Kalyan Ram : అర్జున్ వర్సెస్ అఘోరి.. విన్నర్ ఎవరో..?

Kalyan Ram :  అర్జున్ వర్సెస్ అఘోరి.. విన్నర్ ఎవరో..?
X

సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి టాలీవుడ్ కు సాలిడ్ హిట్ పడలేదు. కేవలం రెండు చిన్న సినిమాలే పెద్ద విజయం సాధించాయి. మిగతావేవీ ఆకట్టుకోవడం లేదు.కమర్షియల్ గా వర్కవుట్ కావడం లేదు. ఈ ఏప్రిల్ టాలీవుడ్ కు పెద్ద బూస్టప్ ఇస్తుందనుకుంటే ఇదీ చప్పగానే స్టార్ట్ అయింది. ఇక గత వారం వచ్చిన జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రాలు డిజాస్టర్ అనిపించుకున్నాయి. దీంతో అందరి దృష్టీ నెక్ట్స్ వీక్ పై పడింది. ఈ వారం రెండు భిన్నమైన సినిమాలు వస్తున్నాయి. కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన అర్జున్, సన్నాఫ్ వైజయంతి, తమన్నా నటించిన ఓదెల 2. మరి ఈ రెండు సినిమాల్లో ఎవరికి ఎక్కువ విజయావకాశాలున్నాయి అంటే రెండూ హిట్ అయ్యేలానే కనిపిస్తున్నాయనే చెప్పాలి.

నటిగా చాలా గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరుతో రీ ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి. కానీ ఆ సినిమాలో ఆమె ఇమేజ్ అనుకున్నంతగా ఎలివేట్ కాలేదు. తనకు టైలర్ మేడ్ రోల్ లాంటిది అయిన పోలీస్ ఆఫీసర్ గా అర్జున్ సన్నాఫ్ వైజయంతిగా వస్తోంది. ఈ మూవీ టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయశాంతి మరోసారి అదరగొట్టబోతోందని అందరికీ అర్థం అయింది. కళ్యాణ్ రామ్ కొత్తవారికి అవకాశం ఇచ్చిన ప్రతిసారీ హిట్ కొట్టాడు. అందుకే దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కూడా అతనికి విజయం ఇవ్వబోతున్నాడనే పాజిటివ్ వైబ్స్ ఈ సినిమా మొత్తానికీ కనిపిస్తున్నాయి. ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతోంది.

ఇక ఓదెల చిత్రంతో ఓ మోస్తరుగా మెప్పించిన దర్శకుడు అశోక్ తేజ ఈ సారి ఓదెల 2 అంటూ వస్తున్నాడు. అప్పుడూ ఇప్పుడూ ఈ రెండు కథలు అందించింది మరో దర్శకుడుసంపత్ నంది. అయితే ఓదెలతో పోలిస్తే ఓదెల 2 రేంజ్ మారింది. తమన్నా ఎంటర్ కావడంతో సినిమా స్థాయి పెరిగింది.వీటితో పాటు పెరిగిన బడ్జెట్ వల్ల గ్రాండ్ లుక్ తో కనిపిస్తోంది. తమన్నా అఘోరీకగా ఫస్ట్ టైమ్ నటించింది. హారర్ డోస్ డబుల్ అయింది. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ తో మరో స్థాయిలో కనిపిస్తోంది. టీజర్, ట్రైలర్ తో బిజినెస్ లో బూస్ట్ వచ్చింది. ఎలా చూసినా ఓదెల 2పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ ఈ నెల 17న విడుదలవుతోంది.

మరి ఈ రెండు సినిమాలూ ఒకే రోజు రాకున్నా.. ఒకే వారం విడుదలవుతున్నాయి కాబట్టి రెండు సినిమాల మధ్య పోటీ కనిపిస్తుంది. ఓదెల 2 ముందే వస్తోంది కాబట్టి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే అర్జున్ సన్నాఫ్ వైజయంతికి గట్టి పోటీ ఇస్తుందని చెప్పాలి. కాకపోతే రెండూ భిన్నమైన జాన్రాలో వస్తోన్న మూవీస్ కాబట్టి అర్జున్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే రెండూ ఏప్రిల్ లో సాలిడ్ హిట్స్ గా నిలుస్తాయి.

Tags

Next Story