నందమూరి నట 'సింహం'.. 'బాలకృష్ణ' బర్త్‌డే స్పెషల్
Balakrishna: నందమూరి బాలకృష్ణ.. నటసార్వభౌముడికి వారసుడిగా వచ్చిన హీరో... తాతమ్మ కలతోనే తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్నాడు.. ఆయన పంచె కడితే పల్లెటూరి సింహంలా ఉంటాడు.. మీసం తిప్పితే అచ్చంగా సింహాన్నే తలపిస్తాడు.. ఆయన తొడగొడితే.. రికార్డులన్నీ కనుమరుగైపోతాయ్.. సమరసింహమైనా.. నరసింహమైనా.. పాత్రలో లీనమైతే ఉగ్రనరసింహుడైపోతాడు.. సింహా.. ఆయన చేసిన సినిమా.. కానీ సింహం.. అభిమానులు ఆయనకు పెట్టుకున్న పేరు.. సీమ సినిమాలతో సింహమైనా.. బాక్సాఫీస్ వద్ద తెలుగువాడి పౌరుషాన్ని చూపిస్తూ.. ఆయన తెలుగుసీమకే నటసింహమైపోయాడు.. జానపదాల నుంచి పౌరాణికాల వరకూ.. ఫిక్షన్ నుంచి నుంచి ఫ్యాక్షన్ వరకూ.. చేయగల ఒన్ అండ్ ఓన్లీ లెజెండ్ బాలకృష్ణ బర్త్ డే ఇవాళ.
మహానటుడు ఎన్టీరామారావు నట వారసుడిగా వచ్చిన హీరో బాలకృష్ణ. తొలినాళ్లలో కేవలం ఎన్టీఆర్ కొడుకుగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య తర్వాత తనదైన ప్రతిభ, కృషితో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని అగ్రహీరోగా ఎదిగాడు. మాస్ హీరోగా అశేషాంధ్రులు అభిమానాన్ని సంపాదించుకున్నాడు. బాలయ్య లాగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించిన హీరో ఆయన సమకాలీకుల్లో ఇంకెవరూ లేరు. జనరేషన్స్ మారుతున్నా .. జనం గుండెల్లో చెరగని స్థానం బాలయ్యది. కరెక్ట్ కథ పడితే.. సిల్వర్ స్క్రీన్ నే డిక్టేట్ చేయగల అఖండుడు బాలయ్య.
ఎన్టీఆర్ లాంటి నటుడి నీడలో ఎదగడం కొంత వరకూ ఈజీయే కావొచ్చు కానీ.. ఆయనంతటి పేరు తెచ్చుకోవడం అంత సులువు కాదు. తన రక్తంలోనే నటన ఉందని నమ్మిన బాలకృష్ణ.. తండ్రి పేరు నిలబెట్టి... ఓ స్టార్ హీరోగా ఎదగడం వెనక ఎంతో కృషి ఉంది. 14యేళ్ల వయసులోనే 1974లో తాతమ్మ కల చిత్రంలో తండ్రితో పాటు తొలిసారిగా వెండితెరపై మెరిసాడు బాలయ్య. తర్వాత అన్న హరికృష్ణతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ రామ్ రహీమ్ తో ఆకట్టుకుని.. ఆ రోజుల్లోనే తండ్రి పేరు నిలబెట్టే లక్షణాలున్నాయని విశ్లేషకుల చేత అనిపించుకున్న ప్రతిభాశాలి బాలయ్య.
ఓ వైపు చదువుకుంటూనే తండ్రితో పాటు ఆయన నటించిన సినిమాల్లో కనిపించేవారు. అలా బాలకృష్ణలోని స్పార్క్ ను తొలిసారిగా చూపించిన సినిమా దానవీరశూరకర్ణ. ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాలకృష్ణ అభిమన్యుడిగా మంచి నటన చూపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పద్మవ్యూహం సన్నివేశంలో మహాభారత అభిమన్యుడు కూడా ఇలాగే ఉంటాడనేలా మెప్పించి ప్రశంసలందుకున్నాడు.
అలాగే అక్బర్ సలీమ్ అనార్కలి కూడా బాలయ్యను పరిపూర్ణ నటుడిగా మార్చే క్రమంలో వచ్చిందే. అక్బర్ తనయుడిగా అనార్కలి ప్రియుడిగా బాలయ్య నటన ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తుంది. మొత్తంగా టీనేజ్ లో ఉండగానే దాదాపు 11 సినిమాల వరకూ తండ్రి నీడలోనే నటించాడు.. అయినా సరే ఆయనతో పాటుగా తనదైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు.
