HBD RGV : తెలుగు సినిమాకు ఓ కిక్కు. తెలుగు ప్రేక్షకులకు దొరికిన లక్కు..!

HBD RGV :  తెలుగు సినిమాకు ఓ కిక్కు. తెలుగు ప్రేక్షకులకు దొరికిన లక్కు..!
HBD RGV : రామ్ గోపాల్ వర్మ .. ఇండియన్ సినిమాకు పాత్ బ్రేకింగ్ ఈ పేరు. ఓ ఫిల్మ్ మేకర్ గా వర్మ లాంటి పర్సన్ ను ఇండియన్ సినిమా అంతకు ముందు చూడలేదు..

HBD RGV : రామ్ గోపాల్ వర్మ .. ఇండియన్ సినిమాకు పాత్ బ్రేకింగ్ ఈ పేరు. ఓ ఫిల్మ్ మేకర్ గా వర్మ లాంటి పర్సన్ ను ఇండియన్ సినిమా అంతకు ముందు చూడలేదు.. ఇకపై చూస్తుందన్న నమ్మకమూ లేదు. ఆరంభంలో అద్భుతమైన టాలెంటెడ్ అనిపించుకుని.. ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోయేలా రొడ్డకొట్టుడు సినిమాలు చేస్తున్నాడు. కాంట్రవర్శీస్ లో కింగ్ అనిపించుకుని.. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ.. ఏ విషయం పై అయినా తన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేయడంలో వర్మను మించిన వారు లేరు. ఇవాళ ఒకప్పటి మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పుట్టిన రోజు.

తెలుగు సినిమా కన్నా కాస్త ముందున్న వాడు రామ్ గోపాల్ వర్మ. అదే అతని విజయం అదే అతని వైఫల్యం. తెలుగు సినిమా కీర్తి పతాకను బాలీవుడ్ లోనూ సగర్వంగా ఎగరేసిన చరిత్ర వర్మది. వర్మ తెలుగు సినిమాకు ఓ కిక్కు. తెలుగు ప్రేక్షకులకు దొరికిన లక్కు. ఎంత డిజాస్టర్ సినిమా తీసినా ఇప్పటికీ అతనిపై అభిమానం తగ్గని ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. తను నమ్మకపోయినా అది వర్మ అదృష్టం.

రామ్ గోపాల్ వర్మది సినిమా ఫ్యామిలీనే. వర్మ ఫాదర్ పేరు కృష్ణంరాజు సౌండ్ రికార్టిస్టు. వర్మ ఇంజనీరింగ్ లో డిగ్రీ తీసుకున్నా.. ఫిలిం టెక్నీషియన్ కావాలనేది తన యాంబిషన్. దానికి ఇంకా టైముందనుకున్నప్పుడు హైద్రాబాద్ లోనే వీడియో పార్లర్ పెట్టాడు. చాలా టాక్టికల్ గా అన్నపూర్ణ వారి సంస్ధకు దగ్గరయ్యాడు. యార్లగడ్డ సురేంద్ర తో స్నేహం రావుగారిల్లుకి అసిస్టెంట్ డైరక్టర్ ని చేసింది. అసిస్టెంట్ గా ఎక్కువ కాలం లేకున్నా.. అతి తక్కువ టైమ్ లోనే తెలుగు సినిమా గతిని మార్చిన శివ సినిమాకు దర్శకుడయ్యాడు.

తెలుగు అనే కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీ గురించి మాట్లాడుకున్నప్పుడు అది శివ ప్రస్థావన లేకుండా పూర్తి కాదు. ఈ సినిమా తర్వాత ఎంతమంది దర్శకులు కావాలని అనుకున్నారో లేక్కేలేదు. శిష్యరికం చేసిన వారికంటే ఏకలవ్య శిష్యుల సంఖ్య లెక్కలేనిది. అప్పటి నుంచి దాదాపు దశాబ్ధం పాటు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఏం చూపించినా ఓ సంచలనమే అయింది.

శివ సినిమా అన్ డివైడెడ్ టాక్ తో రికార్టులు బ్రేకులు చేసేసింది. వర్మ ఓ భారీ యాక్షన్ సినిమా అద్భుతంగా తీస్తాడని జనం అపార్ధం చేసుకున్నారు. వర్మ అంటే ఏమిటో శివ చూసిన ప్రేక్షకులకు చాలా మందికి అర్ధం కూడా తెలీదు. అలాంటి పరిస్ధితుల్లో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ క్షణ క్షణం వెంకటేశ్, శ్రీదేవిలతో చేశాడు. శివ రేంజ్ లో లేదనేశారు జనం. ఎందుకుండాలని వర్మ ప్రశ్న. ప్రతి సినిమా ఒక్కలాగే ఉండాల్సిన అవసరం లేదనేశాడు.

