నారప్ప సైకిలెక్కిన అమ్ము.. ఎవరీ అభిరామి..

అమ్ము అభిరామి అసురన్‌లో మరియమ్మగా నటించి తమిళ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు తెలుగులోనూ నారప్పకు సరిజోడిగా తన నటనను కనబరిచినందుకు ప్రేక్షకుల ప్రశంసలందుకుంటోంది. అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ఉన్న ఆమెను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు.
నారప్ప ఫ్లాష్ బ్యాక్‌లో వెంకటేశ్ ప్రేయసిగా కనిపించిన అమ్ము చెన్నైలో పుట్టి పెరిగింది. 17 ఏళ్లకే వెండి తెరపై ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. నటనకు తోడు అదృష్టం కూడా తోడై అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.
తెలుగులోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఎర్లీగా ఇండస్ట్రీలోకి ఎంటరైన అమ్ము తొలి తమిళ చిత్రం కార్తీక్‌తో 'తీరన్ అధికారామ్ ఒండ్రు' లో నటించింది. ఇండస్ట్రీకి వచ్చిన నాలుగేళ్లలోనే విష్ణు విశాల్, కాశీ వెంకట్, విక్రమ్ ప్రభు, బాలా శరవణన్, ఆర్జే షా వంటి ప్రసిద్ద నటులతో ఆమె నటించింది.
2017లో వచ్చిన విజయ్ 'భైరవ' చిత్రంలో మెడికల్ కాలేజీ స్టూడెంట్‌గా కనిపించింది. మరుసటి ఏడాది తమిళ రాచ్చసన్.. తెలుగులో రాక్షసుడు చిత్రంలో హీరో మేనకోడలి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఫాదర్ ఆఫ్ చిట్టి ఉమా కార్తీక్ (ఎఫ్‌సీయూకే) చిత్రంలో ఉమగా అలరించింది.
ఇలా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న అమ్ముకు కెరీర్ తొలి నాళ్లలోనే మణిరత్నం చిత్రంలో నటించే అవకాశం నిజంగా అదృష్టం. ఆయన తెరకెక్కిస్తున్న నవరస సినిమాలో ఓ ప్రాధాన్యత ఉన్న పాత్రలో అభిరామి నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com