HBD A. R. Rahman : కీ బోర్డ్ ప్లేయర్ నుంచి.. ఆస్కార్ విన్నర్ వరకు..

HBD A. R. Rahman : కీ బోర్డ్ ప్లేయర్ నుంచి.. ఆస్కార్ విన్నర్ వరకు..
రెహమాన్ అంటే ఇండియన్ సినీ మ్యూజిక్ కు బ్రాండ్. మన సంగీతాన్ని శిఖర స్థాయికి తీసుకువెళ్లిన లెజెండ్. అతను విదేశాల్లో ఓ కాన్సెర్ట్ చేస్తున్నాడంటే చాలు.. లక్షలమంది అభిమానులు హాజరవుతారు.

కృషితో నాస్తి దుర్భిక్షం.. అనే మాట అక్షరాలా సరిపోతుంది ఏ. ఆర్ రెహమాన్ కు. చిన్న వయసులోనే తండ్రి మరణించాడు. ఆయన పోయినా ఆయన ఇచ్చిన సంగీత జ్ఞానం రెహ్మాన్ లో నిలిచిపోయింది. కాళ్లరిగేలా తన అమాయకమైన మొహంతో ఒక్క అవకాశం కోసం ఎన్నో స్టూడియోల చుట్టూ తిరిగిన ఆ కుర్రాడు ఇప్పుడు ఎన్ని స్టూడియోలనైనా నిర్మించుకునే స్థాయికి చేరుకున్నాడు. తను క్రియేట్ చేసిన పాటల్లో మెలోడీ ఉన్నా .. ఆ మెలోడీ మనకు చేర్చడానికి ముందు రెహ్మాన్ లైఫ్ లో చాలా ట్రాజెడీ ఉంది. అయినా శ్రమనే నమ్ముకున్న అతను ఇప్పుడు ఇండియాకు ఆస్కార్ సాధించిన తొలి సంగీత దర్శకుడిగా నిలిచాడు.. ఇవాళ రెహమాన్ పుట్టిన రోజు..

రెహమాన్ అసలు పేరు ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్‌. తొమ్మిది సంవత్సరాల వయసులోనే తండ్రి మరణించాడు. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళ పోషణ భారం తనమీదే పడింది. దీంతో తండ్రి సంగీత వాయిద్యాలను అద్దెకిచ్చి వచ్చిన ఆ డబ్బుతో జీవితం సాగించడం మొదలు పెట్టాడు. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ ఓ కీ బోర్డ్ ను అద్దెకు తీసుకుని చిన్న చిన్న కచేరీలు చేస్తూ కొద్దిపాటి డబ్బు సంపాదించే ప్రయత్నాలు చేసేవాడు.

నేర్చుకున్న విద్యతో అవకాశాల కోసం ఎన్నో స్టూడియోల చుట్టూ తిరిగాడు. చాలా రోజుల తర్వాత ట్రూప్ లో నాలుగో కీ బోర్డ్ ప్లేయర్ గా ఛాన్స్ అవకాశం వచ్చింది. తర్వాత మూడో కీ బోర్డ్ ప్లేయర్ గా ఎదుగుతూ టి. రాజేందర్, ఇళయరాజాల ప్రోత్సాహంతో మరింత పట్టు సాధించాడు. అయితే కొన్నాళ్ల తర్వాత ఇళయరాజాతో వచ్చిన అభిప్రాయభేదాల కారణంగా ఆయన్నించి విడిపోయి తెలుగులో స్టార్ సంగీత ద్వయం రాజ్-కోటిల వద్ద కీ బోర్డ్ ప్లేయర్ గా చేరి వారిచ్చిన ఎన్నో మ్యూజికల్ హిట్స్ లో భాగమయ్యాడు..

రాజ్ కోటి ల వద్ద పనిచేస్తూనే జింగిల్స్ తో ఫేమస్ అయ్యాడు. అలా 1992లో మళయాల దర్శకద్వయం సంగీత్ -శివన్ ల దృష్టిలో పడి స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన యోధ సినిమాతో సంగీత దర్శకుడిగా అవకాశం దక్కించుకున్నాడు. అయితే అదే యేడాది మణిరత్నం ఇచ్చిన అవకాశం రెహమాన్ ను రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా సంచలన సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది. ఆ సినిమా రోజా. రోజా సినిమా సంగీతానికి జాతీయ, ఫిల్మ్ ఫేర్, తమిళనాడు ప్రభుత్వ అవార్డులు వచ్చాయి.

