Rajamouli: న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో బెస్ట్ డైరెక్టర్.. రాజమౌళికి అవార్డు

Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR గతేడాది విడుదలై సంచలనం సృష్టించింది. ఈ చిత్రం ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. జపాన్, అమెరికా తదితర దేశాల్లో ప్రత్యేకంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 15 కేటగిరీల కింద ఆస్కార్ అవార్డుల కోసం చిత్ర బృందం దరఖాస్తు చేసుకుంది.
ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం విభాగంలో 'ఆర్ఆర్ఆర్' గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైంది. ఇది 10వ తేదీన (భారత కాలమానం ప్రకారం జనవరి 11 తెల్లవారుజామున) అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరగనుంది. ఈ వేడుకకు చిత్రబృందం హాజరుకానుంది. కాగా, ఈ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును ప్రకటించారు.
ప్రముఖ దర్శకులు స్టీవెన్ స్పీల్‌బర్గ్, ఆర్నోఫ్స్కీ, సారా బోలీ, గినా ప్రిన్స్ బ్లైత్‌వుడ్‌ల పోటీ మధ్య రాజమౌళికి ఈ అవార్డును ప్రకటించడం తెలుగువారికి గర్వకారణం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ అవార్డు వేడుక న్యూయార్క్ నగరంలో జరిగింది. దీనికి భార్య రమతో కలిసి హాజరైన రాజమౌళి అవార్డు అందుకున్నారు.
ఈ అవార్డును అందుకున్న సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ''మీ నుంచి ఈ అవార్డు అందుకోవడం నాకు చాల సంతోషంగా ఉంది. మీరు ఈ అవార్డును అందించడం ద్వారా నా సినిమాలోని తారాగణం మరియు సిబ్బందిని సత్కరించినట్లైంది. సౌత్ ఇండియా నుంచి వచ్చిన ఓ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులను ఆకర్షించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, రాజమౌళికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com