Youtuber Bhargav : ఒక్క తప్పుకు జీవితకాల నరకం
మనిషి జీవితం ఒక వరం. ఆ వరాన్ని ఆనందకరంగా మలచుకోవడమే జీవితానికి అసలైన పరమార్థం. ఆధిపత్యం వల్లో, అహంకారం వల్లో, అండదండలున్నాయనో.. అతిగా ప్రవర్తిస్తే.. ఎక్కడో స్వర్గ నరకాల్లో కాదు.. ఈ అందమైన జీవితంలోనే అన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మనిషిని మనిషి గౌరవించడం, ప్రేమించడం.. ఎదుటి వారి ప్రవర్తనను బట్టి మన ఆలోచనలు మార్చుకోవడం.. పేర్చుకోవడం అనేది ఖచ్చితంగా చేయాలి. ఆ ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి. మనం ఎదుటి వారి నుంచి ఏం ఆశిస్తామో.. అది ముందుగా ఇవ్వాలి. ఇస్తేనే ఏదైనా వస్తుంది. అలా కాదని అడ్డగోలుగా ప్రవర్తిస్తే.. ఆనక జీవితాంతం వేదనను అనుభవించాలి.
అదృష్టమో, చేసిన కష్ట ఫలితమో కొందరికి తొందరగా ఫేమ్ వస్తుంది. ఆ ఫేమ్ ను నిలబెట్టుకోవడం అంటే ఫ్లేమ్(నిప్పు) తో చెలగాటం లాంటిది. జాగ్రత్తగా వాడుకుంటే వెలుగు అవుతుంది. తేడా వస్తే దహించి వేస్తుంది. ఒకేసారి దహనం అయితే ఫర్వాలేదు. కానీ నిత్య దహనం అనేదే జీవిత కాల వేదన. జీవితాంతం చెరగని మచ్చ. కెరీర్ అనేది నిత్యం నిర్మించుకునేది. ఏ రోజుకారోజు సరికొత్తగానే ఆలోచించాలి. మనల్ని మనం నిలబెట్టుకునేందుకు నిఖార్సైన వ్యక్తిత్వం అవసరం. చపల చిత్తమో, వయసు వేడిలోనో పొరపాట్లు చేస్తే వాటికి శిక్ష తప్పదు. చేసిన తప్పులను బట్టే శిక్షలు కదా.. ? అలా ఒక జీవిత కాల శిక్షకు గురయ్యాడు యూ ట్యూబర్ భార్గవ్.
ఒకప్పుడు తన వీడియోస్ తో ఎంతోమందికి వినోదాన్ని పంచిన యూ ట్యూబర్ భార్గవ్ ఇప్పుడు నిత్య వేదనకు గురి కాబోతున్నాడు. అందరినీ అలరించేందుకు ఎంతో ఆలోచించి ఉంటాడు. తనెంతో ప్రిపేర్ అయి ఉంటాడు. నటన, డిక్షన్ ను మెరుగుపరుచుకోవడంలో ‘కామెంట్స్’ రూపంలో వచ్చిన విమర్శలను సరి చేసుకుని వినోదాన్ని పంచి ఉంటాడు. కానీ తన వ్యక్తిత్వాన్ని సరిగ్గా తీర్చిదిద్దుకోవడంలో అతని ఆలోచన వక్రమార్గంలో వెళ్లింది. తనతో పాటు వీడియోస్ చేయడానికి వచ్చిన 13యేళ్ల అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ముందుగా ఆమె న్యూడ్ వీడియోస్ తీశాడు. బెదిరించాడు. లోబరుచుకున్నాడు. పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఫలితంగా ఆ అమ్మాయి గర్భం దాల్చింది. తల్లితండ్రులకు విషయం తెలిసింది. కేస్ పెట్టారు. పోక్సో చట్టం అమలయ్యే కేస్ కాబట్టి.. వెంటనే అరెస్ట్ చేశారు. ఇన్నాళ్ల విచారణ తర్వాత తాజాగా కోర్ట్ భార్గవ్ కు 20యేళ్ల జైలు శిక్ష విధించింది. 4 లక్షలు డబ్బులు ఆ అమ్మాయికి చెల్లించాలని ఆదేశించింది. డబ్బుదేముందీ.. ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు అనే మాట తరచూ వింటుంటాం. కానీ జీవితం. జారిపోయిన ఒక్క క్షణాన్ని కూడా తిరిగి సంపాదించుకోలేం కదా. 20 యేళ్ల జైలు అంటే చిన్న విషయమా. పోనీ ఆ కుర్రాడేమైనా అన్నీ అనుభవించాడా అంటే లేదు. ఓ పాతికేళ్లుంటాయోమో. తను నిజాయితీగా ఉండి ఉంటే ఈ 20 యేళ్ల కాలంలో ఎన్నో సాధించి ఉండేవాడు. సాధించకపోయినా కనీసం తన జీవితాన్ని తనకు నచ్చినట్టు బ్రతికే వాడు. కుటుంబానికి తల్లి తండ్రులకు మంచి పేరు తెచ్చేవాడేమో. కనీసం వారికి తలవంపులు లేని జీవితం అయినా గడిపి ఉండేవాడు. కానీ ఇప్పుడేమైందీ..? బ్రతికి ఉండీ అక్కరకు రాలేని కొడుకయ్యాడు. ప్రాణాలతోనే ఉండీ.. పదిమంది స్నేహితులతో మాట్లాడలేని జీవనం అయింది.
ఆవేశం.. శారీరకమైనా, మానసికమైనా.. రెండూ పనికి రానివే. అదుపు తప్పిన ఆవేశం ఎప్పుడూ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది అనేందుకు భార్గవ్ జీవితం ఓ ఉదాహరణ. దీన్నుంచి పాఠాలు నేర్చుకుని జీవితంలో ఎదుగుతున్నవాళ్లే కాదు.. ఎదిగిన వాళ్లు కూడా తప్పులు చేయకుండా ఉంటేనే మనుగడ ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఇలా జైలు గోడల మధ్య శిథిలం అయిపోతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com