G Marimuthu : 'జైలర్' నటుడు కన్నుమూత

G Marimuthu : జైలర్ నటుడు కన్నుమూత
గుండెపోటుతో నటుడు మరిముత్తు మృతి

బహుముఖ ప్రజ్ఞాశాలి, ఇటీవలే రజినీ కాంత్ 'జైలర్' లో నటించిన మరిముత్తు తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమకు తీరని విషాదం. 57 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆయన మరణించారనే వార్త ఇప్పుడు సినీ పరిశ్రమను శోక సంద్రంలోకి నెట్టింది. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

మరిముత్తు సహాయ దర్శకుడిగా, ఆ తరువాత నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 1999లో అజిత్ నటించిన 'వాలి'తో మరిముత్తు తన నటనా రంగ ప్రవేశం చేసాడు. తదనంతరం, ఆయన 2008లో కన్నుమ్ కన్నుమ్‌తో దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ దర్శకత్వ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.

తన దర్శకత్వానికి ముందు, మరిముత్తు మణిరత్నం, వసంత్, సీమాన్, SJ సూర్య వంటి ప్రఖ్యాత చిత్రనిర్మాతల మార్గదర్శకత్వంలో సహాయ దర్శకుడిగా తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. రీసెంట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్‌'లో చివరి సారిగా తెరపై కనిపించాడు. ఈ మూవీలో ఆయన ఓ కీలక క్యారెక్టర్ ను పోషించాడు. దాంతో పాటు అతను 'యుద్ధం సే (2011)', 'కోడి (2016)', 'బైరవ (2017)', 'కడైకుట్టి సింగం (2018)', 'శివరంజినియుమ్ ఇన్నుమ్ సిల పెంగళం (2021)', 'అత్రంగి రే (2021)' లాంటి పలు హిందీ చిత్రాలతో సహా అనేక తమిళ చిత్రాలలో సహాయక పాత్రల్లో నటించాడు. ఇక కమల్ హాసన్ మూవీ 'భారతీయుడు 2' లోనూ మరిముత్తు ఓ పాత్ర పోషించాడు. ఇదే ఆయన చివరి సినిమాగా చెప్పవచ్చు.

జి మరిముత్తు మరణవార్త తమిళ సినీ పరిశ్రమలో దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ప్రతిభావంతులైన కళాకారుడు, చిత్రనిర్మాతకు నివాళులు అర్పించేందుకు అనేక మంది ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేసేందుకు ముందుకు వచ్చారు. జి మరిముత్తు అంత్యక్రియలు మధురైలో ఈ రోజు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ కష్ట సమయంలో అతని కుటుంబానికి పలువురు ప్రముఖులు తమ హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story