Kiran Abbavrama : ఈ 14న వస్తోన్న సినిమాలేంటీ..?

కొన్నాళ్లుగా ఫ్రైడే వస్తోందంటే చాలు.. అదేదో క్లియరెన్స్ సేల్ లా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటిలో చాలా వరకూ కామన్ ఆడియన్స్ కు అస్సలు తెలియదు కూడా. గత వారం ఏకంగా 14 సినిమాలు రిలీజ్ అయితే ఇది ఆకట్టుకుంది అనేందుకు బాలీవుడ్ నుంచి వచ్చిన ఛావా తప్ప మరోటి కనిపించలేదు. మరి ఈ వారం ఎన్ని మూవీస్ ఉన్నాయి అంటే ఈ సారి పెద్దగా పోటీ లేదు. ఉన్నంతలో ఎక్కువగా ఆకట్టుకుంటోంది కిరణ్ అబ్బవరం నటించిన ‘దిల్ రుబా’. రుక్షర్ థిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని విశ్వ కరుణ్ డైరెక్ట్ చేశాడు. ‘క’తర్వాత వస్తోన్న మూవీ కావడంతో ఆడియన్స్ లో ఈ మూవీపై కొన్ని అంచనాలున్నాయి. కిరణ్ అబ్బవరం మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.
ఇక నేచురల్ స్టార్ నాని నిర్మించిన ‘కోర్ట్’ మూవీ 14నే విడుదలవుతోంది. ప్రియదర్శి, శివాజీ, రోహిణి, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ పోక్సో చట్టంలోని లోపాలను, ఆ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరును తెలుపుతూ రూపొందిందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కంటెంట్ బేస్డ్ మూవీగా కనిపిస్తోంది. ఈ సినిమా నచ్చకపోతే తన హిట్ 3 కూడా చూడొద్దు అని ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు నాని.
ఇక మళయాలంలో హిట్ అయిన ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా 14న విడుదలవుతోంది. ఈ చిత్రం గురించి రివ్యూస్, మౌత్ టాక్ తప్ప ఆర్టిస్టులెవరూ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఓటిటిల్లో రెగ్యులర్ గా మళయాల చిత్రాలు చూసేవారికి తెలుస్తుంది. కుంచకో బోబన్, ప్రియమణి, జగదీష్, విశాఖ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించారు. జితూ అష్రఫ్ డైరెక్టర్.
ఈ మూడు సినిమాలతో పాటు 2010లో విడుదలైన యుగానికి ఒక్కడు చిత్రాన్ని తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. కార్తీ, రీమా సేన్, ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీ రాఘవ డైరెక్ట్ చేశాడు. ఇవి కాక మరో రెండు మూడు పెద్దగా పేరు లేని చిత్రాలు విడుదలవుతున్నాయి.
సో.. మొత్తంగా చూస్తే ఈ డేట్ కిరణ్ అబ్బవరంకు బాగా కలిసొచ్చేలా ఉంది. పైగా ప్రమోషన్స్ కూడా స్ట్రాంగ్ గా చేసుకుంటున్నాడు. తన సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నాడు. కోర్ట్ మూవీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే ప్రేక్షకులను ఏ మేరకు ఎంగేజ్ చేస్తుందో చెప్పలేం. ఇక మళయాల మూవీ మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యేదాకా ఉంటే ఆశ్చర్యమే. యుగానికి ఒక్కడు ఏ మేరకు ఆడియన్స్ ను థియేటర్స్ వరకూ రప్పిస్తుందో అప్పుడే చెప్పలేం. సో.. ఈ వారం కిరణ్ అబ్బవరంకు బాగా వర్కవుట్ అవుతుందనే చెప్పాలి. కాకపోతే కంటెంట్ లోనూ బలం ఉండాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com