రోజాకు కేవలం పాటలకే కాదు.. నేపథ్య సంగీతానికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పటి వరకూ మణిరత్నం, ఇళయారాజాల కాంబినేషన్ సూపర్ హిట్. ఆ తర్వాత ఈ కాంబినేషన్ ఫ్రెష్ ఫీలింగ్ తో సరికొత్త అనుభూనితిచ్చింది ఆడియన్స్ కు. తర్వాత తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన నిప్పురవ్వ చిత్రానికి నేపథ్య సంగీతం అందించాడు. ఆ టైమ్ లోనే దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న ఓ దర్శకుడు రెహ్మాన్ ను తీసుకున్నాడు. ఆ సినిమాతో ఈ ఇద్దరిదీ ఎవర్ గ్రీన్ పెయిర్ అవుతుందని అప్పుడు వీరికీ తెలియదేమో. ఈ జంట సృష్టించిన ఆ సంచలన చిత్రం జెంటిల్మన్.

జెంటిల్మన్ పాటలతో రెహమాన్ మానియా స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా ఆ పాటలే వినిపించసాగాయి. ఓ కొత్తతరం సంగీత దర్శకుడు, కొత్తరకం పాటలతో సరికొత్త ప్రస్థానం మొదలుపెట్టినట్టుగా చెప్పుకున్నారు. మరోవైపు మణిరత్నంతో రెహమాన్ కాంబినేషన్ కు తిరుగులేని క్రేజ్ వచ్చింది. దీంతో అప్పటి వరకూ మణిరత్నం, ఇళయరాజా నుంచి విడిపోయినప్పుడు విమర్శించిన వాళ్లు కూడా కామ్ అయిపోయారు.

అయితే రెహమాన్ పాటల్లో ఎక్కడా సౌండ్ డామినేషన్ ఉండదు. స్వచ్ఛమైన స్వరాలతో సాహిత్యాన్ని అచ్ఛంగా వినిపిస్తూ స్వరపరిచిన పాటలు శ్రోతలను కట్టిపడేశాయి. ఓ రకంగా మణిరత్నంకు రెహమాన్ మరింతగా నచ్చడానికీ ఇదే కారణం. అందుకే వీరి కాంబినేషన్ లో వచ్చిన తెలుగే కాదు.. హిందీ పాటలూ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మణి మ్యాజికల్ మూవీ బొంబాయిని రెహమాన్ సంగీతం మరో రేంజ్ కి తీసుకువెళ్లిందంటే అతిశయోక్తి కాదు.

సినిమా సంగీతంలో తరచుగా ఇన్సిస్పిరేషన్ అనే మాట వింటుంటాం. అంతకు ముందు ఎలా ఉన్నా రెహమాన్ తర్వాత ఇండియన్ సినిమా మ్యూజిక్ లో చాలా మార్పులు వచ్చాయి. అందుకు కారణం రెహమాన్ ఇచ్చిన ఇన్సిస్పిరేషనే. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని.. ఎందరో ఔత్సాహిక సంగీత కారులు దర్శకులుగా మారారు. ఈ ఘనతను చాలా తక్కువ టైమ్ లో చిన్న వయసులోనే సాధించాడు రెహమాన్ . దానికి తోడు నాణ్యమైన దర్శకుల టేస్ట్ కూడా రెహమాన్ కు బాగా కలిసొచ్చింది.

మణిరత్నం రూపొందించిన హిందీ సినిమా దిల్ సే లో మొత్తంగా రెహమాన్ సంగీతానిదే టాప్ ప్లేస్. అద్భుతమైన పాటలకు తోడు వండర్ అనిపించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అలరించాడు. అలాగే రామ్ గోపాల్ వర్మ రంగీలాకు సైతం తనదైన బాణీలతో ఆకట్టుకున్నాడు. అలా మొత్తంగా దక్షిణాది నుంచి మొదలై రెహమాన్ ప్రతిభ బాలీవుడ్ కు చేరింది. అక్కడ ఎంతమంది టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా.. రెహమాన్ సంగీతానిది ప్రత్యేక రాగం..

మొత్తంగా జాతీయస్థాయికి చేరిన రెహమాన్ చిరస్మరణీయమైన సంగీతాన్ని అందించాడు. ఎన్నో సినిమాల సూపర్ హిట్స్ లో తన సంగీతానిదే అగ్రస్థానం. ముఖ్యంగా రంగీలా, తాళ్, స్వదేశ్, లగాన్, రంగ్ దే బసంతి, గురు, జోధా అక్బర్, గజిని, రాంఝనా వంటి చిత్రాలతో అత్యద్భుతమైన సంగీతాన్ని అందించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇక దక్షిణాదిలో తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేసిన రెహమాన్ తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేదు. చేసిన వాటిలో సినిమాలు చాలా తక్కువ హిట్లుండటం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ తొలి తెలుగు సినిమా గ్యాంగ్ మాస్టర్. తర్వాత సూపర్ పోలీస్, రక్షకుడు, నీ మనసు నాకు తెలుసు, నాని, పులి, ఏ మాయ చేశావె వంటి చిత్రాలు చేశాడు. ఆశ్చర్యంగా వీటిలో ఏ మాయ చేశావె తప్ప ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. అయినా డబ్బింగ్ సినిమాల పాటలతోనే రెహమాన్ ను మనమూ ఆరాధించే సంగీతాన్నందించాడు.