వర్మ ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు తీయలేదెప్పుడూ. తనకు నచ్చిన సినిమాలనే ప్రేక్షకులకు చూపించాలనుకున్నారు. అందులో శివ తర్వాత ఎక్కువగా ఆశించిన ప్రేక్షకులను రాత్రి, అంతం, ద్రోహి, గోవిందా గోవిందా అంటూ తెగ ఇబ్బంది పెట్టాడు. బట్ మళ్లీ గాయం సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. విశేషం ఏంటంటే వర్మ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్ స్పైర్ అయి తీసిన సినిమాలే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి.

ఫ్లాపులతో పనిలేకుండా వర్మకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో అప్పటి టాప్ డైరెక్టర్స్ కూడా ఉండటం విశేషం. ముఖ్యంగా సౌత్ నుంచి మణిరత్నంతో కలిసి సినిమాలు చేశాడు వర్మ. గాయం చిత్రానికి మణి ఓ నిర్మాత. అలాగే మణిరత్నం తీసిన దొంగా దొంగాకు వర్మ స్క్రీన్ ప్లే అందించాడు. తర్వాత రంగీలాతో బాలీవుడ్ ను మరోసారి షేక్ చేశాడు. అటుపై సత్య సినిమాతో బాలీవుడ్ పంథానే మార్చేశాడు. దాదాపు కొత్త నటులతో వచ్చిన సత్య అసాధారణమైన విజయం సాధించింది. 1990స్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ డెకేడ్ అనిపించుకుంది. సత్యతో బాలీవుడ్ మేకింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.

వర్మ ఒక్క హిట్టు తీస్తే వందిమంది ఇన్స్ స్పైర్ అవుతారు. అదే వరుస ఫ్లాపులు తీస్తే.. అప్పట్లో ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. అందుకే క్లాసిక్ అనదగ్గ చిత్రాలు తీసిన అతనే వరస్ట్ అనే సినిమాలూ చేశాడు. ఇక ఫైవ్ డి కెమెరాతో వర్మ చేసిన ప్రయోగం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనాలు సృష్టించింది. ఈ చిన్న కెమెరాతో చేసిన దొంగలముఠా.. టాలీవుడ్ కు ఎంతోమంది దర్శకులను ఇచ్చింది. టెక్నీషియన్ గా వర్మను అందుకోవడం ఎవరికీ అంత సులువు కాదు.

వరుస ఫ్లాపుల తర్వాత మరోసారి తన స్క్రిప్ట్ ల పొది నుంచి గ్యాంగ్ స్టర్ స్టోరీస్ ను తీశాడు. కంపెనీ, డి, సర్కార్ అంటూ మరోసారి వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఇవన్నీ గ్యాంగ్ స్టర్ తరహా కథలే అయినా వేటికవే ప్రత్యేకంగా నిలవడానికి కారణం వర్మ టేకింగ్. మేకింగ్ పై వర్మకు ఉన్న కమాండ్ మరో దర్శకుడిలో కనిపించదు. అతనికే సొంతమైన ప్రతిభ అది. అయితే ఇలాంటి సినిమాలన్నీ వర్మ హాలీవుడ్ గాడ్ ఫాదర్ నుంచే ఇన్ స్పైర్ అయ్యే తీశాడు.

రామ్ గోపాల్ వర్మ సాధారణ జనం ఆలోచించే దానికి భిన్నంగా ఆలోచిస్తాడు. అంతకన్నా విభిన్నమైన టేస్ట్ తనది. తీసేది కమర్షియల్ సినిమానే అయినా అది రియలిస్టిక్ గా ఉండాలనేది వర్మ సిద్దాంతం. ఆ థీయరీ బలంగా ఉండడం వల్లే...తన సినిమాలు డిఫరెంట్ జానర్ లో నడుస్తాయి. రియలిస్టిక్ గా అనిపిస్తూనే...కొత్త విషయాలు అర్ధం చేయించడం.. వర్మ స్టైల్. రెగ్యులర్ గా దయ్యాలు మాఫియాల చుట్టూ తిరిగే వర్మలో హ్యూమర్ సెన్సు కూడా ఉంది. మనీ, మనీమనీ, అనగగనా ఒక రోజు లాంటి సినిమాల్లో కనిపించే కామెడీ అంతా వర్మ సృష్టే.