సోలో హీరోగా బాలకృష్ణ నటించిన తొలి సినిమా 1984లో వచ్చిన సాహసమే జీవితం. ఈ సినిమా తర్వాత డిస్కో కింగ్, కె విశ్వనాథ్ డైరెక్షన్ లో జననీ జన్మభూమీశ్చ సినిమాలు చేశాడు. అయితే బాలయ్యకు తిరుగులేని ఇమేజ్ ను తెచ్చిన సినిమా అదే యేడాది విడులైన మంగమ్మగారి మనవడు. పల్లెటూరి పంచెకట్టులో అద్భుతమైన నటన చూపించిన ఈ సినిమాతోనే బాలయ్యకూ పర్సనల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అలాగే హీరోగా ఎంట్రీ ఇచ్చిన యేడాదిలోనే ఏడు సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాడు.
బాలకృష్ణ హీరోగా బిజీ అవుతున్న టైమ్ లోనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. దీంతో నాటి అగ్రదర్శకులంతా నెక్ట్స్ ఆప్షన్ గా బాలయ్యవైపే వచ్చారు. రావడమే కాదు.. బాలయ్యను కమర్షియల్ హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో ఒకరిని మించి ఒకరు పోటీపడ్డారు. ఆ క్రమంలో ఎవర్ గ్రీన్ అనదగ్గ ఎన్నో సినిమాలతో ఆడియన్స్ ను ఊపేశాడు బాలయ్య. వీటిలో చాలా వరకూ సూపర్ హిట్స్ ఉండటంతో బాలయ్య ప్రామిసింగ్ కమర్షియల్ హీరోగా స్టాండ్ అయిపోయాడు.
బాలకృష్ణ హీరోగా మారిన తర్వాత కె. రాఘవేంద్రరావుతో చేసిన తొలి సినిమాలోనే విజయశాంతి ఆయన జోడీగా నటించింది. ఈ జంటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఆ తర్వాత వీరి కాంబినేషన్ ఎవర్ గ్రీన్ పెయిర్ గా మారిపోయింది. వీళ్లిద్దరూ కలిసి దాదాపు పన్నెండు సినిమాల్లో నటిస్తే అందులో నైన్టీ పర్సెంట్ బ్లాక్ బస్టర్స్ ఉండటం విశేషం. మొత్తంగా 1984లో సోలో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన బాలయ్య ఆరేళ్లలోనే అగ్రహీరోగా ఎదిగాడు.
ఇక తొంభైల్లో బాలయ్య కెరీర్ లో ఓ వెలుగు వెలిగిందనే చెప్పాలి. మరోవైపు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి తన తరం హీరోలూ హవా చేస్తున్న తరుణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ఈ దశకంలో అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాడు. ఒక రకంగా 90వ దశకంలో బాలయ్య ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ అనదగ్గ సినిమాలు చాలానే చేశాడు. తన యాభైవ చిత్రం నారీ నారీ నడుమ మురారి నుంచి మొదలై ముద్దుల మేనల్లుడు, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్స్ పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం వరకూ అప్రతిహతంగా అద్భుత విజయాలతో కొనసాగింది ఆయన కెరీర్.
తొంభైవ దశకంలో నాటి టాప్ హీరోలందరి కెరీర్ ఓ దశలో చాలా ఇబ్బందులు పడింది. అది యాదృచ్చికమే అయినా బొబ్బిలి సింహం తర్వాత బాలయ్యకు వరుసగా కొన్ని ఫ్లాపులు వచ్చాయి. ఆ ఫ్లాపులన్నీ మర్చిపోయేలా.. ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బద్ధలయ్యేలా ఓ బ్లాక్ బస్టర్ తో ఆ యేడాదికి గ్రాండ్ సెండాఫ్ ఇచ్చాడు బాలయ్య. అదే సమర సింహారెడ్డి. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాతో బాలయ్య సీమ పౌరుషానికే బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు.
అప్పటి వరకూ వైవిధ్యానికి పెద్ద పీట వేసిన బాలయ్య సమర సింహారెడ్డి తర్వాత కొన్ని రాంగ్ స్టెప్స్ వేశాడు. కొన్ని రెగ్యులర్ కమర్షయల్ సినిమాలు చేశాడు. నిజానికి ఈ నాలుగూ వైవిధ్యమైనవే. కానీ సమరసింహారెడ్డి లాంటి సినిమా చూసిన తర్వాత బాలయ్యను మళ్లీ ఇలా చూడ్డం ఆడియన్స్ కు నచ్చలేదు. అందుకే మళ్లీ సీమకే షిప్ట్ అయిపోయాడు. ఈ సారి మరో బ్లాక్ బస్టర్. తన రికార్డులను తన సినిమాలే బద్దలు కొట్టిన ఆ సినిమా నరసింహనాయుడు. ఈ సినిమాతో తొలిసారిగా నటుడుగా నంది అవార్డ్ కూడా అందుకున్నాడు బాలయ్య.
