Nithiin : నితిన్ .. ఈ సారైనా హిట్ కొడతాడా

పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని ఒకప్పుడు తెలంగాణ పవర్ స్టార్ అనేంత వరకూ వచ్చాడు నితిన్. కానీ అతని కెరీర్ ఎప్పుడూ నిలకడగా లేదు. ఒక్క హిట్టు పడితే నాలుగైదు ఫ్లాపులు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయి. మరి ఆ హిట్ జోష్ లో తర్వాత ఎంచుకునే కథల్లో ఏం చూసి ఒప్పుకుంటాడో కానీ.. ఇప్పుడు కూడా భీష్మ తర్వాత చెక్, రంగ్ దే, మేస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్, రాబిన్ హుడ్ అంటూ ఏకంగా ఏడు ఫ్లాపులతో ఉన్నాడు. వీటిలో రంగ్ దే కాస్త ఫర్వాలేదు అనిపించుకుంది అంతే. మరి ఇన్ని ఫ్లాపులు అంటే ఏ హీరోకైనా కాన్ఫిడెన్స్ ఖతమ్ అయిపోతుంది. అయినా ఇప్పుడు తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ టైటిల్ తో ‘తమ్ముడు’గా వస్తున్నాడు.
శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన తమ్ముడును దిల్ రాజు నిర్మించాడు. ఇట్రెస్టింగ్ తారాగణం కనిపిస్తోంది. నితిన్ కు అక్కగా నిన్నటి తరం హీరోయిన్ తెలుగు నటి లయ రీ ఎంట్రీ ఇస్తోంది. తనతో పాటు కాంతార ఫేమ్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వాసిక వంటి ఫీమేల్ లీడ్ ఉన్నారు. వీరిలో నితిన్ కు అసలైన జంటగా ఎవరు నటిస్తున్నారో సినిమా చూస్తే కానీ తెలియదేమో. ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ చూస్తే ఎప్పట్లానే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా.. ట్రైలర్ మాత్రం ఫైరింగ్ లా ఉంది. ఓ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసిన కథలా కనిపిస్తోంది. అలాగని మరీ కొత్తదనం లేదు. బట్ పాత కథలే అయినా కొత్తగా చెబితే ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. అందుకు ఎన్నో సినిమాలు ఉదాహరణలుగా ఉన్నాయి.
నితిన్ కు బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఎప్పుడో ఫేడవుట్ అయిపోయేవాడు అని అందరికీ తెలుసు. అతని అకౌంట్ లో అన్ని ఫ్లాపులు ఉన్నాయి. ఇష్క్ కంటే ముందు ఏకంగా డజను ఫ్లాపులు ఉన్న హీరో అతను. విశేషం ఏంటంటే.. అతని అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కు కూడా జల్సాకు ముందు అన్నే ఫ్లాపులు ఉన్నాయి. అయితే పవన్ రేంజ్ వేరు. ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా నిర్మాతలు నష్టపోయిన సందర్భాలు చాలా తక్కువ. ముఖ్యంగా అప్పట్లో. బట్ నితిన్ కథ వేరు. సినిమా పోయిందంటే నిర్మాత మునిగిపోయినట్టే. ఇంక ఈ తమ్ముడు సినిమాకు అతని కెరీర్ లోనే హయ్యొస్ట్ బడ్జెట్ తో రూపొందించారు. ఇప్పటి వరకూ 50 కోట్ల మార్కెట్ కూడా లేని నితిన్ పై ఏకంగా 70 కోట్లు పెట్టారు. ఓ రకంగా ఇది చాలా పెద్ద పందేరం. మరి ఈ పందేరంలో బ్లాక్ బస్టర్ టాక్ తో గెలిస్తే మాత్రం నితిన్ కు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా మారుతుంది సిట్యుయేషన్. ఏదేమైనా ప్రస్తుతం నితిన్ కెరీర్ కు తమ్ముడు ఫలితం కీలకం కాబోతోందని ఖచ్చితంగా చెప్పొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com