారా పంపే మెసేజ్‌లపై నిఘా ఉంటుంది. మీ ఫోన్ నెంబర్లును కూడా వాట్సాప్ ద్వారా ఫేస్‌బుక్ తీసేసుకుంటుంది. అంతేనా.. మీరు ఏ మోడల్ ఫోన్ వాడుతున్నారు, మీ ఫోన్‌లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి? మీ భాష, మీ ఐపీ అడ్రస్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, యాప్ వర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్‌వర్క్, కనెక్షన్ ఇన్ఫర్మేషన్, టైమ్ జోన్ ఇలా వివరాలన్నీ వాట్సప్‌కి తెలిసిపోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే నువ్వెవరు, నీవాళ్లెవరు, ఏం చేస్తుంటావ్, ఎక్కడుంటావ్, ఎవరెవరితో మాట్లాడుతుంటావ్ ఇవన్నీ ఇకపై వాట్సాప్‌కి తెలిసిపోతుంది. వాట్సాప్ అప్‌డేట్ వర్షన్‌లో ఐ అగ్రీ అనే బటన్ నొక్కితే చాలు ఇక మీ ప్రైవసీకి పుల్‌స్టాప్ పడ్డట్టే.
వాట్సాప్ అంటే ఓ క్రేజ్. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్ స్క్రీన్‌పై వాట్సాప్ ఉండాల్సిందే. ఎన్నో యాప్స్ ఉండగా దీన్నే ఎందుకు ఎంచుకున్నారంటే.. ఇందులో ఉండే ప్రైవసీ సెట్టింగ్స్. పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్న యాప్ ఇది. అంటే మీరు పంపే మెసేజ్‌లు డైరెక్టుగా అవతలి వ్యక్తికే చేరుతాయి తప్ప మూడో వ్యక్తికి తెలియడం గాని, ఎక్కడా స్టోర్ అవడం గాని, సేవ్ అవడం గాని జరగదు. అందుకే, వాట్సాప్ అంత ఫేమస్ అయింది. కాని, ఇకపై అలా ఉండబోదు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి రూల్స్ మార్చుతున్నట్టు బాంబు పేల్చింది వాట్సాప్. ఆ రూల్స్‌కు ఓకే చెప్తే సరి. లేదంటే, ఇకపై మీరు వాట్సాప్‌ను వాడుకోలేరు.
మీ డేటాను వాట్సాప్ ఉపయోగించుకోబోతోంది. ఫేస్‌బుక్‌కు మీ మొత్తం డేటాను షేర్ చేయబోతోంది. అంతేకాదు, వాట్సాప్ పేమెంట్స్ చేస్తే.. మీ వివరాలన్నీ వ్యాపారులకు షేర్ చేయనుంది. అంతేకాదు, వాట్సప్‌లో పంపే మెసేజ్‌లపైనా నిఘా ఉంటుంది. మీ అభిరుచులు, ఎక్కువగా ఏ టాపిక్స్ మీద ఆసక్తి చూపిస్తారు, వేటి గురించి మాట్లాడుకుంటున్నారనే విషయాలు వాట్సాప్‌కు తెలుస్తాయి. త్వరలో తీసుకురాబోయే కొత్త రూల్స్‌లో ఇవన్నీ వివరంగా ఉన్నాయి. అందుకే, వాట్సప్ ప్రైవసీ రూల్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చర్చ అనడం కంటే రచ్చ జరుగుతోందనడం భేషుగ్గా ఉంటుందేమో.
ఒకప్పుడు వాట్సప్ ఒక ఇండిపెండెంట్ సంస్థ. కానీ ఇప్పుడు వాట్సప్ ఫేస్‌బుక్‌కు చెందిన సంస్థ. కొత్తగా మార్చుతున్న ప్రైవసీ సెట్టింగ్స్ ద్వారా.. మీరు చేసే లావాదేవీల వివరాలను కూడా ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది వాట్సప్. మీ ఫోన్ నెంబర్లు కూడా ఫేస్‌బుక్‌తో పంచుకుంటుంది. వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీ ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి రానుంది. ఆ లోపు వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్ అంగీకరించాలి. ఈ రూల్స్ అంగీకరించకపోతే మీరు వాట్సప్ యాప్ ఉపయోగించడం సాధ్యం కాదు.
వాట్సాప్ రూల్స్ మారుతున్నాయన్న వార్త రాగానే.. యూజర్లందరూ బెటర్ యాప్ కోసం వెతకడం మొదలుపెట్టారు. చాలామంది టెలిగ్రామ్ వైపు మళ్లుతున్నారు. అయితే, ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్.. ఎప్పుడైతే సిగ్నల్ గురించి చెప్పారో.. అప్పటి నుంచి సిగ్నల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారు.
ఫేస్‌బుక్ అధినేత జుకెర్‌బర్గ్‌కు టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్‌కు ఎప్పటి నుంచో వైరం ఉంది. ఎవరూ ఫేస్‌బుక్ వాడొద్దంటూ ఒకప్పుడు మస్క్ ట్వీట్ చేయడం పెద్ద దుమారమే లేపింది. ఇప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్ ఒక్కరివే కావడం, ప్రైవసీ రూల్స్ మారుస్తుండడంతో.. మరోసారి ట్వీట్ చేశారు. అందరూ సిగ్నల్ యాప్ వాడండంటూ ఎలన్ మస్క్ సలహా ఇచ్చారు. ఎలన్ మస్క్ ఇలా చెప్పాడో లేదో.. నెటిజన్లు సిగ్నల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసేసుకోవడం మొదలు పెట్టేశారు. దీంతో వాట్సాప్ కంపెనీ కొత్త పాలసీలపై ఓ వివరణతో ముందుకొచ్చింది. వాట్సాప్ యూజర్లందరి డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకోవడం జరగదని, కేవలం బిజినెస్ అకౌంట్ల వివరాలు మాత్రమే ఫేస్‌బుక్ బిజినెస్ ఖాతాలతో పంచుకుంటామని చెప్పింది. కొత్త పాలసీకి ఓకే చెప్పినా కూడా సాధారణ యూజర్ల డేటాను వ్యాపార అవసరాల కోసం వాడుకోవడం జరగదని తేల్చిచెప్పింది. మరి వాట్సాప్ ఇచ్చిన క్లారిటీకి యూజర్లు సంతృప్తి చెందుతారా? లేక సిగ్నల్ వైపు అడుగులేస్తారా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com