Bapu Review : బాపు మెప్పించాడా.. ఇబ్బంది పెట్టాడా.. బాపు రివ్యూ

రివ్యూ : బాపు
తారాగణం : బ్రహ్మాజీ, ఆమని, సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, రచ్చ రవి, మణి ఏగుర్ల తదితరులు
ఎడిటర్ : ఆలయం అనిల్
సంగీతం : ఆర్ఆర్ ధృవన్
సినిమాటోగ్రఫీ : వాసు పెండెం
నిర్మాతలు : రాజు, సిహెచ్.భాను ప్రసాద్ రెడ్డి
రచన, దర్శకత్వం : దయా
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా ఎక్కువ ఆకట్టుకుంది బాపు. ప్రమోషనల్ కంటెంట్ తో ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. టీజర్, ట్రైలర్ చూస్తే తెలంగాణ నేపథ్యంలో మరో ఫీల్ గుడ్ మూవీ వస్తుందనుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చాలా పెద్దవాళ్లు కూడా వచ్చారు. మరి ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందనేది చూద్దాం.
మల్లయ్య( బ్రహ్మాజీ) ఓ సన్నకారు రైతు. భార్య (ఆమని) కొడుకు (మణి) ఆటో నడుపుతుంటాడు. కూతురు(ధన్య బాలకృష్ణ) చదువుకుంటుంది. వీరితో పాటు బాపు (సుధాకర్ రెడ్డి)తో కలిసి జీవిస్తుంటాడు మల్లయ్య. అదే ఊరిలో రాజు ( రచ్చ రవి) జేసిబి డ్రైవర్. తనకు ఓ సారి ఓ బంగారు విగ్రహం దొరుకుతుంది. కానీ అతని బామ్మ అతను లేనప్పుడు తీసుకువెళ్లి ఓ బావిలో వేస్తుంది. రాజు వచ్చే వరకు ఆమె చనిపోతుంది. ఆ బావి ఎక్కడో రాజుకు తెలియదు. ఇటు పొలం సాగు కోసం చాలా అప్పులు చేస్తాడు మల్లయ్య. పంట చేతికి వస్తే అప్పులు తీరుద్దాం అనుకుంటాడు. పత్తి బాగా పండుతుంది. మార్కెట్లో సమస్యల వల్ల, కొడుకు నిర్లక్ష్యం వల్ల పంటంతా వర్షంలో తడిసిపోతుంది. అప్పులు తీర్చే మార్గం లేక చనిపోదాం అనుకుంటాడు. అలా చేస్తే ప్రభుత్వం 5లక్షలు ఇస్తుంది. వాటితో అప్పులు తీర్చమని భార్యకు చెబుతాడు. కానీ అతని తండ్రి తనే చనిపోతా అంటాడు..? మరి వీరిలో ఎవరు చనిపోతారు... ఈ క్రమంలో ఆ కుటుంబంలోని భావోద్వేగాలు ఎలా ఉన్నాయి.. కొడుకు వల్ల కుటుంబానికి వచ్చిన సమస్యలేంటీ అనేది మిగతా కథ.
రైతు అనే మాటకు అప్పులు అనేది పర్యాయపదంగా కనిపిస్తుంది. అప్పులు చేయందే వ్యవసాయం సాగదు. తీర్చాలంటే పంట బాగా పండాలి. గిట్టుబాటు ధరలు ఉండాలి. పంటను అమ్మి డబ్బు చేతికి వచ్చే వరకూ నమ్మకం లేని వ్యవహారమే వ్యవసాయం. ఆ వ్యవహారంలో ఓడిపోయిన ఓ సగటు జీవి కథ ఇది. ఒక్క ఎకరంతో కుటుంబం మొత్తాన్ని పోషిస్తూ.. అప్పుల వాళ్లతో అనరాని మాటలు పడ్డా కుటుంబం కోసం ఏకంగా తనువే చాలించాలనుకున్న ఓ బక్కరైతు వ్యథ. అతని తండ్రి మతిమరుపు వల్ల అతనెదుర్కొన్న సంఘర్షణలు, కుటుంబం అంతా కలిసి ఓ దారుణానికి ఒడిగట్టే వరకూ తీసుకువెళ్లే బ్రతుకు చిత్రం.. అదే ఊరిలో అతని కొడుకు, కూతురు ప్రేమాయణం.. ఇవన్నీ కలిసి బాగా తెలిసిన కథనే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్లంతా మన చుట్టూ వాళ్లలాగే కనిపిస్తారు. అందుకే నేటివిటీ బాగా వర్కవుట్ అవుతుంది. సినిమాటిక్ లిబర్టీస్ లేకుండా తీయంతో సహజంగా కనిపిస్తుంది.
