Balakrishna : పంచెకట్టులో పద్మభూషణ్ కు కదిలిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ.. తెలుగువారి నట సంపద. అన్న ఎన్టీఆర్ వారసత్వాన్ని అచ్చంగా పుణికిపుచ్చుకుని ప్రతిభ, క్రమశిక్షణతో తనకంటూ తిరుగులేని అభిమాన గణాన్ని సంపాదించుకున్న నటరత్నం. నూనూగు మీసాల ప్రాయంలోనే నటనా ప్రస్థానాన్ని ప్రారంభించి.. మీసం తిప్పి తొడ కొట్టాలంటే బాలయ్య తర్వాతే ఎవరైనా అనిపించుకునేలా చేసిన సమర సింహం. ఆయన చేయని పాత్ర లేదు.. చేయలేని పాత్రా లేదు. యాక్షన్ అయినా ఫిక్షన్ అయినా.. పౌరాణికం అయినా సాంఘికం అయినా.. ఫ్యాక్షన్ అయినా హిస్టారికల్ అయినా.. ఆయన దిగితే ఆ పాత్రకే వన్నె వస్తుంది. నటనతో ఆ పాత్రలకే జీవం పోస్తాడు. నటన గురించి మాట్లాడితే బాలయ్య చేసిన పాత్రలే ఆయన ప్రతిభకు తార్కాణం.
సామాజిక సేవలోనూ ఆయన చెయ్యి చాలా పెద్దదే. ఎంతోమందికి సాయం చేశారు. ప్రస్తుతం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ చైర్మన్ గా అరమరికలు లేని వైద్యాన్ని అందిస్తూ.. వైద్యో నారాయణో హరి అనే మాట వెనక ఆపన్న హస్తంలా నిలుస్తున్నారు. రాజకీయంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవిని వదులుకుని వెండితెరే తనకు అసలైన ఆనందాన్ని ఇస్తుందని చెప్పకనే చెబుతున్నాడు. ఇన్ని రంగాల్లో ఇంత ప్రతిభ చూపించారు కాబట్టే.. భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ బిరుదును ప్రకటించింది. ఈ సాయంత్రం (సోమవారం) ఆ అవార్డ్ ను అందుకునేందుకు కటుంబ సభ్యులతో కలిసి అచ్చమైన తెలుగువాడి పంచెకట్టులో తెలుగుదనం ఉట్టి పడుతుండగా అవార్డ్ అందుకున్న వైనం ఆయన అభిమానులకు కనుల విందుగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com