Venu Swamy : వేణు స్వామిపై కేస్.. శభాష్ టి.ఎఫ్.జే.ఏ

సెలబ్రిటీల జీవితాలను గురించి అడ్డగోలుగా మాట్లాడుతూ జాతకాల పేరుతో వెర్రిమొర్రి వేషాలేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వేణు స్వామిపై కేస్ నమోదు అయింది. కొన్నాళ్లుగా అతను చెప్పినవేవీ నిజం కావడం లేదు. ఆ మాటకొస్తే ఏదీ నిజం కావు కూడా. దీంతో ఈ మధ్యే ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాల జంట కూడా విడిపోతుందని.. 2027లో వీళ్లు విడాకులు తీసుకుంటారని జోస్యం చెబుతూ ఓ యూ ట్యూబ్ వీడియో చేశాడు. ఇందుకోసం వారి జాతక చక్రాలు, రాశి, నక్షత్రాలు అంటూ ఏవోవో కలిపి మాట్లాడుతూ వాళ్లు విడిపోతారని చెప్పడం పెద్ద సెన్సేషన్ గా మారింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ వేణు స్వామిపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో అతనిపై కేస్ నమోదు చేయించాలని 'తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్" లు కలిసి సంయుక్తంగా కేస్ నమోదు చేయించారు.
నిజానికి జాతకాలు చెప్పడం అనేది పవిత్రమైన వృత్తిగా భావిస్తారు చాలామంది. అలాగే ఇందుకోసం కొన్ని కఠినమైన, ఖచ్చితమైన నియమాలు కూడా ఉన్నాయి. ఏ వ్యక్తికీ అతని పర్మిషన్ లేకుండా జాతకం చెప్పకూడదు అనేది అసలైన నిబంధన. వారు కోరకుండా, ఎవరి జాతకాలు చెప్పకూడదు. వారి జన్మ నక్షత్రాలు, రాశుల గురించి పబ్లిక్ లో పర్మిషన్ లేకుండా మాట్లాడకూడదు అనే రూల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో మీరాడు వేణు స్వామి. తన పిచ్చి జాతకాలతో జనాలను.. ముఖ్యంగా సెలబ్రిటీస్ ను భయపెట్టడం.. తర్వాత వారి దోషాలు తొలగిస్తా అంటూ బేరాలు పెట్టుకుని పబ్బం గడపడం వంటి వ్యాపారం యధేచ్చగా చేస్తున్నాడతను. అతని చెప్పినవన్నీ నిజమే అనుకుని చాలామంది సెలబ్రిటీస్ అతనితో పూజలు చేయించుకోవడం చూస్తున్నాం. ఇందుకోసం అతను వారి నుంచి భారీగా డబ్బులు దండుకుంటుంటాడు. అలాంటి మోసగాడిపై చివరికి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కఠినమైన నిర్ణయం తీసుకుంది. జర్నలిజం విలువలను కాపాడుతూ.. ఇలాంటి అబద్ధాల కోరు.. సమాజంలో అసమానతలను పెంచుతూ.. ఎదుటి వారి వ్యక్తిగత జీవితంలో అలజడులు రేపుతూ.. మాట్లాడుతున్న వేణు స్వామిపై కేస్ నమోదు చేయించిన ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ న అభినందించాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com