Anil Ravipudi : ప్రమోషన్స్ లో ఉన్న పస సినిమాలోనూ ఉంటుందా అనిల్..?
సంక్రాంతికి వస్తున్నాం.. ఈ టైటిల్ తో సినిమా చేయడం అంటే కాస్త తెలివైన పనే అని చెప్పాలి. మామూలుగా సంక్రాంతి సినిమాలన్నిటికీ పండగ ఫ్లేవర్ కనిపిస్తుంది. టైటిలే అది ఉంటే ఇంక చెప్పేదేముందీ.. పండగంతా మా సినిమాలోనే ఉంటుంది అని డైరెక్ట్ గానే చెప్పినట్టు. అలా ఎఫ్ 2, ఎఫ్3 తో హిట్ కాంబినేషన్ అనిపించుకున్న వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో ఈ మూవీ ఈ మంగళవారం విడుదల కాబోతోంది. సరిగ్గా సంక్రాంతి రోజున అన్నమాట. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ కావడం ఈ మూవీకి చాలా పెద్ద హెల్ప్ అయింది.
అయితే సంక్రాంతికి వస్తున్నాం కోసం ముందు నుంచీ భిన్నమైన ప్రమోషన్స్ తో ఆకట్టుకుంటున్నాడు అనిల్ రావిపూడి. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోలేదు. ముఖ్యంగా రమణ గోగులతో పాట పాడించడం అనే ఛాయిస్ హైలెట్ అయింది. అప్పటి నుంచి హీరోతో పాటు, హీరోయిన్లు, కమెడియన్స్ ను కూడా తెగ వాడుతున్నాడు. ఏం చేసినా సినిమాను ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకువెళ్లడమే అసలు పాయింట్ కాబట్టి అనిల్ చేస్తోన్నవన్నీ ఆకట్టుకుంటున్నాయి.
అయితే సినిమా ప్రపంచంలో ఒక సామెత ఉంటుంది.. విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్స్ పీక్స్ లో ఉంటాయి.. అనేదే ఆ సామెత. సంక్రాంతికి వస్తున్నాంలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏం ఉంటాయో అప్పుడే ఊహించలేం కానీ.. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రొటీన్ అన్న టాక్ వచ్చింది. రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా అనే మాటలూ వినిపించాయి. కంటెంట్ కంటే సంక్రాంతి సీజన్ నే ఎక్కువ నమ్ముకున్నారేమో అనే మాటలూ వచ్చాయి. అయితే ప్రమోషన్స్ కోసం వాడుతున్న ఐడియాస్ బావున్నాయి. అలాంటి కంటెంటే సినిమాలోనూ ఉంటే .. ఈ కామెంట్స్ అన్నిటికీ మూవీ రిజల్టే సమాధానం చెబుతుంది. లేదంటే.. ప్రమోషన్స్ లో ఉన్న పస సినిమాలోనూ ఉంటే బావుండేది అన్న విమర్శలు వస్తాయి.
ఏదేమైనా ఇలాంటి మూవీస్ పండగ టైమ్ లో బాగా ఎంటర్టైన్ చేస్తాయి. నిజంగానే చాలామంది భావించినట్టు.. కంటెంట్ కంటే కొన్నిసార్లు సీజన్ ప్లస్ అవుతుంది. సినిమాలూ సూపర్ హిట్ అవుతాయి. అలా ఈ మధ్య కాలంలోనే చాలా సినిమాలు సంక్రాంతి టైమ్ లోనే ప్రూవ్ చేశాయి. సో.. ఈ సంక్రాంతికి వస్తున్నాం కూడా అలాగే ప్రూవ్ చేసుకుంటుందేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com