తనకు నచ్చని దాన్ని తనకు ఇబ్బంది కలిగించిన అంశాన్ని బలంగా ఎదుటి వారికి అర్ధం చేయించడం కూడా వర్మకి బాగా తెలుసు. వ్యవస్థలో ఉన్న సంక్లిష్టతను వర్మ చర్చించినంత విపులంగానూ.. బలంగానూ చర్చకు పెట్టిన వాళ్లు తక్కువే. రక్త చరిత్ర, ముంబై ఉగ్ర దాడుల నేపధ్యంలో తీసిన చిత్రాలు వర్మ లోని ఆలోచనాపరుణ్ణి చూపిస్తాయి. వర్మతో ఆర్గ్యూ చేయాలన్నా కొంచెం కష్టమే. వాదనలో తనని గెలవడం అంత ఈజీ కాదు. కారణం తను ప్రిపేర్ అవుతాడు.

వర్మను మాఫియా సినిమాల స్పెషలిస్టుగా ప్రపంచం ముద్రేసింది. కారణం శివతో ప్రారంభించి సత్య, కంపెనీ ఇలా అనేక చిత్రాలు తీయడమే. ఇతిహాసాలు ఇంత గొప్పగా జనంలో నాటుకుపోవడానికి కారణమేమిటని ఆ మూలాల మీద ఆలోచించాడు. వాటిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. సత్య మూవీలో అందరూ చనిపోయి సత్య, కల్లుమామ మాత్రమే మిగుల్తారు. ఇద్దరూ ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోవాలి. కానీ వాళ్లలా చేయరు. తామిద్దరమే ఓ గ్రూపుగా యాక్టివిటీ ప్రారంభించి ప్రత్యర్ధి ముఠాను చంపేస్తారు. అదీ వర్మ స్టైల్.

మాఫియానే కాదు...ఉగ్రవాదపు ఆలోచనలనూ విశ్లేషించి సినిమాలు తీసి సక్సస్ కొట్టారు వర్మ. ముంబై దాడుల్లో పాల్గొన్న వారి ఆలోచనా విధానం ఏ విధంగా ఉండి ఉంటుందనే కోణంలోనే స్క్రిప్ట్ సాగుతుంది. జనరల్ గా ఉగ్రవాదుల దాడిలో గాయపడిన వారి వైపు నుంచి సినిమా ఓపెనై...ప్రభుత్వ వాదన ప్రకారం ముగియాలి. అయితే వర్మ సినిమా రివర్స్ లో నడుస్తుంది. కథనానికి సంబంధించి ఇది ఓ ప్రక్రియ. కళ్లకు కనపడేవన్నీ వాస్తవాలు కాకపోవచ్చు అనే కోణంలో కొంత స్వతంత్రించినా.. వర్మ సినిమా మాత్రం జనాలకు నచ్చింది.

వర్మ ప్రభ తగ్గింది అనుకున్న టైమ్ లో మోహన్ బాబును కొత్తగా చూపిస్తూ రౌడీ తీశాడు. ఇది హిట్. రౌడీ సినిమా మోహన్ బాబు కెరీర్ లో ఓ కొత్త పాత్రే. బహుశా దాసరి, రాఘవేంద్రరావుల తర్వాత మోహన్ బాబును కొత్త రూపంలో చూపించిన దర్శకుడుగా వర్మను ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అటు కన్నడలోనూ శివరాజ్ కుమార్ తో వీరప్పన్ తీసి హిట్ కొట్టాడు.

గత కొంతకాలంగా వర్మ తీస్తోన్న సినిమాల గురించి అసలు మాట్లాడకపోవడమే మంచిది. ఈ సినిమా ఇలా ఎందుకు తీశావు అంటేనా ఇష్టం అంటాడు. ఆ సినిమా ఎందుకు హిట్ అయిందీ అంటే నాకేం తెలుసూ అంటాడు. వాదనలో వర్మతో నెగ్గలేరు.. అందుకు కారణం.. అతను గొప్ప చదువరి. సామాజిక అవగాహన పుష్కలంగా ఉన్నవాడూ కావడమే. కానీ ఒక్కోసారెందుకో ఇంటెలిజెంట్ ఫూల్ లా కనిపిస్తాడు. అయినా వర్మ అందరికీ నచ్చుతాడు. ఆ నచ్చడాన్ని మరిన్ని సినిమాలతో కలిపి నచ్చితే ఇంకా బావుంటుందనే సగటు అభిమానుల ఫీల్ ను నిజం చేయాలని కోరుకుంటూ వర్మకు మరోసారి బర్త్ డే విషెస్ చెబుదాం..

Tags

Read MoreRead Less
Next Story