అందుబాటలోకి వాట్సప్ పేమెంట్స్ సర్వీసులు

సోషల్ మీడియా అనగానే ముందుగా గుర్తొచ్చేది ఫేస్‌బుక్. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యూజర్స్ కలిగిన ఈ కంపెనీకి వ్యాపారపరంగా ఎదురులేదు. అలాంటి ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌లో పేమెంట్స్ ఫీచర్ కోసం సుమారు రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ... కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు చట్టపరమైన అడ్డంకులను అధిగమించి... వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్‌ను భారత్‌లో యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు భారత జాతీయ పేమెంట్స్ కార్పొరేషన్-NPCI వాట్సాప్ పేమెంట్స్.... యూపిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-UPI ద్వారా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది. తొలి దశలో భాగంగా 2 కోట్ల మంది వాట్సాప్ యూజర్లతో మాత్రమే సేవలు ప్రారంభించాలని NPCI స్పష్టం చేసింది.
వాట్సాప్ పేమెంట్స్‌లో రిజిష్టర్ చేసుకోవాలనుకుంటే బ్యాంక్ ఖాతాతో లింక్ అయిన్ ఫోన్ నంబర్, వాట్సాప్ కోసం వాడుతున్న ఫోన్ నెంబర్ ఒకటే అయి ఉండాలి. ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి పేమెంట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే... బ్యాంక్‌ల జాబితా చూపిస్తుంది. అందులో ఖాతా కలిగిన బ్యాంక్ ఎంపిక చేసుకుంటే... SMSతో వెరిఫికేషన్ చేయాలని కోరుతుంది. SMS వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత యూపీఐ పాస్‌కోడ్ సెట్ చేసుకోవాలి. ఒక వేళ ఇప్పటికే యూపీఐ పాస్‌కోడ్ ఉపయోగిస్తుంటే.. ఆ కోడ్‌తోనే వాట్సాప్ పేమెంట్స్ చెయ్యొచ్చు.
వాట్సాప్ పేమెంట్స్ నుంచి ఇతర పేమెంట్స్ యాప్‌లకు కూడా నగదు బదిలీ చెయ్యొచ్చు. వాట్సాప్ పేమెంట్స్‌లో రిజిష్టర్ కాని వ్యక్తులకు... ఎవరైనా తమ వాట్సప్ పేమెంట్స్ నుంచి గూగుల్ పే, భీమ్, ఫోన్ పేలకు యూపీఐ ఐడీ ఎంటర్ చేసి నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. వాట్సాప్ పేమెంట్స్ ద్వారా ఒకసారి లక్ష రూపాయలు మాత్రమే ట్రాన్స్‌ఫర్ చెయ్యొచ్చు. ఈ సేవలు ఉచితంగా పొందొచ్చు. కొన్ని యూపీఐ యాప్స్‌లో బ్యాంక్ ఖాతా నెంబర్, IFSC కోడ్ ఎంటర్ చేసి డైరెక్టుగా నగదు బదిలీ చేసుకునే వీలుంది. కానీ వాట్సాప్ పేమెంట్స్‌లో ఆ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు.
ప్రస్తుతం భారతీయ బ్యాంకుల్లో ఖాతాలు ఉండి... ఇక్కడి ఫోన్ నెంబర్లు ఉపయోగిస్తున్న యూజర్స్‌కి మాత్రమే పేమెంట్స్ చేయడానికి వీలు కలుగుతుంది. అంతర్జాతీయ ఫోన్ నంబర్లతో వాట్సాప్ ఉపయోగించే వారికి పేమెంట్ సేవలు అందుబాటులో ఉండవు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com