Karuppu : ఇంకెన్నాళ్లీ తమిళ్ టైటిల్స్..?

మనవాళ్లు ఉట్టి వెధవాయిలోయ్.. అని ఊరికే అనలేదా పెద్దాయన. చూపించేవాడికి చూసేవాడంటే లోకువ అన్నట్టుగా ఉంది తమిళ్ మేకర్స్ ధీమా. నిజంగా ఇది ధీమానే. కాదంటే తెలుగు వారి అలసత్వం. లేకపోతే తమిళ్ సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ తెలుగులోనూ తమిళ్ టైటిల్ నే పెడుతున్నారు. నిజంగా ఇది ఆక్షేపణీయం. ఒకవైపు తెలుగు భాషను బ్రతికించడం అంటూ గగ్గోలు పెడుతున్న వాళ్లు కూడా దీన్ని చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నారు. ఇటువైపు సినిమావాళ్లేమో కేవలం బిజినెస్ అయితే చాలు.. తెలుగు భాష గురించి మాకెందుకు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కొన్నాళ్లుగా తమిళ్ నుంచి వస్తోన్న సినిమాల టైటిల్స్ చూస్తే వాళ్ల డామినేషన్ ఇక్కడెంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు వాళ్లు ‘అడాప్టెడ్ సన్ ఆఫ్ టాలీవుడ్’అని ముద్దుగా ఇంగ్లీష్ లో పిలుచుకునే సూర్య మూవీకి కూడా అదే అరవ టైటిల్ పెట్టడం చూస్తే తెలుగు వారిని, ప్రేక్షకులను వాళ్లు ఎంత లైట్ గా తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రానికి అక్కడ ‘కరుప్పు’ అనే టైటిల్ పెట్టుకున్నారు. కరుప్పు అంటే నలుపు అని అర్థం. తెలుగులో కూడా అదే తమిళ్ టైటిల్ తో ఏకంగా టీజర్ రిలీజ్ చేశారు. దీనిపై చాలా తక్కువ మంది మాత్రమే సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. అంతకు ముందు కూడా వలిమై, వేట్టైయాన్, కంగువ, అమరన్, అయలాన్, తంగలాన్ వంటి తమిళ్ టైటిల్స్ నే తెలుగులోనూ పెట్టేస్తున్నారు.
ఏదేమైనా ఇది తెలుగును చులకన చేయడమే. తెలుగు నేలపై తెలుగు వారిని లెక్క చేయకపోవడమే. ఇప్పటికైనా ఆ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నవాళ్లు ఈ తప్పును సరిదిద్దాలి. తమిళ్ సినిమాలకు తెలుగులోనే టైటిల్ పెట్టాలి. అలా పెడితేనే రిలీజ్ చేస్తాం అని ఖచ్చితంగా చెప్పాలి. లేదంటే రాబోయే రోజుల్లో థియేటర్స్ వద్ద నిరసనలు కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com