Aamir Khan: మా కుటుంబం విషయంలో నేను ఆ తప్పు చేశాను: అమీర్ ఖాన్ పశ్చాత్తాపం

Aamir Khan: మా కుటుంబం విషయంలో నేను ఆ తప్పు చేశాను: అమీర్ ఖాన్ పశ్చాత్తాపం
Aamir Khan: అమీర్ తన రెండు విడాకుల వ్యవహారం వెనుక కారణాన్ని చెప్పాడు.

Aamir Khan: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు 57 ఏళ్లు. ఇన్నేళ్లు సినీ రంగంలో సక్సెస్ ఫుల్ గా నెట్టుకొచ్చాడు. ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో అమీర్ తన రెండు విడాకులకు సంబంధించిన కారణాన్ని చెప్పాడు. కుటుంబానికి తగిన సమయం ఇవ్వలేనంతగా బిజీ అయిపోయానని, కెరీర్‌పై దృష్టి సారించడంలోనే నిమగ్నమైపోయానని తెలిపాడు. భర్తగా, పిల్లలకు తండ్రిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తించలేదు.. ఆ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అన్నాడు.

కెరీర్ తొలినాళ్లలో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు.. ఇరా ఖాన్, జునైద్ ఖాన్. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత అమీర్, రీనా విడాకులు తీసుకున్నారు. తరువాత అతను చిత్రనిర్మాత కిరణ్ రావుని వివాహం చేసుకున్నాడు. వారికి ఆజాద్ రావ్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత గత ఏడాది కిరణ్ రావు నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాడు అమీర్.


అమీర్, కిరణ్ రావుతో విడాకుల ప్రకటన వెలువడిన వెంటనే, వేరొకరితో ఉన్న సంబంధం కారణంగానే కిరణ్ కి విడాకులు ఇచ్చాడని సోషల్ మీడియాలో వదంతులు వెల్లువెత్తాయి. కానీ తరువాత, అమీర్.. అప్పుడు, ఇప్పుడూ ఎవరూ లేరని తెలిపాడు.

నేను ఎప్పుడూ నా బాధ్యతలను మోయలేదు. నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు, నా మొదటి భార్య - రీనా జీ, కిరణ్ జీ, రీనా తల్లిదండ్రులు, కిరణ్ తల్లిదండ్రులు, నా పిల్లలు, వీళ్లందరూ నా సన్నిహితులే. నాకు 18 ఏళ్ళ వయసున్నప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను.

ఆ సమయంలో చాలా నేర్చుకోవాలని, చాలా చేయాలని అనుకున్నాను. విలువైన సమయమంతా సినిమాలకే వెచ్చించాను. ఈ రోజు నేను ఆ విషయం గ్రహించాను - నాతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు నేను ఏమి ఇవ్వలేకపోయానో ఇప్పుడు తెలుసుకున్నాను.


నా కుటుంబం నాతోనే ఉందనుకున్నాను కానీ వారికి నేను అవసరమైన సమయాల్లో లేననే విషయాన్ని గుర్తించలేకపోయాను. మంచి సినిమాల్లో నటించాలని, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని అనుకున్నాను. పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యాను. నా కుటుంబం నా కోసం ఎదురుచూస్తుందన్న విషయం మర్చిపోయాను."

అమీర్ తన కూతురు ఇరా గురించి మాట్లాడుతూ.. ఆడుకునే వయసులో ఆమె పక్కన నేను లేను. "ఇది నా పెద్ద తప్పు (పిల్లలతో తగినంత సమయం గడపలేకపోవడం). అలా అని నేను నా వృత్తిని నిందించట్లేదు. ఈ రోజు, ఇరా వయస్సు 23, కానీ ఆమె 4-5 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, నేను ఆమె కోసం సమయం కేటాయించలేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను.

ప్రతి పిల్లవాడికి వారి తల్లిదండ్రులు అవసరం. ఎందుకంటే పిల్లలకు చిన్నతనంలో కొన్ని భయాలు, కొన్ని ఆశలు ఉంటాయి. కానీ ఆమె భయపడినప్పుడు ఆమె చేయి పట్టుకోవడానికి నేను ఆమె పక్కన లేను. ఆ క్షణం తిరిగి రాదని నాకు తెలుసు. ఇప్పుడు బాధపడి కూడా ప్రయోజనం లేదు.. అంతా అయిపోయిన తరువాతే అర్థం అవుతుంది.. చేజారిన క్షణం తిరిగి రాదు అని ఆవేదనగా మాట్లాడాడు అమీర్ ఖాన్.

అమీర్ 'లాల్ సింగ్ చద్దా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్ట్ లో విడుదల కానుంది. అమీర్ నటించిన హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ కూడా ఆగస్ట్ లోనే విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story