GOLD: అక్షరాల లక్ష పలుకుతున్న బంగారం

పసిడి ప్రియులకు బంగారం ధరలు మరోసారి షాకిచ్చాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో ఈ రోజు (మంగళవారం) బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,750 పెరిగి, రూ.92,900కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,000 పెరిగి, రూ.1,01,350గా నమోదు అయ్యింది. వెండి ధర మాత్రం ఈరోజు రూ.1,11,000 స్థిరంగా ఉంది. కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధర దాదాపు రూ.20 వేలకు పైనే పెరిగింది. ఈ స్థాయిలో బంగారం విలువ పెరగడం అనేది చరిత్రలో ఇదే తొలిసారి. దాదాపు 15 రోజుల్లో రూ.8వేలకు పైగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష దాటింది.
పెరుగుదలకు కారణమిదే
బంగారం.. ఓ పెట్టుబడి, ఆభరణం, శుభ సూచకం. అందుకే బంగారం ధరలు పెరిగినా, తగ్గినా సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు అందరి దృష్టి దీనిపైనే ఉంటుంది. కానీ, ఇప్పుడు బంగారం ధర టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. పాత రికార్డులను బద్దలు కొడుతూ పసిడి ధర రూ.లక్షకు చేరింది. కు చేరింది. ఏడాదిలో మూడు నెలల్లోనే బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో రానున్న ఏడాదిన్నర కాలంలో ఔన్స్ (28.3 గ్రాముల) బంగారం ధర 3,500 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని భోఫా గ్లోబల్ రిసెర్చ్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తమ పోర్ట్‌ఫోలియోలను మరింత సమర్థంగా మార్చుకోవడం కోసం ప్రస్తుతం తమ దగ్గరున్న 10 శాతం బంగారం నిల్వలను 30 శాతానికి పెంచుకోబోతున్నాయి. అదే గనుక జరిగితే బంగారం ధరలు భారీగా పెరగనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నాన్ కమర్షియల్ కొనుగోళ్లు 10 శాతం పెరిగితే.. బంగారం ధర రూ.లక్షకు చేరుతుందని అంచనా. ఈ స్థాయిలో బంగారం ధరలు దూసుకెళ్లడానికి గల కారణాల విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు
అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగానే ఉంటున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ ప్లాన్స్ వల్ల పెట్టుబడిదారుల్లో కొంత భయం మొదలైంది. దీంతో చాలా మంది బంగారం మీద పెట్టుబడి పెడతారు. మరోవైపు బంగారం, అమెరికా డాలర్ మధ్య విలోమ సంబంధం ఉంది. డాలర్ బలహీనపడినప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరలు పెరుగుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని మార్పులు, ఆర్థిక మాంద్యం లేదా ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు బంగారం ధరపై ప్రభావం చూపుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com