Allu Arjun : అల్లు అర్జున్ కు పరామర్శల వెల్లువ

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన తర్వాత చాలామంది ఎమోషనల్ గా మారుతున్నారు. నిన్ననే బెయిల్ వచ్చినా.. డాక్యుమెంట్స్ జైలుకు సమర్పించడం ఆలస్యం కావడంతో అతను అనివార్యంగా రాత్రి జైలులోనే ఉండాల్సి వచ్చింది. అయితే ఉదయాన్నే 6 గంటల తర్వాత చంచల్ గూడ జైలు బ్యాక్ గేట్ నుంచి రిలీజ్ చేశారు జైలు అధికారులు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు. అలాగే అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
ప్రస్తుతం ఇంటి వద్దే ఉన్న అల్లు అర్జున్ ను పరామర్శించడానికి ఇండస్ట్రీ మొత్తం క్యూ కట్టింది. హీరోలతో పాటు నిర్మాతలు, దర్శకులు ఆయన వద్దకు వెళ్లి పలకరిస్తున్నారు. సుకుమార్ అయితే ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇతర హీరోలంతా ధైర్యం చెబుతున్నారు. విశేషం ఏంటంటే.. కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పలకరించారు. ఈ ఇద్దరూ కలిసి సన్నాఫ్ సత్యమూర్తిలో కలిసి నటించారు. అప్పటి నుంచి స్పెషల్ బాండింగ్ ఉంది.
దిల్ రాజు నిన్న మధ్యాహ్నం నుంచి స్టేషన్ కు వెళ్లాడు. అప్పటి నుంచి సాయంత్రం వరకూ అల్లు అరవింద్ కు తోడుగానే ఉన్నాడు. మైత్రీ నిర్మాతలు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కనిపించారు.
మొత్తంగా ప్రస్తుతం అల్లు అర్జున్ ఇల్లు సందర్శకులతో నిండిపోయింది. అయితే ఈ కేస్ లో అల్లు అర్జున్ కు వచ్చింది కేవలం బెయిల్ మాత్రమే. క్లీన్ చిట్ రాలేదు. సో రాబోయే రోజుల్లో ఈ కేస్ కు సంబంధించి అన్ని కోర్ట్ వ్యవహారాలకు అతను అటెండ్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా బిఎన్ఎస్ 105 సెక్షన్ అల్లు అర్జున్ పై అప్లై అయితే ఖచ్చితంగా ఐదు నుంచి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ముందు ఈ సెక్షన్ నుంచి అతన్ని తప్పించే ప్రయత్నం స్టార్ట్ అవుతుందేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com