Akkineni Nagarjuna : 50 యేళ్ల అన్నపూర్ణ స్టూడియో

Akkineni Nagarjuna :  50 యేళ్ల అన్నపూర్ణ స్టూడియో
X

తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్ కు తరలించడంలో అక్కినేని నాగేశ్వరరావు కృషి, చొరవ ఎవరూ మర్చిపోలేనిది. ఎక్కడో చెన్నైలో ఉన్న ఇండస్ట్రీని ఇక్కడికి తీసుకురావడానికి ఆయన వేసిన మొదటి అడుగు అన్నపూర్ణ స్టూడియో. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎప్పటికప్పుడు టెక్నికల్ గా, స్టూడియో పరంగా అప్డేట్ అవుతూ.. వేల సినిమాలకు సౌకర్యాలు కల్పించిన ఈ స్టూడియో నిర్మాణం పూర్తయి 50యేళ్లవుతోంది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పంచుకున్నాడు. 50 యేళ్ల క్రితం అంటే 1975 ఆగస్ట్ 13న సరిగ్గా సంక్రాంతి పండగ రోజే స్టూడియో నిర్మాణం ప్రారంభమైందన్న విషయాన్ని పంచుకుంటూ ఓ వీడియోను కూడా జత చేశాడు. ఈ స్టూడియో ప్రారంభానికి ఆ నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ దంపతులు వచ్చిన విషయాన్ని మరికొందరు గుర్తు చేసుకున్నారు.

ఆ నాటి నుంచి అన్నపూర్ణ స్టూడియో కొన్ని వేల కథలను చెప్పింది. వేలమంది టెక్నీషియన్స్ ను అందించింది. స్టూడియో నుంచి నిర్మాణ సంస్థగా ఎంతోమంది కొత్త ప్రతిభావంతులను పరిశ్రమకు అందించింది. నిజానికి ఈ స్టూడియో నిర్మాణానికి ముందే ఇక్కడ సారథి స్టూడియో ఉంది. అయినా తెలుగు సినిమా అంటే కేరాఫ్ మద్రాస్ గా ఉన్న అడుగులను హైదరాబాద్ కు మల్లించింది అక్కినేని నాగేశ్వరరావు. ఆ కాలంలో కొందరు సినీ పెద్దలకు ఇది ఇష్టం లేకపోయినా.. మెల్లగా ఏఎన్నార్ తర్వాత జమున, ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు కూడా తరలి రావడం.. అలాగే మద్రాస్ లో కొంత ఆధిపత్య భావన పెరగడం, ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకుని మరికొన్ని స్టూడియోల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం, షూటింగ్స్ కు సంబంధించి రాయితీలు, ఇళ్ల నిర్మాణానికి ధరలు తగ్గించడం.. ఇలాంటి వన్నీ చేయడంతో 90ల తర్వాతే తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు పూర్తిగా షిఫ్ట్ అయింది.

నిజానికి ఇప్పుడు స్టార్స్ గా చెప్పుకుంటోన్న రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రానా వంటి వాళ్లెంతోమంది మద్రాస్ లోనే పుట్టారు. ఏదేమైనా అన్నపూర్ణ స్టూడియో అంటే తెలుగు సినిమాకు ఓ తలమానికం. ఆ ఆభరణం ప్రారంభమై 50యేళ్లు అంటే.. ఇక్కడ పరిశ్రమ నిలబడేందుకు వేసిన పునాదికీ 50యేళ్లు అనే చెప్పాలి.

Tags

Next Story