Pushpa : 'పుష్ప' చిత్రంలో బన్నీకి యాస నేర్పించింది ఎవరో తెలుసా..

Pushpa : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తగ్గేదే లే అంటూ చిత్తూరు యాసలో మాట్లాడి కొత్త ట్రెండ్‌ని సృష్టించాడు.. పుష్పని చూసి ప్రతి ఒక్కరూ తగ్గేదేలే అంటున్నారు. కట్ట మీద కూచుని కూతలు కూసేదాంట్లో ఏవుందికానీ.. నీలల్లో దిగితే తెలుస్తబ్బా లోతు.. ప్రతి నాయకుడి పాత్రలో సునీల్ డైలాగ్ డెలివరీకి థియేటర్లో చప్పట్లు.
సినిమా షూటింగ్ అంతా తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరగ్గా.. అందులోని సంభాషణలు చిత్తూరు యాసలో పలికించారు డైరెక్టర్ సుకుమార్. నటీనటులకు ఆ యాస నేర్పిన ముగ్గురు యువకుల్లో నాయుడు పేట మండలం పూడేరుకు చెందిన చరణ్ ఒకరు. ఇదే చిత్రంలో అతడికి నటించే అవకాశం కూడా దక్కింది.
శ్రీకాళహస్తిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన చరణ్ నెల్లూరు, చిత్తూరు జిల్లాల యాసపై పట్టు సాధించారు. అదే అతడికి పుష్పలో అవకాశం తెచ్చిపెట్టింది.
పూణేలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం దొరికినా నటనపై అసక్తితో హైదరాబాద్ వచ్చాడు.. అవకాశాల కోసం ఫిల్మ్‌నగర్ వీధుల్లో చక్కర్లు కొట్టినా ఉపయోగం లేదు.. దాంతో సొంతూరు పూడేరు వెళ్లి మూడు నెలలు ఆటో నడిపాడు.. స్నేహితుల సలహాతో మళ్లీ హైదరాబాదు చేరుకున్నాడు.
2020 మార్చిలో పుష్ప చిత్రంలో నటించేందుకు అవకాశం వచ్చింది. చరణ్ చిత్తూరు యాసలో మాట్లాడడం చూసి సుకుమార్ ముచ్చటపడ్డారు. సినిమాకు చిత్తూరు యాస ప్రధానం కావడంతో నటీనటులకు యాస నేర్పించే అవకాశం చరణ్‌కి కల్పించారు దర్శకుడు సుకుమార్.
పుష్ప సక్సెస్‌తో చరణ్‌కి మరికొన్ని చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇక ఈ చిత్రంలో నటిస్తున్నప్పుడే చరణ్ ఓ ఇంటివాడు కూడా అయ్యాడు.. దాంతో పుష్ప తనకి లైఫ్‌ని వైఫ్‌ని కూడా ఇచ్చిందని చరణ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com