Aishwarya Rai : ఐశ్వర్య రాయ్ కి ఢిల్లీ హైకోర్టులో ఊరట..

బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. తన పేరు, ఫొటోలు, వ్యక్తిగత ప్రతిష్టను అనుమతి లేకుండా వాణిజ్యపరంగా, అశ్లీల ప్రయోజనాల కోసం కొందరు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం, ఐశ్వర్య వ్యక్తిగత హక్కులకు (పర్సనాలిటీ రైట్స్) రక్షణగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని సంకేతాలిచ్చింది.
జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఐశ్వర్య తరఫున సీనియర్ న్యాయవాది సందీప్ సేథి వాదనలు వినిపిస్తూ, ఆన్‌లైన్ సంస్థలు, వ్యక్తులు ఆమె కీర్తిని దారుణంగా దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “ఇది చాలా షాకింగ్‌గా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. నా క్లయింట్ పేరు, ముఖం వాడుకుని డబ్బు సంపాదిస్తున్నారు” అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
‘ఐశ్వర్య నేషన్ వెల్త్’ అనే ఒక సంస్థ ఆమె ఫొటోను తమ లెటర్‌హెడ్‌పై ముద్రించి, ఐశ్వర్య ఆ సంస్థకు ఛైర్‌పర్సన్‌గా ఉన్నారని తప్పుగా చూపిందని న్యాయవాది తెలిపారు. ఇంకా, ఐశ్వర్య రాయ్ ఫొటోలతో టీషర్టులు, వాల్‌పేపర్లు అమ్ముతూ ఆమె హక్కులను ఉల్లంఘిస్తున్నారని వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ కరియా, ప్రతివాదులకు వ్యతిరేకంగా తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
ఇదే తరహాలో నటుడు జాకీ ష్రాఫ్ వేసిన పిటిషన్‌పై కూడా ఈ ఏడాది మే నెలలో ఢిల్లీ హైకోర్టు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 15కి వాయిదా వేశారు. దీనిపై పూర్తిస్థాయి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com