Aamani: అవకాశాలు రావాలంటే చెప్పిన చోటుకు రావాలన్నారు: ఆమని

Aamani: సినిమా ఇండస్ట్రీలో నిలబడడం అంత ఈజీకాదు.. అందరూ మంచి వాళ్లు ఉండరు.. అలాగని అందరూ చెడ్డ వాళ్లు ఉండరు.. ఆమాటకొస్తే ఏ పరిశ్రమలో అయినా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే తామేంటో నిరూపించుకుంటారు మహిళలు. అసమానతలు ఎక్కడైనా ఉంటాయి. వాటన్నింటినీ అధిగమించాలి. నటన మీద ప్యాషన్‌తో సినిమా రంగంలోకి అడుగు పెట్టేవారు చాలా మందే ఉంటారు. సీనియర్ నటి ఆమని తనకు ఎదురైన అనుభవాలు చెప్పుకొచ్చారు.
తండ్రి డిస్ట్రిబ్యూటర్.. ఆమనికి చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండడంతో నటిగా రాణించాలని కలలు కనేది. కానీ తండ్రి అందుకు ఒప్పుకోలేదు. కానీ ఆమని ఇష్టం చూసి చివరకు ఓకే చెప్పారు. మొదట తమిళ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఆమని తాను అవకాశాల కోసం రెండేళ్లు ఇబ్బందులు పడ్డానని తెలిపింది. అవకాశం ఇస్తామంటూనే తమకు నచ్చినట్లు ఉండమనేవారు. ఒంటరిగా వచ్చి కలవమనేవారు. షూటింగ్ స్పాట్లో తల్లి ఎప్పుడూ తోడు ఉండడంతో వాటిని అధిగమించానని తెలిపింది. ఒక్కోసారి చాలా బాధపడేదాన్నని, అప్పుడు నాన్న మాట విని వుంటే బావుండేదేమో అని అనిపించేది. అయితే కొన్ని రోజుల తరువాత తెలుగులో జంబలకిడి పంబ సినిమాలో ఆఫర్ వచ్చింది. దాంతో నా కెరీర్ గాడిలో పడింది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారడానికి దోహదపడింది అని ఆమని తెలిపారు.
ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తున్న ఆమని చిరంజీవితో నటించాలన్న కోరిక తీరలేదని చెప్పారు. ఓ అభిమానిగా ఇటీవల ఆయన్ని కలిసి ఫోటో దిగానని చెప్పారు. తనకు చిరంజీవితో రిక్షావోడు చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి పోయిందన్నారు. మొదట తనను అడిగి, ఆ తరువాత ఆ కేరక్టర్‌కి నగ్మాను ఎంపిక చేశారని తెలిపారు. ఎందుకు అలా చేశారో తెలియదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com