Bandla Ganesh : ప్రకాష్‌రాజ్ ప్యానల్ నుంచి తప్పుకున్న బండ్ల గణేష్..!

మా ఎన్నికలకు ముందు ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.. ప్రకాష్‌రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి బండ్ల గణేష్ అందరికీ షాకిచ్చారు.. అయితే, తాను వ్యక్తిగత కారణాల వల్లే తప్పుకుంటున్నట్లు ముందుగా ట్వీట్ చేశారు.. అధికార ప్రతినిధిగా తనను ఎన్నుకుందుకు ధన్యవాదాలు తెలుపుతూనే.. వ్యక్తిగత కారణాలతో ఆ పదవికి సంతృప్తికరంగా న్యాయం చేయలేకపోతున్నాను అన్నారు.. ఇంతలోనే కాసేపటికి మరికొన్ని ట్వీట్లు చేశారు. తాను జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
మాట తప్పను- మడమ తిప్పను, నాది ఒకటే మాట- ఒకటే బాట అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. మనస్సాక్షి ఎంత చెప్పినా మాట వినడం లేదని, పోటీ చెయ్, పోటీ చెయ్ అంటోందని అన్నారు. అందరికీ ఒక అవకాశం ఇచ్చారు.. ఒకే ఒక అవకాశం ఇవ్వండి, నేనేంటో చూపిస్తానంటూ కోరారు. రెండేళ్లుగా ప్రస్తుతం పదవుల్లో ఉన్నవారు ఏమీ చేయలేదని విమర్శించారు. పేద కళాకారులకు ఇళ్ల కల నిజం చేద్దామని, అదే నిజమైన అభివృద్ధి అని చెప్పుకొచ్చారు. జీవిత రాజశేఖర్, హేమ సైతం ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ పక్కకే వచ్చిన నేపథ్యంలో పోటీ ప్రకాష్ రాజ్ ప్యానల్‌కి, మంచు విష్ణు ప్యానల్‌కి మద్యే అన్నట్టుగా మారింది. ఇంతలో ఇప్పుడు బండ్ల గణేష్ తాను ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తానడానికి కారణం జీవితతో విభేదాల వల్లేనంటున్నారు. మెగా ఫ్యామిలీపై గతంలో జీవిత రాజశేఖర్ చేసిన విమర్శల నేపథ్యంలోనే, ఇప్పుడు వారు తమ ప్యానల్ వైపు వచ్చినా తాను ఒప్పుకునేది లేదన్నట్టుగా ఉంది బండ్ల గణేష్ వ్యవహారం.
నిజానికి ప్రకాష్‌రాజే వెళ్లి జీవితరాజశేఖర్‌ను కలిసారు. అంతా కలిసి ముందుకు వెళ్తామని ప్రతిపాదించారు. ఆ తర్వాత వారంతా కూడా ఒకే ప్యానల్ కిందకు వచ్చారు. తీరా ఇప్పుడు బండ్ల గణేష్ జీవితను వ్యతిరేకిస్తూ ప్యానల్ నుంచి బయటకు రావడం చర్చనీయాంశమైంది. ప్రకాష్‌రాజ్ ఇప్పుడు దీనిపై ఎలా స్పందిస్తారు, బండ్ల గణేష్‌ను ఎలా బుజ్జగిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com