Brahma Anandam : తాత, మనవళ్లుగా తండ్రి కొడుకులు

ఏ కొడుకైనా తన తండ్రిని తాతను చేస్తాడు. ఇది చాలా సాధారణం. కానీ సినిమాల్లో కూడా అలా చేయడం అంటే ఇప్పుడే చూస్తున్నాం అనుకోవచ్చు. అంటే యాక్టర్ అయిన తండ్రిని ఓ సినిమాలో తాతగా చూపిస్తూ తను మనవడుగా నటించడం అనే కాన్సెప్ట్ మాత్రం వెరీ రేర్ అనుకోవాలి. ఆ రేర్ థాట్ తోనే ఆడియన్స్ ను బ్రహ్మానందంలో ముంచెత్తడానికి రాబోతున్నారు.. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్. హీరోగా సెటిల్ కావడానికి చాలా ప్రయత్నాలు చేస్తోన్న బ్రహ్మీ తనయుడు రాజా గౌతమ్ ఈ సారి తన సినిమా టైటిల్ నే ‘బ్రహ్మా ఆనందం’గా వస్తున్నాడు. ఈచిత్రంలో అతని పేరు బ్రహ్మానందం. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
ఇంతకు ముందు మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న స్వధార్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఆర్వీఎస్ నిఖిల్ డైరెక్ట్ చేస్తున్నాడు. వెన్నెల కిశోర్ మరో కీలక పాత్రలో, ప్రియా వడ్లమాని హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక టీజర్ చూస్తే ఓ హిలేరియస్ ఎంటర్టైనర్ చూడబోతున్నాం అనేలా ఉంది. హీరోకు ఇచ్చే బిల్డప్స్ కు అతని క్యారెక్టరైజేషన్ కు సంబంధం లేని సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మూవీలో హీరోకు తాతగా కనిపించబోతున్నాడు బ్రహ్మానందం. అతని పాత్ర ద్వారా హీరో చాలా ఇరిటేట్ అవుతుంటాడు. అయినా అతన్నెందుకు భరిస్తున్నానంటే అతను మా తాత కాబట్టి అనే డైలాగ్ టీజర్ చివర్లో ఆకట్టుకునేలా ఉంది.
బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రాజా గౌతమ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయనే గ్యారెంటీ ఇస్తున్నారు మేకర్స్. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు టీజర్ తో పాటు ప్రకటించారు. మరి వీరి నమ్మకం నిజం అవుతుందా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com