బాలకృష్ణ అంటే దర్శకుల హీరో. ఒక్కసారి కథ నచ్చి ఒకే చెప్పాడా ఇక ఆ విషయంలో ఎప్పుడూ వేలుపెట్టడు. అదే బాలయ్యను కొంతకాలం ఇబ్బందుల్లో పడేసింది. పూర్తిగా దర్శకులను నమ్మేయడంతో పాటు అప్పటికే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రూపంలో వచ్చిన రెండు భారీ విజయాలు.. బాలయ్యనూ ఊపిరి పీల్చుకోనివ్వలేదు. ఆ ఊపులో వచ్చిన ప్రతి సినిమాకూ ఓకే చెప్పారు. తన పాత్ర వరకూ చూసుకున్నాడో లేక.. సినిమా కథలు మొత్తం విన్నాడో తెలియదు కానీ.. చివరికి ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడేలాంటి కొన్ని సినిమాలు చేసి.. పరాజయాలు ఎదుర్కొన్నాడు.
చాలా మంది కొత్త దర్శకులు.. ఆయనతో తొలిసారి చేసిన దర్శకులు దాదాపు ఫ్లాపులే ఇచ్చారు. ఈ టైమ్ లో రాఘవేంద్రరావుతో చేసిన పాండురంగడు కొంత వరకూ ఫర్వాలేదనిపించినా.. అది భక్తి చిత్రం కావడంతో బాలయ్య సినిమాగా నిలవలేకపోయింది. పైగా భక్తి కంటే రాఘవేంద్రరావు మార్క్ రక్తి ఓవర్ డోస్ కావడంతో కొన్ని విమర్శలూ వచ్చాయి.
సరైన కథ పడితే బాలయ్య విశ్వరూపం చూపిస్తాడు. అలాగని ఇతర పాత్రల్లో అలా చేయడని కాదు.. దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేయడమే ఆయన శైలి. ఆ శైలిని అద్భుతంగా పట్టుకుని బాలయ్యలోని నట సింహాన్ని మరోసారి ప్రేక్షకులకు చూపించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. సింహా.. బాలయ్య కెరీర్ లో ఖచ్చితంగా రావాల్సిన టైమ్ లో వచ్చింది. సింహాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చి.. మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడమే కాదు.. రెండో నంది అవార్డ్ నూ అందుకున్నాడీ సినిమాతో.
సింహా తర్వాత బాలయ్య ఎంచుకునే కథల్లో మార్పొచ్చింది. గతంలో లాగా కాకుండా ఖచ్చితంగా తన ఇమేజ్ కీ.. ఫ్యాన్స్ తనను ఎలా చూడాలనుకుంటున్నారో అనే అంశాలకూ ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. అందుకే పెద్దగా అనుభవం లేకున్నా దర్శకులు పరుచూరి మురళితో అధినాయకుడు, రవి చావలితో శ్రీ మన్నారాయణ చేశాడు. అయినా మళ్లీ సింహా లాంటి సినిమా కోసమే ఫ్యాన్స్ వెయిట్ చేశారు.
విజయం గాడి తప్పుతుందేమో అనుకుంటోన్న టైమ్ లో మరోసారి బోయపాటితో లెజెండ్ చేసి మళ్లీ రికార్డులు సరిచేశాడు. మొత్తంగా బాలయ్య కెరీర్ లో 2000 ముందు వరకూ ఉన్న విజయాల కంటే తర్వాత ఉన్న విజయాలు తక్కువ. అయితే ఈ కాలంలోనే ఆయన ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. వైవిధ్యమైన చిత్రాలు కూడా తగ్గించుకుని పూర్తి స్థాయి మాస్ అండ్ కమర్షియల్ సినిమాలకే ఓకే చెప్పాడు. కొన్ని బ్లాక్ బస్టర్ అయితే మరికొన్ని డిజాస్టర్స్ గా నిలిచాయి. అయినా బాలయ్య యాట్యిట్యూడ్ లో ఏ మార్పూ రాకపోవడమే ఆయన ఈ వయసులో కూడా అంత జాలీగా ఉండటానికి కారణం.
దర్శకుడు క్రిష్ తో కలిసి గౌతమీపుత్ర శాతకర్ణిగా తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి చూపించాడు. ఇది తన వందో సినిమా. బాలయ్య నటనకు భళా అన్నారంతా. ఆ వెంటనే పూరీ జగన్నాథ్ తో పైసా వసూల్ అనే సినిమా చేసిన తనదైన శైలిలో షాకిచ్చాడు. అయితే తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ గా చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రెండు భాగాలూ కాస్త నిరాశపరిచాయనే చెప్పాలి.
ప్రస్తుతం మరోసారి బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. అఖండ అనే పవర్ ఫుల్ టైటిల్ తో రాబోతోన్న ఈ మూవీ టీజర్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సారి కూడా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో ఆల్రెడీ రెండు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ సారి అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను దాటాలని.. రాబోయే రోజుల్లో బాలయ్య నుంచి మరిన్ని సూపర్ హిట్స్ రావాలని కోరుకుంటూ ఈ నందమూరి నట సింహానికి బర్త్ డే విషెస్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com