Chinababu : ప్యాషనేట్ ప్రొడ్యూసర్ .. చినబాబు

సినిమా నిర్మాణం అంటే వ్యాపారం అనేది చాలామంది అభిప్రాయం. కొందరు మాత్రమే సినిమా నిర్మాణాన్ని బాధ్యత అనుకుంటారు. వీలైనంత ఎక్కువమంది ప్రేక్షకులను మెప్పించడమే ధ్యేయంగా ఉంటారు. ముఖ్యంగా కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్ లాంటి మూవీస్ తోనే ఆకట్టుకుంటారు. అలాంటి బ్యానర్స్ లో ముందు వరుసలో ఉండే సంస్థ హారిక హాసిని. ఈ నిర్మాణ సంస్థ నుంచి ఓ సినిమా వస్తోందంటే.. ఆ కథ, కథనాల్లో ఓ బాధ్యత ఉందని అర్థం. ఆ బాధ్యతను తీసుకున్న వ్యక్తి సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు. ప్యాషనేట్ మూవీ మేకర్ గా అతి తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ పై తన ముద్రను బలంగా వేసిన చినబాబు బర్త్ డే ఇవాళ.
కొన్ని బ్యానర్స్ పేరు చెబితే తెలియకుండానే రెస్పెక్ట్ పెరుగుతుంది. అది ఆ బ్యానర్ లో వచ్చే సినిమాలను బట్టి కలిగే అభిప్రాయం. సంస్కారవంతమైన సకుటుంబ కథా చిత్రాలతో అతి తక్కువ కాలంలోనే ది బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకున్న హారిక హాసిని బ్యానర్ పైనా ప్రేక్షకులకు అదే గౌరవం ఉంది. త్రివిక్రమ్ చేతులమీదుగా నామకరణం చేసుకుని.. ఆయనతో మాత్రమే సినిమాలు తీస్తూ.. అఖండ విజయాలు సాధిస్తూ.. అప్రతిహతంగా కొనసాగుతోన్న నిర్మాత చినబాబు.
తన బ్యానర్ కు ఆస్థాన దర్శకుడుగా రాసేది, తీసేది త్రివిక్రమే అయినా.. ఆ కథలో చినబాబు ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. తన బ్యానర్ వాల్యూకు తగ్గ కథ అవుతుందా లేదా అనే ఆలోచన ఉంటుంది. అఫ్ కోర్స్ చినబాబు మనసెరిగిన దర్శకుడు త్రివిక్రమ్. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే ట్యాగ్ పడిపోయింది. ఏ సినిమాకైనా స్క్రిప్టే కీలకం అని నమ్మే నిర్మాతల్లో చినబాబు ఒకరు. అందుకే ఒక్కసారి కథ ఫైనల్ అయిన తర్వాత దాన్ని ప్రేక్షకుల ముందు వరకూ తీసుకురావడంలో ఆయన మనసు పెట్టి పనిచేస్తారు. ఆ ఫలితంగానే ఈ బ్యానర్ కు టాలీవుడ్ లో ఓ ప్రత్యేకమైన స్థానం వచ్చింది.
సినిమా కొందరు నిర్మాతలకు వ్యాపారం, మరికొందరికి వ్యసనం, ఇంకొందరికి ప్యాషన్.. ఈ మూడూ కలిసి ఉన్న అరుదైన నిర్మాతే చినబాబు. నిర్మాత కావాలన్న తన అభిరుచి మేరకు చాలాకాలం క్రితమే ప్రయత్నించారు. అనుభవం లేకపోవడం వల్ల ఆ సినిమా ఆకట్టుకోలేదు. కొంత గ్యాప్ తీసుకుని రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సారి తనుగా కాక మిత్రులతో పాటు నిర్మాణం మొదలుపెట్టి డివివి దానయ్యతో కలిసి రెండు సినిమాలకు సహ నిర్మాతగా ఉన్నారు. పూరీ డైరెక్షన్ లో వచ్చిన కెమెరా మెన్ గంగతో రాంబాబు, వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన నాయక్ ఆ సినిమాలు.
రెండు సినిమాల అనుభవంతో తనే సొంతంగా నిర్మాణం చేయాలనుకున్నారు. కొందరు రిస్క్ అన్నారు. బట్ రిస్క్ తీసుకుంటేనే కదా రిజల్ట్ తెలిసేది. తను ఎంతో అభిమానించే త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే జులాయి స్టార్ట్ అయింది. టైటిల్ మాస్ గా ఉన్నా.. యువతరానికి ఓ అద్భుతమైన మెసేజ్ ఇస్తూ.. ఇంటిల్లిపాదీ చూసే సినిమాగా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ విజయం చినబాబుకు కొండంత బలాన్నిచ్చింది.
మొదటి అడుగులోనే విజయం వస్తే చాలామందికి గర్వం పెరుగుతుంది. కానీ చినబాబు బాధ్యత పెరిగిందనుకున్నారు. అందుకే సన్ ఆఫ్ సత్యమూర్తి అంటూ మరో కుటుంబ కథా చిత్రం. అప్పటి వరకూ వచ్చిన ఫాదర్ సెంటిమెంట్ మూవీస్ కు భిన్నంగా చనిపోయిన తన తండ్రి గౌరవాన్ని కాపాడటానికి వందల కోట్లు వదులుకుని.. ఆయన మాట నిలబెట్టేందుకు ఎన్నో త్యాగాలు చేసి చివరికి తండ్రిని గెలిపించి తను గెలిచిన హీరో. త్రివిక్రమ్ కాకుండా మరో దర్శకుడైతే.. ఈ కథను డీల్ చేయడం అంత సులువు కాదు. బట్ చినబాబుకు కావాల్సింది త్రివిక్రమే. అలా మరో విజయం.
