Bedurulanka : 2012 అనగానే అదే గుర్తొస్తుంది.. 'ఆర్ఎక్స్ 100' సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన కార్తికేయ

Bedurulanka : 2012 అనగానే అదే గుర్తొస్తుంది.. ఆర్ఎక్స్ 100 సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన కార్తికేయ
అజయ్ భూపతితో కలిసి మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నానన్న కార్తికేయ

'బెదురులంక 2012' మూవీతో రాబోతున్న యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ.. ఈ సినిమాలో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టికి జోడీగా నటిస్తున్నాడు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా కార్తికేయ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 2012లో జీవితం అంతా తెలుసు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమీ తెలియదని అర్థమైందని చెప్పారు. అప్పట్లో చేష్టలు పిల్లల తరహాలో ఉండేవి. ఇప్పుడు కాస్త పద్ధతిగా ఉంటున్నానన్నారు. 2012 అనగానే యుగాంతమే గుర్తొస్తుందన్న ఆయన.. అప్పట్లో కాలేజీలో ఉన్నప్పుడు వార్తల్లో, చర్చల్లో యుగాంతం అని ఎక్కువ వినిపించేదని, హాలీవుడ్ సినిమాలు కూడా రెండు మూడు వచ్చాయని.. అవి చూశానని చెప్పారు.

ప్రపంచం అంత అయిపోతుందని అన్నట్లు ప్రచారం జరిగింది కదా అన్న కథకు బాగా కనెక్ట్ అయ్యి.. ఈ సినిమాకు ఓకే చెప్పానని కార్తికేయ అన్నారు. అజయ్ భూపతి ద్వారా దర్శకుడు క్లాక్స్ నాకు పరిచయం అయ్యారని చెప్పారు. 'బెదురులంక 2012' లో ఫన్, మెసేజ్ రెండూ ఉంటాయని, ప్రేక్షకులు ఆలోచించేలా సన్నివేశాలు, డైలాగులు ఉంటాయని చెప్పారు. "రెండున్నర గంటలు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. పంచ్ టు పంచ్ డైలాగులా కాకుండా సిట్యువేషన్ నుంచి జనరేట్ అయ్యే కామెడీ ఎక్కువ ఉంటుందని" స్పష్టం చేశారు.

సినిమాలోని శివ క్యారెక్టర్ గురించి చెప్పిన కార్తికేయ.. "శివ ఓ స్వేచ్ఛా జీవి. తనకు నచ్చినట్లు జీవిస్తాడు. సిటీలో గ్రాఫిక్ డిజైనర్ జాబ్ మానేసి ఊరు వెళతాడు. ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తున్నారా? ఎవరైనా నేను చేసిన పని గురించి ఆలోచిస్తున్నారా? అని అసలు పట్టించుకోడు. అలాగని, ఎవరినీ ఇబ్బంది పెట్టడు. వాడి పని వాడు చేసుకుంటాడు. నచ్చని విషయం చేయమంటే అసలు చేయడు అని అన్నారు. సిటీ నుంచి ఊరికి వచ్చిన యువకుడిగా నా క్యారెక్టర్ ఉంటే... బెదురులంక ప్రపంచం మాత్రమే తెలిసిన ప్రెసిడెంట్ గారి అమ్మాయిగా నేహా శెట్టి కనబడుతుంది. శివతో ప్రేమలో ఉంటుంది. శివ స్ట్రాంగ్ క్యారెక్టర్. అందరి ముందు ఐ లవ్యూ చెబుతాడు. ప్రేమించిన అబ్బాయికి లవ్యూ చెప్పడానికి అమ్మాయి భయపడుతుంది. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు ఎలా ఉండాలో, ఆ పరిధి మేరకు ఉంటాయి. సీన్స్ అన్ని క్యూట్ గా ఉంటాయి. సాంగ్స్, సీన్స్ షూట్ చేసినప్పుడు మా మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందని అర్థమైంద"ని కార్తికేయ చెప్పారు.

"కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాను. సినిమాలు ప్రకటించలేదు గానీ చర్చలు అయితే జరుగుతున్నాయి. యువి క్రియేషన్స్ సంస్థలో ఓ సినిమా చేస్తున్నా. యాక్షన్ అండ్ క్రైమ్ కామెడీ జానర్ ఫిల్మ్ అది. ప్రశాంత్ అని కొత్త దర్శకుడితో ఆ సినిమా చేస్తున్నాను. మరో రెండు మూడు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయ"ని కార్తికేయ చెప్పారు. "ఆర్ఎక్స్ 100 - 2' సీక్వెల్ కాదు గానీ. అజయ్ భూపతి, నేను కలిసి ఓ సినిమా చేయాలనే ప్లాన్ ఉంది. సరైన కథ కుదరాలి. కొన్ని పాయింట్స్ అనుకుంటున్నాం. అన్నీ కుదిరినప్పుడు ఆ సినిమా అనౌన్స్ చేస్తామ"న్నారు.

చిరంజీవి గురించి..

"ఆయనకు నేను అభిమానిని. అంత కంటే ఎక్కువగా నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తి చిరంజీవి గారు. సినిమాల పట్ల నాలో బాధ్యత పెంచిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయనలా డ్యాన్సులు చేయాలని, హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చా. మా ఇంట్లో అమ్మ కూడా 'వీడు ఒక్క పని సరిగా చేయడు. సినిమా అంటే రెస్పాన్సిబిలిటీగా ఉంటాడు' అంటుంది. రెస్పాన్సిబిలిటీ రావడానికి కారణం ఆయన" అని కార్తికేయ వివరించారు.

Tags

Next Story