Sirivennela Seetharama Sastry : సిగరెట్ డబ్బాపై 'అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని' రాసిన సిరివెన్నెల..!

Sirivennela Seetharama Sastry : సిగరెట్ డబ్బాపై అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని రాసిన సిరివెన్నెల..!
Sirivennela Seetharama Sastry : కొన్ని వేల పాటలతో తనదైన సాహిత్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రి..

Sirivennela Seetharama Sastry : కొన్ని వేల పాటలతో తనదైన సాహిత్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రి.. అందులో ఏ పాట బాగుంది అంటే చెప్పడం కష్టమే.. దేనికదే ప్రత్యేకత.. ఆయన కలం నుంచి ప్రతి పదం అద్భుతమే.. ప్రతి పాట అమోఘమే.. అలాంటి సీతారాముడి నుంచి వచ్చిన పాటల్లో ఒకటి "అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా ". ఆ పాట నేపధ్యం ఇప్పుడు తెలుసుకుందాం.

సింధూరం చిత్రంలోనిది ఈ పాట.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకుడిగా రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి మెయిన్ లీడ్‌‌‌‌లో నటించారు. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 1997లో విడుదలైంది. ఈ చిత్రానికి శ్రీ సంగీతం అందించారు. ఇందులో మొత్తం ఆరు పాటలుంటే అందులో అయిదు పాటలు సీతారామశాస్త్రీ రాశారు. మరొకటి చంద్రబోస్ రాశారు. అయితే కృష్ణవంశీ సినిమా షూటింగ్ ఫినిష్ చేసినప్పుడు ఇందులో అయిదు పాటలు మాత్రమే ఉన్నాయట.

సినిమా రేపు రిలీజ్ అన్నప్పుడు ప్రివ్యూ చూసిన సీతారామశాస్త్రీ సినిమాలో ఎదో మిస్ అయిందని బయటకు వచ్చి ఆలోచిస్తుండగా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా అనే లైన్ తట్టిందట.. అప్పుడు రాయడానికి పక్కన పేపర్ లేకపోవడంతో సిగరెట్ డబ్బా పైన పాటను మొదలుపెట్టారట సీతారామశాస్త్రీ .. అలా అప్పటికప్పుడు ఆ పాటను రాసి ఆ పాటకి సంగీత దర్శకుడు శ్రీతో మ్యూజిక్ చేయించి ఆ పాటను సినిమా చివర్లో పెట్టారట.

ఈ విషయాన్ని కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఈ పాట రాసినందుకు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది.


అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!

ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!

శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం

నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా! ఓ! పవిత్ర భారతమా!

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా

నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా! దాన్నేస్వరాజ్యమందామా!

కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ

ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే

సమూహక్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ

మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే

అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి? పోరి, ఏమిటి సాధించాలి?

ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం

జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా! ఓ అనాథ భారతమా!

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!

ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!

Tags

Read MoreRead Less
Next Story