కథకు కనెక్ట్ అయితే ఖర్చుకు వెనకాడరు చినబాబు. అభిరుచి కలిగి, విలువలకు ప్రాధాన్యం ఇచ్చే చినబాబు వంటి నిర్మాతలు ఆ విషయం అస్సలు ఆలోచించరు. అలాగే మనసులు తెలిసిన మిత్రులు చేసే సినిమా అందరి మనస్సుల్నీ కొల్గగొడుతుంది. అ.. ఆ.. లాంటి సినిమాకు నితిన్ హీరోగా బాగా యాప్ట్ అవుతాడు. కానీ అతని మార్కెట్ బడ్జెట్ కు సరిపోదు. అప్పుడు అసలే తక్కువ విజయాలు ఉండే పరిశ్రమలో ఉండే ఏ నిర్మాతైనా రీ థాట్ లో పడతాడు. కానీ చినబాబు త్రివిక్రమ్ ని నమ్మాడు. త్రివిక్రమ్ తన కథను నమ్మాడు. వీరి నమ్మకానికి తగ్గట్టుగా తమ నటనతో ఆర్టిస్టులు ఆ కథను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లారు. దీంతో చినబాబు, త్రివిక్రమ్ ఏదైతే నమ్మారో అదే నిజమైంది. సినిమా బ్లాక్ బస్టర్ అయి.. ఓవర్శీస్ లోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఈ బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమా అనుకున్న అజ్ఞాతవాసి అంచనాలను అందుకోలేదు. అయినా చినబాబు నిరాశపడలేదు. ఎందుకంటే అతను ప్రిపేర్డ్ ప్రొడ్యూసర్. దేనికీ వెరవని నైజం కూడా ఉంది. అందుకే ఎన్టీఆర్ తో అరవింద సమే వీరరాఘవ. ఎన్టీఆర్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. కళ్ల ముందే తండ్రిని కోల్పోయినా.. తనలా మరెవరూ బాధపడకూడదని.. తండ్రి పోయిన బాధను భరిస్తూ స్థితప్రజ్ఞతను ప్రదర్శిస్తూ.. ఆఖరికి ఒక ప్రాంతాన్నే మార్చివేసిన వీరరాఘవ రెడ్డి కథ కొందరికి పూర్తిగా అర్థం కాలేదు కానీ.. కమర్షియల్ గా మంచి విజయం సాధించి.. మరోసారి చినబాబు అభిరుచిని చాటింది.
అల వైకుంఠపురములో.. ఆ బ్యానర్ లోనే బిగ్గెస్ట్ హిట్. అల్లు అర్జున్ ను ఫస్ట్ టైమ్ ప్యాన్ ఇండియా ఆడియన్స్ కు పరిచయం చేసిన సినిమా ఇదే. త్రివిక్రమ్ మరోసారి తనే సొంతమైన రైటింగ్, డైలాగ్స్ తో మెస్మరైజ్ చేస్తే బ్యానర్ వాల్యూను రెట్టింపు చేసే విజయం అందింది. ఇలాంటి విజయాలు నిర్మాతలకు తెలియని కిక్ ను ఇస్తాయి. ఆ కిక్ ను మరోసారి అందించిన సినిమా గుంటూరు కారం. కొన్ని విమర్శలు వచ్చినా.. కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించుకుందీ మూవీ.
సినిమాలను దాటి చూస్తే.. చినబాబులో నిఖార్సైన వ్యక్తిత్వం కనిపిస్తుంది. ఎప్పుడూ ప్రసన్న వదనంతో, అతి తక్కువ మాటలు, అత్యంత ఎక్కువ పనితో కనిపిస్తారు. అదే త్రివిక్రమ్ లాంటి స్నేహితుడిని అందించింది. పొంగిపోవడం, కుంగిపోవడం అనే పదాలే తెలియవు అన్నట్టుగా ఉంటారు. ఇన్ని విజయాలు వచ్చిన తర్వాత కూడా తొలి రోజు ఎలా ఉన్నారో ఈ రోజూ అలాగే ఉండటం ఆయన క్యారెక్టర్ కు అద్దం పడుతుంది. తనతో పాటు నలుగురూ బావుండాలని కోరుకునే గొప్ప గుణం కూడా ఉందాయనలో. అందుకే తన తమ్ముడి కొడుకు నాగవంశీని నిర్మాతగా చేసి త్రివిక్రమ్ తో సాధ్యం కాని కథలను ఆ బ్యానర్ లో రూపొందిస్తూ.. అవీ తన అభిరుచికి తగ్గట్టుగానే ఉండేలా చూసుకుంటూ.. ఈ బ్యానర్ స్థాయిని మరింత పెంచుకుంటున్నారు.
హారిక హాసిని అంటే ఆడియన్స్ లో ఎంత గౌరవం ఉందో సితార అంటే అంతే కూడా అంతే గౌరవం ఉందంటే కారణం ఈ బ్యానర్ లోనూ వచ్చిన సినిమాలే. బాబు బంగారం, ప్రేమమ్, జెర్సీ, డిజే టిల్లు, భీమ్లా నాయక్, మ్యాడ్.. ఈ బ్యానర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్స్ లో కొన్ని. మొత్తంగా హారిక హాసిని బ్యానర్ లో మరోసారి అల్లు అర్జున్ తోనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా రాబోతోంది. ఇది ఊహలకు కూడా అందనంత భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేసే కంటెంట్ తో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలన్నీ నిజం కావాలని.. చినబాబు విజయ ప్రస్థానం తెలుగును దాటి ఖండాంతరాలకు వ్యాపించాలని కోరుకుంటూ.. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదాం.
- బాబురావు. కామళ్ల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com