నువ్వా దరిని.. నేనీ దరిని 'రియాల్టీ షో' కలిపింది ఇద్దరినీ..

వచ్చే ముందు ఒకరికి ఒకరు తెలియదు.. వచ్చిన తరువాతే తెలిసింది అతడి గురించి ఆమెకి.. ఆమె గురించి అతడికి.. చుట్టూ ఎంతో మంది ఉన్నా ఆమెంతో స్పెషల్ అతడికి.. ఒకరికొకరు కలిసి ఉండేది రోజులు కాదు, వారాలు కాదు కొన్ని నెలలు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇంత కంటే వేదిక ఏం ఉంటుంది.
సరైన జోడీ దొరికిందని సంబర పడుతూ షో ముగిసి బయటకు వచ్చిన తరువాత ఆ బంధాన్ని పెళ్లితో ముడివేస్తున్నారు.. జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేసుకుంటున్నారు రియాల్టీ షోకి వచ్చిన పార్టిసిపెంట్లు, సెలబ్రెటీలు. కానీ కొన్ని జంటలు షో వరకే పరిమిత మవుతున్నాయి. అదంతా రేటింగ్స్ కోసమే షో నిర్వాహకులు ఆడిస్తున్న జిమ్మిక్కు అని షో చూస్తున్న ప్రేక్షకులు అనుకునేలా చేస్తున్నారు. రియాల్టీ షో ద్వారా ఒక్కటైన జంటలు.. కొన్ని ప్రేమకథలను గురించి తెలుసుకుందామా..
వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు వంద రోజులు ఒకే షెల్టర్ కింద కలిసి ఉండే షో బిగ్‌బాస్. కుషాల్, గౌహర్.. ఇద్దరివి భిన్న మనస్దత్వాలు.. అయినా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. బయటకు వచ్చాక పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లు బాగానే సాగింది వారి దాంపత్య జీవితం. అంతలోనే నీదారి నీది.. నాదారి నాది అంటూ విడిపోయారు.
దిల్లీ వ్యాపార వేత్త పునీష్ శర్మకు, మోడల్ బందగీ కల్రాకు పరిచయమైంది బిగ్‌బాస్ షోలోనే. హౌస్‌లో ఉన్నన్నాళ్లు ఏ మూల చూసినా వారిద్దరే ఊసులాడుకుంటూ కనిపించేవారు. సామాజిక మాధ్యమాలన్నీ ఆ జంట చుట్టూనే తిరుగుతూ ఫోటోలు అప్‌లోడ్ చేస్తూ బిజిగా ఉంది. ముఖ్యంగా వారి ఇన్‌స్టా ఈ ప్రేమ పక్షుల హగ్గులు, కిస్సులతో నిండిపోయింది. రేపో మాపో పెళ్లి పీటలు ఎక్కే ప్రయత్నాల్లో ఉందీ జంట.
ప్రిన్స్ నరూలా-యువికా చౌదరి ఇద్దరూ బిగ్‌బాస్ కంటెస్టెంట్లే.. ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతుండే సరికి ఏంటి కథ.. ఏం జరుగుతోంది ఇద్దరి మధ్యలో అని కెమేరా కన్ను ఫోకస్ చేస్తే ఏం లేదంటూ కొట్టి పారేసారు.. మళ్లీ కొన్నాళ్లకు మరో రియాల్టీ షో స్పిట్స్‌విల్లాలో ఈ జంట దర్శనమిచ్చింది.
రూప్ బిందర్-మోహిత్ సగ్గర్ ఇద్దరూ రోడీస్ పోటీదారులు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమయ్యారు. అందరిలా కాకుండా వారి మధ్య ఏం జరుగుతోంది అని మీడియా ముందు చెప్పి మరీ గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. వారి బంధాన్ని మరింత దృఢం చేసుకున్నారు.
మరో జంట హిమాన్షు మల్హోత్రా-అమృతా కన్విల్కర్ వీరిది సుదీర్ఘ ప్రయాణం.. సినీస్టార్స్‌కి ఖోజ్‌లో ఒకరినొకరు కలుసుకున్నారు. చూపులు కలిశాయి. మనసులు మాట్లాడుకున్నాయి. ప్రేమలో నిండా మునిగినా ఎవరి కంటాపడకుండా జాగ్రత్తపడ్డారు. ఆపై మరో రియాల్టీ షో ' నాచ్ బలియే' అనే డ్యాన్స్ షోలో జట్టు కట్టారు. ఓ పదేళ్లే ప్రేమాయణం సాగించి 2015లో పెళ్లితో ఒక్కటయ్యారు. తమ బంధం బలమైందని తోటి నటీనటులకు చాటి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com