సంగీత దర్శకుడుగా రెహమాన్ కేవలం భారతీయ సంగీతానికే పరిమితం కాలేదు. ప్రపంచ భాషల్లోని వివిధ రకాల సంగీత సంప్రదాయాలను ఆకళింపు చేసుకుని.. వాటి నుంచి తను మ్యూజిక్ చేస్తున్న ప్రాంతాన్ని బట్టి ఆకట్టుకునే సంగీతాన్నందిస్తూ వస్తున్నాడు. అందుకే ఆయన కీర్తి ఎల్లలు దాటింది. ఆస్కార్ అందుకున్న తొలి భారతీయనిగా నిలిపింది. అలాగే ఆస్కార్ అందించిన స్లమ్ డామ్ మిలియనీర్ చిత్రంలోని జయ్ హో పాటకు ప్రతిస్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ నూ అందుకున్నాడు..

ప్రస్తుతం రెహమాన్ ఓ సినిమాకు సంగీతం అందిస్తున్నాడంటే చాలు.. ఆ చిత్ర దర్శకుడు, హీరో, హీరోయిన్ల కంటే ఎక్కువగా రెహమాన్ డిస్కషన్స్ లో ఉంటాడు. అందుకు కారణం.. తనెంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా బ్యానర్ ను బట్టి కాకుండా ఆ చిత్ర కథ నచ్చితేనే మ్యూజిక్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ముందు ఆ స్క్రిప్ట్ తనకు నచ్చాలి.. అతను ఫీల్ అయితేనే ఆడియన్స్ హార్ట్ ఫుల్ ఫీల్ అయ్యే మ్యూజిక్ ఇస్తాడు.. అదీ రెహమాన్ రేంజ్.

రెహమాన్ అంటే ఇండియన్ సినీ మ్యూజిక్ కు బ్రాండ్. మన సంగీతాన్ని శిఖర స్థాయికి తీసుకువెళ్లిన లెజెండ్. అతను విదేశాల్లో ఓ కాన్సెర్ట్ చేస్తున్నాడంటే చాలు.. లక్షలమంది అభిమానులు హాజరవుతారు. ఆ రేంజ్ లో ఫ్యాన్స్ ను సంపాదించుకుని ఇండియన్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తిరుగులేని స్థానంలో ఉన్నాడు. సినిమాలే కాదు.. ఇప్పటికీ తనకు గుర్తింపు తెచ్చిన జింగిల్స్ ను వదల్లేదు. ఆ జింగిల్స్ తో ఆయా సంస్థల బ్రాండ్ వాల్యూనూ మరో రేంజ్ కు తీసుకువెళుతున్నాడు.

ఎంత గొప్ప పేరున్నా.. రెహమాన్ జీవితంలోనూ కొన్ని వివాదాలున్నాయి. కొన్ని తనకు తెలియకుండానే వస్తే.. మరికొన్ని తెలిసీ తెచ్చుకున్నాడు. 1989లోనే హిందూ మతం నుంచి ఇస్లాం స్వీకరించిన రహమాన్ ఆ విషయంలో ఇప్పటికీ కొన్ని విమర్శలు ఫేస్ చేస్తున్నాడు. అయినా తను నమ్మిన దారిలో చిత్తశుద్ధితో ప్రయాణిస్తూ.. ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతోన్నాడు.

ఓ రకంగా చూస్తే రెహమాన్ జీవతం ఓ బయోపిక్ కు సరిపోయేదే. చాలా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు తీసుకుని.. తనదైన ప్రతిభతోనే నాటి మేటి సంగీత దర్శకుల వద్ద కీ బోర్డ్ ప్లేయర్ గా కీ రోల్ ప్లే చేశాడు. తను సంగీత దర్శకుడైన తర్వాత పూర్తిగా కొత్తతరహా సంగీతంతో ఓ ఫ్రెష్ నెస్ ను క్రియేట్ చేశాడు. ఎంతో పోటీ ఉన్న పరిశ్రమలో చాలా తక్కువ టైమ్ లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. దశాబ్ధాలుగా ఊరించిన ఆస్కార్ నూ అందుకుని అంతులేని కీర్తిని సాధించాడు. ఇలా ఎంతో ఆదర్శవంతమైన జీవితం సాధించిన ఈ లెజెండరీ మ్యూజీషియన్ కు మరోసారి బర్త్ డే విషెస్ చెబుదాం..

Tags

Read MoreRead Less
Next Story