Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. ఎన్‌సీబీపై ఆరోపణలు..

Aryan Khan (tv5news.in)
Aryan Khan Drugs Case: ముంబై క్రూజ్ డ్రగ్స్ వ్యవహారంలో కొత్త మలుపులు తీసుకుంటోంది. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టైన డ్రగ్స్ కేసులో తొమ్మిది మందిని ఎన్‌సీబీ సాక్షులుగా పేర్కొంది. తాజాగా ఈ కేసు నార్కోటిక్ అధికారుల మెడకే చుట్టుకునేలా ఉంది. దర్యాప్తు సంస్థ ఎన్‌సీబీపైనే ఇపుడు ఆరోపణలు గుప్పుముంటున్నాయి. ఒకవైపు శివసేన ఎంపీ, మరోవైపు సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి ఎన్‌సీబీపైనే సంచలన ఆరోపణలు చేశారు.
ఈ కేసులో పరారీలో ఉన్న గోసవీ-దర్యాప్తు సంస్థ మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడుస్తోందని కలకలం రేపారు ప్రభాకర్. అంతేకాకుండా ఈ డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ తనతో బ్లాంక్ పంచనామాపై బలవంతంగా సంతకం చేయించుకుందని ఆరోపించారు. ఎన్‌సీబీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారి నుంచి ఎన్‌సీబీ డబ్బులు అడుగుతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు.
తెల్ల కాగితాలపై ఎన్‌సీబీ సాక్షుల సంతకాలు తీసుకుంటోందని సంజయ్ రౌత్ ఆరోపించారు. ప్రభాకర్ సెయిల్ ఆరోపణలు చేసిన కాసేపటికే సంజయ్ రౌత్ ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేను టార్గెట్ చేస్తూ మహారాష్ట్ర మంత్రులు ఇప్పటికే ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై వాంఖడే పాటు ఎన్‌సీబీ త్రోసిపుచ్చింది.
ఒకవేళ ముడుపుల వ్యవహారం జరిగితే కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇంకా జైలులోనే ఎందుకుంటారు. దర్యాప్తు కార్యాలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయని.. అటువంటి సంఘటనలు జరిగే ఆస్కారమే లేదని ఖండించింది. దర్యాప్తు సంస్థ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు రివర్స్ అటాక్ ఇస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com