Viswak Sen : 22న 7 సినిమాలు వస్తున్నాయి

Viswak Sen :  22న 7 సినిమాలు వస్తున్నాయి
X

సినిమా రూపొందించడం కంటే రిలీజ్ చేయడం పెద్ద టాస్క్ కొందరికి. చిన్న సినిమాలకైతే ఒక డేట్ దొరికితే చాలు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అందుకే కాస్త గ్యాప్ వస్తే చాలు.. అందరూ ఒకేసారి పొలోమని వచ్చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు పోటీ కూడా గట్టిగానే ఉంటుంది. అలా ఈ వారం విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, దేవకి నందన వాసుదేవ, జీబ్రాతో పాటు మరో నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. అంటే వచ్చే శుక్రవారం 7 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా రూపొందిన మెకానిక్ రాకీకి రవితేజ ముళ్లపూడి దర్శకుడు. ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో ఇదే కాస్త పెద్దది. విశ్వక్ ఇమేజ్ కు తగ్గట్టుగా కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందినట్టుగా ఉందీ మూవీ. రెండు ట్రైలర్స్ కూడా మాస్ నే టార్గెట్ చేసుకుని ఉన్నాయి. మరి విశ్వక్ కు ఎలాంటి ఓపెనింగ్ వస్తుందో చూడాలి.

మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్, మానస వారణాసి జంటగా రూపొందిన సినిమా దేవకి నందన వాసుదేవ. ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించాడు. అర్జున్ జంధ్యాల దర్శకుడు. అంతకు ముందు ఎలాంటి బజ్ లేదు కానీ.. ట్రైలర్ తర్వాత అంచనాలు పెరిగాయి. శ్రీ కృష్ణుడి కథను సోషలైజ్ చేస్తూ అక్కడక్కడా మురారిని గుర్తుకు తెచ్చినా.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపిస్తోందీ మూవీ. అశోక్ ఇప్పటి వరకూ ప్రూవ్ చేసుకోలేదు. ఈ మూవీతో బాక్సాఫీస్ ను గెలవాల ని ప్రయత్నిస్తున్నాడు.

సత్యదేవ్, సత్యరాజ్, ధనంజయ, సత్య, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జీబ్రా. చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ్ అయిన ఈ మూవీపై ఆడియన్స్ లో పెద్దగా అంచనాలు లేవు కానీ.. డార్క్ కామెడీ థీమ్ లో కనిపిస్తోంది. బ్యాంకింగ్ సిస్టమ్ పై సెటైర్ అంటున్నారు. ఆల్రెడీ లక్కీ భాస్కర్ చూశాం కాబట్టి.. వీళ్లు ఎలాంటి కథ చెబుతారో చూడాలి.

జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ నిర్మించిన ‘కేశవ చంద్ర రమావత్’(కేసీఆర్) అనే మూవీ కూడా విడుదలవుతోంది. ఈ సినిమాకు సపోర్ట్ గా జబర్దస్త్ టీమ్ అంతా వచ్చింది. మరి ఆ సపోర్ట్ అతను బాక్సాఫీస్ వద్ద నిలబడేందుకు సరిపోతుందా లేదా అనేది 22న తేలుతుంది.

ఇక వీరితో పాటు రోటీ కపడా రొమాన్స్, సన్నిలియోన్ టైటిల్ రోల్ చేసిన మందిర, సినిమా పిచ్చోడు అనే సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే అందరి దృష్టీ ఎక్కువగా మెకానిక్ రాకీ, దేవకి నందన వాసుదేవ, జీబ్రా మూవీస్ పైనే ఎక్కువగా కనిపిస్తోంది.

Tags

Next Story