Balagam: చిన్న చిత్రం ఊహించని విజయం 'బలగం'.. అవార్డులు, పురస్కారాలు..

Balagam: స్టార్ హీరోలు లేరు.. కమర్షియల్ హంగులు లేవు.. కామెడీ హీరోలు లేరు.. అయినా బలగం చిత్రం అందర్నీ థియేటర్ వైపుకు నడిపిస్తోంది. బలమైన కథ ఉంటే ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని మరోసారి నిరూపించాడు వేణు యెల్దండి. విడుదలైన అన్ని చోట్లా సక్సెస్‌ఫుల్‌గా రన్నవుతోన్న సినిమాకు అవార్డులూ వరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఇప్పటికే బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు వరించాయి. తాజాగా మరో అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకుంది బలగం సినిమా. బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఒనికో ఫిల్మ్ అవార్డు (ఉక్రెయిన్) వరించింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి నాలుగు పురస్కారాలు దక్కడంపై చిత్ర దర్శకుడు వేణు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన బృందం వల్లే ఇదంతా సాధ్యమైందని అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఓ ఇంటి పెద్ద మరణం నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలే ఇతివృత్తంగా రూపొందిన సినిమా ఇది. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్ రామ్, రూపాలక్ష్మి, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం బలగం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రతి ఇంటా బలగం చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారంటే ఈ కథలో ఎంత బలం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పటి మాదిరిగా ఊరు ఊరంతా కలిసి ఒకచోట కూర్చుని సినిమా చూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com