నందమూరి నటసింహంకు పుట్టినరోజు శుభాకాంక్షలు

నందమూరి నటసింహంకు పుట్టినరోజు శుభాకాంక్షలు
X
జై బాలయ్య... జైజై బాలయ్య... బాలయ్య 63వ పుట్టినరోజు తెలుగు రాష్ట్రాలకు వేడుక

నందమూరి బాలకృష్ణ.. నటసార్వభౌముడికి వారసుడిగా వచ్చిన హీరో... తాతమ్మ కలతోనే తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నాడు.. పంచె కడితే పల్లెటూరి సింహంలా ఉంటాడు.. మీసం తిప్పితే అచ్చంగా సింహాన్నే తలపిస్తాడు.. తొడగొడితే.. రికార్డులన్నీ కనుమరుగైపోతాయ్.. సమరసింహమైనా.. నరసింహమైనా.. పాత్రలో లీనమైతే ఉగ్రనరసింహుడైపోతాడు.. సింహా.. ఆయన చేసిన సినిమా.. కానీ అభిమానులు ఆయనకు పెట్టుకున్న పేరు సింహం.. సీమ సినిమాలతో సింహమైనా.. బాక్సాఫీస్ వద్ద తెలుగువాడి పౌరుషాన్ని చూపిస్తూ.. ఆయన తెలుగుసీమకే నటసింహమైపోయాడు.

జానపదాల నుంచి పౌరాణికాల వరకూ.. ఫిక్షన్ నుంచి నుంచి ఫ్యాక్షన్ వరకూ.. చేయగల ఒన్ అండ్ ఓన్లీ లెజెండ్ బాలకృష్ణ బర్త్ డే ఇవాళ. ఆయన 63వ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జైబాలయ్య అంటూ... నినాదాలు చేస్తూ.. సంబరాలు చేసుకుంటున్నారు. తిరుమలలోనూ ఆయన జన్మదిన వేడుకుల్ని జరిపారు.

మహానటుడు ఎన్టీరామారావు నట వారసుడిగా వచ్చిన హీరో బాలకృష్ణ. తొలినాళ్లలో కేవలం ఎన్టీఆర్ కొడుకుగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య తర్వాత తనదైన ప్రతిభ, కృషితో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని అగ్రహీరోగా ఎదిగాడు. మాస్ హీరోగా అశేషాంధ్రులు అభిమానాన్ని సంపాదించుకున్నాడు. బాలయ్య లాగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించిన హీరో ఆయన సమకాలీకుల్లో ఇంకెవరూ లేరు. జనరేషన్స్ మారుతున్నా .. జనం గుండెల్లో చెరగని స్థానం బాలయ్యది. కరెక్ట్ కథ పడితే.. సిల్వర్ స్క్రీన్ నే డిక్టేట్ చేయగల అఖండుడు బాలయ్య.

సోలో హీరోగా బాలకృష్ణ నటించిన తొలి సినిమా 1984లో వచ్చిన సాహసమే జీవితం. ఈ సినిమా తర్వాత డిస్కో కింగ్, కె విశ్వనాథ్ డైరెక్షన్ లో జననీ జన్మభూమీశ్చ సినిమాలు చేశాడు. అయితే బాలయ్యకు తిరుగులేని ఇమేజ్ ను తెచ్చిన సినిమా అదే యేడాది విడులైన మంగమ్మగారి మనవడు. పల్లెటూరి పంచెకట్టులో అద్భుతమైన నటన చూపించిన ఈ సినిమాతోనే బాలయ్యకూ పర్సనల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అలాగే హీరోగా ఎంట్రీ ఇచ్చిన యేడాదిలోనే ఏడు సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు.

తొంభైవ దశకంలో నాటి టాప్ హీరోలందరి కెరీర్లో ఓ దశలో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అది యాదృచ్చికమే అయినా బొబ్బిలి సింహం తర్వాత బాలయ్యకు వరుసగా కొన్ని ఫ్లాపులు వచ్చాయి. ఆ ఫ్లాపులన్నీ మర్చిపోయేలా.. ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బద్ధలయ్యేలా ఓ బ్లాక్ బస్టర్ తో ఆ యేడాదికి గ్రాండ్ సెండాఫ్ ఇచ్చాడు బాలయ్య. అదే సమర సింహారెడ్డి. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాతో బాలయ్య సీమ పౌరుషానికే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు.

బాలకృష్ణ అంటే దర్శకుల హీరో. ఒక్కసారి కథ నచ్చి ఒకే చెప్పాడా ఇక ఆ విషయంలో ఎప్పుడూ వేలుపెట్టడు. అదే బాలయ్యను కొంతకాలం ఇబ్బందుల్లో పడేసింది. పూర్తిగా దర్శకులను నమ్మేయడంతో పాటు అప్పటికే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రూపంలో వచ్చిన రెండు భారీ విజయాలు.. బాలయ్యనూ ఊపిరి పీల్చుకోనివ్వలేదు. ఆ ఊపులో వచ్చిన ప్రతి సినిమాకూ ఓకే చెప్పారు. తన పాత్ర వరకూ చూసుకున్నాడో లేక.. సినిమా కథలు మొత్తం విన్నాడో తెలియదు కానీ.. చివరికి ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడేలాంటి కొన్ని సినిమాలు చేసి.. పరాజయాలు ఎదుర్కొన్నాడు.

సరైన కథ పడితే బాలయ్య విశ్వరూపం చూపిస్తాడు. అలాగని ఇతర పాత్రల్లో అలా చేయడని కాదు.. దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేయడమే ఆయన శైలి. ఆ శైలిని అద్భుతంగా పట్టుకుని బాలయ్యలోని నట సింహాన్ని మరోసారి ప్రేక్షకులకు చూపించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. సింహా.. బాలయ్య కెరీర్ లో ఖచ్చితంగా రావాల్సిన టైమ్ లో వచ్చింది. సింహాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చి.. మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడమే కాదు.. రెండో నంది అవార్డ్ నూ అందుకున్నాడు.

విజయం గాడి తప్పుతుందేమో అనుకుంటోన్న టైమ్ లో మరోసారి బోయపాటితో లెజెండ్ చేసి మళ్లీ రికార్డులు సరిచేశాడు. మొత్తంగా బాలయ్య కెరీర్ లో 2000 ముందు వరకూ ఉన్న విజయాల కంటే తర్వాత ఉన్న విజయాలు తక్కువ. అయితే ఈ కాలంలోనే ఆయన ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. వైవిధ్యమైన చిత్రాలు కూడా తగ్గించుకుని పూర్తి స్థాయి మాస్ అండ్ కమర్షియల్ సినిమాలకే ఓకే చెప్పాడు. కొన్ని బ్లాక్ బస్టర్ అయితే మరికొన్ని డిజాస్టర్స్ గా నిలిచాయి. అయినా బాలయ్య యాట్యిట్యూడ్ లో ఏ మార్పూ రాకపోవడమే ఆయన ఈ వయసులో కూడా అంత జాలీగా ఉండటానికి కారణం.

జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎప్పుడూ వరుస సినిమాలతో బిజీగా ఉండడమే నటసింహం స్టైల్. ఇక.. హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమైన బాలయ్యను మరోసారి బాక్సాఫీస్ లెజెండ్ గా నిలబెట్టిన చిత్రం ‘అఖండ‘. ‘సింహా, లెజెండ్‘ తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన ‘అఖండ‘ అద్భుతమైన విజయాన్ని సాధించింది.

Tags

Next Story