Adah Sharma Health: సినిమాలకు విరామం ప్రకటించిన అదా శర్మ.. లేటెస్ట్ పోస్ట్ వైరల్

Adah Sharma Health: సినిమాలకు విరామం ప్రకటించిన అదా శర్మ.. లేటెస్ట్ పోస్ట్ వైరల్
X
తన ఆరోగ్యంపై హెల్త్ అప్ డేట్ రివీల్ చేసిన అదా శర్మ

వివాదాస్పద చిత్రంగా ఇటీవలే రిలీజైన 'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అదే స్థాయిలో మంచి వసూళ్లను కూడా రాబట్టింది. అయితే ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించి, మెప్పించిన హీరోయిన్ అదా శర్మ ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్వయంగా ఆమే స్పందించారు. దద్దుర్ల కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. మెడికల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆమెకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆమె కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి చికిత్స నిమిత్తం అదా శర్మ కొన్ని రోజులు నటనా జీవితానికి విరామం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే తన రాబోయే ప్రాజెక్ట్ కమాండోను ప్రమోట్ చేస్తానని శర్మ ధృవీకరించారు.

ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై స్పందించిన అదా శర్మ.. “ట్రిగ్గర్ వార్నింగ్: గ్రాఫిక్ ఇమేజెస్ ఎహెడ్” అనే పేరుతో కొన్ని ఫొటోలను పంచుకున్నారు. తన ఆరోగ్యంపై తనకు తెలియని వారి నుంచి చాలా మెసేజ్ లు వచ్చాయని, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అందమైన చిత్రాలను మాత్రమే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయకూడదని అనుకున్నానని, ఈ దద్దుర్లను చూసి భయపడవద్దని చెప్పుకొచ్చారు. మొదట్లో తనకు దద్దుర్లు వచ్చాయని, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపించాయని, దీని వల్ల కొన్ని రోజులుగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పారు. "శరీరంపై దద్దుర్లు రావడంతో ఫుల్ స్లీవ్స్ తో కవర్ చేసే దాన్ని. ఈ మధ్య కాలంలో ఒత్తిడి కారణంగా నా ముఖంపైనా దద్దుర్లు వచ్చాయి. దీంతో మందులు తీసుకోవడం మొదలుపెట్టాను. కానీ అవి కూడా అలర్జీకి దారి తీశాయి. ఇప్పుడు ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నాను" అని అదా చెప్పుకొచ్చారు.

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకుంటానని అమ్మకు మాటిచ్చానని కూడా అదా తెలిపారు. “నేను మా అమ్మకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని వాగ్దానం చేసాను. రేడియో ట్రయల్స్, జూమ్ ఇంటర్వ్యూలు, ప్రోమో షూట్‌లకు బదులుగా ఆరోగ్యంపై దృష్టి పెట్టమని మా అమ్మ నాకు చెప్పింది. నేను త్వరలోనే తిరిగి వస్తాను. అప్పటి వరకు నేను కమాండో సన్నివేశాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్ చేస్తూనే ఉంటాను" అని అదా మొత్తానికి తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

అదా ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు అంతకుముందు పలు కథనాలు వచ్చాయి. ఈ నివేదికల ప్రకారం ఆమెకు వాంతులు ప్రారంభమయ్యాయని, డయేరియా, ఫుడ్ అలర్జీతో బాధపడుతున్నారు. ఇదిలా ఉండగా అదా శర్మ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కమాండోలో ఆగష్టు 11 న కనిపించనుంది. ఇందులో ఆమె భావనా ​​రెడ్డి పాత్రను పోషించనున్నారు.

Tags

Next Story