సినిమా

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ మృతికి సెలబ్రిటీల సంతాపం.. మంచి నటుడిని కోల్పోయామంటూ..

Puneeth Rajkumar: కన్నడ చిత్ర పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది.

Puneeth Rajkumar (tv5news.in)
X

Puneeth Rajkumar (tv5news.in)

Puneeth Rajkumar: కన్నడ చిత్ర పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్‌ తనయుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో శాండిల్‌వుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అకాలమరణ వార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.చిన్న వయస్సులోనే విధి ఆయనను మనకు దూరం చేసిందని... నటనా చాతుర్యం, అద్భుతమైన వ్యక్తిత్వంతో ఆకట్టుకున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ను రాబోయే తరాలు ఎన్నటికీ గుర్తుంచుకుంటాయని ప్రధాని మోదీ అన్నారు. రాహుల్‌ గాంధీ కూడా పునీత్‌ అకాల మరణంపై షాక్‌కు గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.కన్నడ సినీ పరిశ్రమతో పాటు, ఇటు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా పునీత్‌ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన మరణవార్త విని... హృదయం ముక్కలైందంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇంత త్వరగా మనల్ని వదలి వెళ్లారనే వార్త విస్మయానికి గురి చేసిందని విచారం వ్యక్తం చేశారు చిరంజీవి.అప్పూ మృతితో గొప్ప స్నేహితుడ్ని కోల్పోయానంటూ నందమూరి బాలకృష్ణ ట్వీట్‌ చేశారు. ఆయన మృతి కన్నడ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి కథానాయకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా ప్రతిభ చాటి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారన్నారు. పునీత్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మంచు మోహన్‌బాబు కూడా ట్విట్టర్‌ వేదికగా సంతాపం తెలిపారు. పునీత్‌ మరణం యావత్‌ సినీ ప్రపంచానికి విషాదకరమైన రోజని విచారం వ్యక్తం చేశారు.పునీత్‌ రాజ్‌కుమార్‌ తుదిశ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానంటూ పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ఆయన మృతి నమ్మశక్యం కాలేదన్నారు. పునీత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నానంటూ పవన్‌ ట్వీట్‌ చేశారు. అలాగే నాగార్జున, ప్రకాశ్‌ రాజ్‌ కూడా తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. అంత త్వరగా వెళ్లిపోయావా అప్పూ ప్రకాశ్‌ రాజ్‌ విచారం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇది బ్లాక్‌ ఫ్రైడే అంటూ ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌ చేశారు.అలాగే మహేష్‌ బాబు, రామచరణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌, రాజమౌళి సైతం పునీత్‌ కన్నుమూతపై సంతాపం తెలిపారు. గొప్ప వ్యక్తిని కోల్పోయామంటూ ట్వీట్‌ చేశారు. భగవంతుడు పునీత్‌ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తూ ట్వీట్టర్‌లో పోస్టులు పెట్టారు.సినీ పరిశ్రమకు చెందినవారే కాకుండా పలువురు క్రికెటర్లు, రాజకీయ నేతలు కూడా పునీత్‌ రాజ్‌ కుమార్‌కు ట్విట్టర్‌ వేదికగా సంతాపం తెలిపారు. పునీత్‌ మృతి తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని క్రికెటర్లు వెంకటేశ్‌ ప్రసాద్‌, అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ సింగ్‌ , వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నారు.Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES