Balagam: 15 ఏళ్లుగా మాట్లాడుకోని ముగ్గురు అన్నదమ్ములు 'బలగం' సినిమా చూసి..

Balagam: సినిమాలు చూసి జనం మారతారా.. నీతి, న్యాయం చెబితే ఎవరికి నచ్చుతుంది. ఓ మంచి సందేశంతో తీసిన సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తే అంతకంటే కావలసింది ఏముంది. దర్శకుడు తాను వంద శాతం సక్సెస్ అయినట్లు భావిస్తాడు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను, కుటుంబ వ్యవస్థను తెలియజెప్పిన సినిమా బలగం. బంధాలు, భావోద్వేగాలకు పెద్ద పీట వేసిన ఈ చిత్రం చూసిన ప్రతి ప్రేక్షకుడి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. తాజాగా బలంగం సినిమా చూసిన ఓ కుటుంబం కలహాలు వీడి ఒక్కటైంది. 15 ఏళ్లుగా ముగ్గురు అన్నదమ్ముల మధ్యా మాటల్లేవ్.. సినిమా వాళ్ల ఆలోచనల్లో మార్పు తెచ్చింది. అన్నదమ్ములు ముగ్గురు కలుసుకున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్టణంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద సోమవారం రాత్రి బలగం సినిమా ప్రదర్శించారు. గ్రామస్థులు భారీ సంఖ్యలో తరలివచ్చి సినిమా తిలకించారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు చూసి కన్నీటిపర్యంతం అయ్యారు. గ్రామానికి చెందిన అన్నదమ్ములు బొప్పరతి సంజీవ్, రాజేందర్, జనార్థన్ కుటుంబాలు కూడా సినిమా తిలకించాయి. మూడు కుటుంబాలు 15 ఏళ్లుగా మనస్పర్థలతో మాట్లాడుకోవడం లేదు. తల్లి తారాబాయి మంగళవారం ఉదయం వృద్ధాప్య కారణాలతో మృతి చెందింది. సినిమాలో మాదిరిగానే అన్నదమ్ములు ముగ్గురు కలిసిపోయారు. తల్లి అంతిమ సంస్కారాలను కలిసికట్టుగా నిర్వహించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com