కాకపోతే ఎంతో సంఘర్షణకు ఆస్కారం ఉన్న ఈ కథను చాలా సరళంగా మార్చాడు దర్శకుడు. కథనం అంతా బాపు మరణం చుట్టూ సాగడంతో వారి బాధంతా ‘‘నవ్వుల’’ పాలవుతుంది. ఈ కారణంగా ఆ ఎమోషన్ హండ్రెడ్ పర్సెంట్ ఆడియన్స్ కు చేరదు. కథనంలోని కాన్ ఫ్లిక్ట్ ప్రేక్షకులను బలంగా తాకే అవకాశం ఉన్నా.. దర్శకుడు హ్యూమర్ కు ఎక్కువ స్కోప్ ఇవ్వడంతో తేలిపోయింది. ఆటో డ్రైవర్ అయిన కొడుకు తప్పుల గురించి తండ్రి ఒక్కసారీ మాట్లాడకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. చావు చుట్టూ సాగే కథే అయినా రచ్చ రవి, విగ్రహం ఎపిసోడ్ ఆర్టిఫిషియల్ గా కనిపిస్తుంది. ఇదేదో కథను సుఖాంతం చేయడానికి ఓపెనింగ్ లోనే సెట్ చేసుకున్న ఎత్తుగడలా ఉంది. అందుకే ఎక్కడా సీరియస్ నెస్ లేకుండా ఎమోషన్స్ బలంగా కనిపించక, సంఘర్షణను సహజంగా చెప్పలేక బాపు.. ఓకే అనిపిస్తాడంతే.
నటన పరంగా బ్రహ్మాజీ కెరీర్ లో గొప్ప పాత్ర అని చెప్పుకున్నా అంత కనిపించదు. సినిమా అంతా దాదాపు ఒకటే ఎక్స్ ప్రెషన్ తో కనిపిస్తాడు. ఆమని రాంగ్ ఛాయిస్. ముఖ్యంగా ఆమె స్లాంగ్. బాపుగా సుధాకర్ రెడ్డి అదరగొట్టాడు. ఆ పాత్రను బాగా అర్థం చేసుకున్నాడు. ధన్య బాగా చేసింది. అవసరాలది అతిథి పాత్ర లాంటిది. రచ్చ రవికి అలవాటైన పాత్ర ఇది. మణితో పాటు అతని లవర్ గా నటించిన అమ్మాయి ఫర్వాలేదు.
టెక్నికల్ గా పాటలు బావున్నాయి. పాటల్లోని సాహిత్యం గొప్పగా కనిపించింది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బ్యూటీఫుల్ గా ఉంది. రెండు గంటల సినిమానే అయినా స్లో నెరేషన్ వల్ల సాగదీసినట్టు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. దర్శకుడు దయా ఫస్ట్ మూవీ అయినా బానే తీశాడు. కానీ అతను రైతు బాధలు చెప్పాలనుకున్నాడేమో కానీ.. అది సెట్ కాలేదు. ఇటు హాస్యమూ అన్ని చోట్లా వర్కవుట్ కాలేదు. బరువైన భావోద్వేగాలకు ఆస్కారం ఉన్న కథను లైటర్ వే లో చెప్పడంతో అతని దర్శకత్వ ప్రతిభ కూడా లైట్ గానే కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
సుధాకర్ రెడ్డి
అక్కడక్కడా నవ్వులు
పాటలు
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
బ్రహ్మాజీ, ఆమని
లవ్ ట్రాక్
ఆర్టిఫిషియల్ ఎమోషన్స్
స్లో నెరేషన్
ఎక్స్ పెక్టెడ్ స్క్రీన్ ప్లే
ఫైనల్ గా : జస్ట్ ఓకే .. బాపు
రేటింగ్ : 2.25/5
బాబురావు. కామళ్ల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com