మీడియా రంగంలో మరో కీలక విలీనం, ఒప్పందం కుదుర్చుకున్న జీ గ్రూప్, సోనీ పిక్చర్స్

దేశీయ కార్పొరేట్ రంగంలో మరో కీలక విలీనం జరగబోతోంది. ఇప్పటికే సోనీ పిక్చర్స్ ఇండియాతో విలీన ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది. విలీన ఒప్పందాలపై సంతకాలు కూడా చేసినట్లు వెల్లడించింది. ఈ విలీనానికి డైరెక్టర్ల బోర్డు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు జీ ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారమిచ్చింది.
విలీన వార్తలతో ఇవాళ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్‌జోష్‌లో ట్రేడవుతోంది. ఇంట్రాడేలో ఈ స్టాక్ దాదాపు 24శాతం లాభపడి రూ.300 మార్కును దాటింది. ఇంట్రాడేలో రూ.319.60కు చేరిన ఈ స్టాక్ 52వారాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఇవాళ ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 6.70 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,401 కోట్లకు చేరింది. కంపెనీ ఈపీఎస్ 10.24, పీఈ 29.96గా ఉంది.
ఇక విలీన సంస్థ విషయానికి వస్తే కొత్తగా ఏర్పడే సంస్థలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు 47.07 శాతం, సోనీ పిక్చర్స్ ఇండియా 52.93 శాతం వాటా ఉంటుంది. ఈ సంస్థకు సంస్థ ఎండీ, సీఈఓగా ఐదేళ్ళపాటు పునీత్ గోయెంకా వ్యవహరించనున్నారు. ఒప్పందంలో భాగంగా విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో సోనీ పిక్చర్స్ 1.575 బిలియన్ డాలర్ల నిధులను ఇన్వెస్ట్ చేయనుంది.
వాటాదారులందరికీ ప్రయోజనం..
ఫైనాన్షియల్ పరంగానే కాకుండా వ్యూహాత్మక విలువను కూడా పరిగణలోకి తీసుకుని సోనీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు జీ ఎంటర్‌టైన్‌మెంట్ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. దక్షిణాసియాలో అధిక వృద్ధిని సాధించే సంస్థగా ఎదగడమే తమ లక్ష్యమని, విలీనం తర్వాత ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి అవకాశమని తెలిపింది. అలాగే కంపెనీ వాటాదారులందరికీ ఈ విలీనం ఎంతో లాభదాయకమని జీ ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడించింది.
నిర్వహణపై క్లారిటీ..
ఇక నిర్వహణకు సంబంధించి ఇరుసంస్థలు ఒక క్లారిటీకి వచ్చాయి. లీనియర్ నెట్‌వర్క్స్, డిజిటల్ అసెట్స్, ప్రొడక్షన్ ఆపరేషన్స్, ప్రోగ్రాం లైబ్రరీస్ వంటి వ్యవహారాలను ఇరు కంపెనీలు సమానంగా పంచుకోనున్నాయి. తాజాగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలుకు ముందు చేయాల్సిన ప్రక్రియను పూర్తి చేసేందుకు 90 రోజుల గడవును నిర్దేశించుకున్నారు. ఈ సమయంలో జీ ప్రమోటర్లు అండ్ ఫ్యామిలీ తమ వాటాను పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ సంస్థలో జీ ప్రమోటర్లు, కుటుంబ సభ్యులకు 4శాతం వాటా ఉండగా.. తాజా నిర్ణయంతో ఈ వాటా 20శాతానికి పెంచుకునేందుకు అవకాశం ఏర్పాడింది.
బోర్డులో సోనీకే అగ్రతాంబూలం..
కొత్తగా ఏర్పడే బోర్డులో సోనీ గ్రూప్‌కే అధిక ప్రాధాన్యం లభించే అవకాశముంది. జీ గ్రూప్‌తో పోలిస్తే సోనీకి సంస్థలో మెజార్టీ వాటా ఉండటమే దీనికి కారణం. అందువల్ల జీ గ్రూప్‌తో పోలిస్తే విలీనం తర్వాత ఏర్పడే బోర్డులో సోనీ గ్రూప్ నుంచి ఎక్కువ మంది డైరెక్టర్లు ఉండనున్నారు.
కంటెంట్ క్రియేషన్ కింగ్ జీ గ్రూప్..
కంటెంట్ క్రియేష్‌న్‌లో చక్కని అనుభవం ఉన్న జీ గ్రూప్... గత మూడు దశాబ్దాలుగా తమ ప్రసారాల ద్వారా వినియోగదారులకు చేరువైంది. మరోవైపు గేమింగ్, స్పోర్ట్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో చక్కని అనుభవం ఉన్న సోనీ మంచి విజయాలను అందుకుంది. దీంతో ఇరు సంస్థలు కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో కొత్త సంస్థకు భారీ ఆదరణ లభించడంతో పాటు వ్యూహాత్మక విలువ చేకూరుతుందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com