HBD Sridevi : అతిలోక సుందరి గురించి అద్భుత విషయాలు..!

HBD Sridevi : అతిలోక సుందరి గురించి అద్భుత విషయాలు..!
శ్రీదేవి.. ఏ దేవి వరమో.. దేవతలూ అసూయపడే అందం పొందింది.. బాలనటిగా భలేగా చేసి, పదేహేనేళ్లకే పదహారేళ్ల వయసుతో వచ్చింది.

శ్రీదేవి.. ఏ దేవి వరమో.. దేవతలూ అసూయపడే అందం పొందింది.. బాలనటిగా భలేగా చేసి, పదేహేనేళ్లకే పదహారేళ్ల వయసుతో వచ్చింది. తెల్లారబోతోంటే కల్లోకి చేరి.. వయోభేదం లేకుండా నయాజొరం తెప్పించింది. చెల్లెలికాపురంలో అన్నకు అక్కకోసం దేవతలా మారి.. బడిపంతులు తాతతోనూ ఆకుచాటు తడిసిన పిందెలా ఆడిపాడి.. వయసుమళ్లిన హీరోలతోనూ ప్రేమాభిషేకం చేయించుకుంది. ఆకాలం ప్రేక్షకుల అనురాగ దేవతలా.. కలకాల తరగని అభిమానం సంపాదించింది.. కమలాసన్ కే కన్నుకుట్టేలా వసంతకోకిలలా మైమరపించి..బాలీవుడ్ లో వండర్ చేసి.. ఓ రేంజ్ కు వెళ్లిపోయింది. లిమిటెడ్ హీరోస్ తో అన్ లిమిటెడ్ రొమాన్స్ చేసి, మిస్టర్ ఇండియాస్ నూ మెస్మరైజ్ చేసి.. వెండితెర వెలుగులే వెలవెలబోయే తళుకులు చూపించి.. తళుక్కున మాయమైన శ్రీదేవి జయంతి ఇవాళ..

కొన్ని జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. దానికి ప్రాణాలతో పనిలేదు. తలపులు మాత్రం ఉంటాయి. ఆ తలపులు మదిలో ఉన్నంత కాలం ఆ మనుషులు మనసులోనే ఉంటారు. అది అభిమానించే వారి స్థాయిని బట్టి మారుతూ ఉన్నా.. అభిమానాల్లో మాత్రం తేడా ఉండదు. అలాంటి అరుదైన అభిమానాన్ని, అభిమానుల్ని సంపాదించుకున్న రేరెస్ట్ బ్యూటీ శ్రీదేవి. అలాంటి అభిమానులందరినీ హతాశులను చేస్తూ హఠాత్తుగా ఆ లోకానికి వెళ్లిపోయింది శ్రీదేవి. కానీ దశాబ్ధాలు దాటినా ఆ జ్ఞాపకం మరపురానిది.. చెరిగిపోనిది.. అలాంటి తరిగిపోని అభిమానం సొంతం చేసుకున్న అతిలోక సుందరి శ్రీదేవి.

ఓ సిరిమల్లె పువ్వులా.. జామురాతిరి జాబిలమ్మలా.. పాలచుక్కలు.. తేనెబొట్టులు కలిపి రంగరించిన అతిలోక సుందరి.. శ్రీదేవి. దక్షిణాది, ఉత్తరాదిలో అత్యధిక కాలం ఓ వెలుగు వెలిగిన ఘనత ఈ దేవిది. పదహారేళ్ల వయసు చిత్రం నుంచే.. ఆరేళ్ల పిల్లల నుంచి అరవైయేళ్ల వారి వరకూ అందరి మనసులూ దోచుకున్న సమ్మోహనం శ్రీదేవి. ఒకప్పుడు తెల్లారబోతుంటే కల్లోకి వచ్చిన అందం ఆమెది. అందానికి.. అభినయానికి.. పసితనానికి.. పరువానికి.. అద్దం పట్టిన అతిలోక సుందరి శ్రీదేవి.

తమిళంలో అరంగేట్రం చేసి.. తెలుగులో డ్రీం గర్ల్ గా మారిన శ్రీదేవి.. బాలీవుడ్ లో థండర్ థైస్ గా అదరగొట్టింది. హిమ్మత్ వాలా.. సద్మా.. చాందినీ.. చాల్ బాజ్.. వంటి సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ నెంబర్ గేమ్ లో నంబర్ వన్ అయింది. కెరీర్ లో శ్రీదేవికి ఇప్పటి వరకూ ఒక్క నేషనల్ అవార్డు రాలేదు కానీ ప్రేక్షకుల నుంచి బోలెడెన్ని రివార్డులు వచ్చాయి. నటనలో శ్రీదేవిది స్పెషల్ మోర్. ఇప్పటికి మానసిక అనారోగ్యం ఉన్న పాత్రలు ఎవరైనా హీరోయిన్ చేయాలంటే వసంత కోకిలలో శ్రీదేవినే తమ గైడ్ గా భావిస్తారు.

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగుతూ.. సౌత్ లోనూ అడపాదడపా సినిమాలు చేస్తోన్న టైమ్ లో సడెన్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది శ్రీదేవి. ఆమె పెళ్లి వార్త విని ఎందరో అభిమానుల హృదయం ముక్కలైంది. ఆ పెళ్లి అచ్చమైన అభిమానులకు నచ్చలేదు. కానీ జీవితం ఊహలకు తగ్గట్టుగా ఉండదు కదా. తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్. మధ్యలో బుల్లితెర ప్రవేశం. మరోవైపు ఇద్దరు పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగానే ఎప్పుడూ కనిపించింది

సినిమాలు చేసినా చేయకున్నా.. ఏ తెరపైనా కనిపించకపోయినా అసలు శ్రీదేవి లేని ఫిల్మ్ ఇండస్ట్రీని ఊహించలేదు చాలామంది. అంతలా తనదైన ముద్రవేసిన నటి తను. మరణానికి ముందు కూడా తెలుగులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరై తెలుగువారిపై అభిమానం చాటుకుంది. రాజమౌళికి సంబంధించిన వివాదంలోనూ ఎంతో హుందాగా ప్రవర్తించి మనసులు దోచుకుంది.

Tags

Next Story