OTT: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో వచ్చే సినిమాలు, షోలపై నియంత్రణ..?
ఓటీటీ(OTT)ల్లో వచ్చే సినిమాలు, వెబ్‌షోలపై నియంత్రణ ఉండాలని, అందులో ప్రసారమయ్యే అశ్లీల్లం, అసభ్యకర, హింసాత్మక సన్నివేశాల్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఓటిటీ సంస్థలకు సూచించింది. ఇది ఒకరకంగా నెట్‌ఫ్లిక్స్(NETFLIX), అమెజాన్(AMAZON), హాట్‌స్టార్(Hotstar), సోనీ లివ్(Sony Liv), జియో సినిమా(Jio Cinima) వంటి సంస్థలకు ఇబ్బందికరమే. భారతదేశంలో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వాటా 7 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ కంటెంట్‌పై నియంత్రణ వస్తే ఈ రంగం వృద్ధి తగ్గడంతో పాటు, ఉపాధి అవకాశాలు పోతాయని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
జూన్ 20న సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ పలువురు ఓటిటి కంపెనీలతో సమావేశమై, దీనిపై చర్చించినట్లు తెలిసింది. అయితే కేంద్రం తెచ్చిన ప్రతిపాదనలకు ఓటిటి కంపెనీలు అభ్యంతరాలు తెలిపినట్లు, దీంతో ఏ నిర్ణయం తీసుకోలేదని వెల్లడైంది.
"OTT ప్లాట్‌ఫాంలపై వస్తున్న అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌కు సంబంధించి పార్లమెంట్ సభ్యులు, పౌరులు, సంఘాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను కేంద్రం పరిగణలోకి తీసుకుంది" అని సమావేశం మినిట్స్ ద్వారా వెల్లడైంది.
మన దేశంలో ప్రసారమవుతున్న ఓటిటి కంటెంట్‌పై ఎన్నో రోజులుగా చర్చలు, అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అందులో వస్తున్న అశ్లీల, అసభ్యకర చిత్రాల్ని కుటుంబంతో కలిసి చూడలేకపోతున్నట్లు పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి. అగ్రతారలు కూడా ఇటువంటి చిత్రాలు, షోలు చేస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థలు మన దేశంలో కూడా తమ ఫ్లాట్‌పాంల్లో హిట్ చిత్రాలు ఒప్పందాలు చేసుకుంటూ, ఇతర దేశాల్లో హిట్ అయిన షోలు, సినిమాలను భారత ప్రేక్షకులకు అందిస్తూ ఆదరణ పొందుతున్నాయి. అయితే మన దేశంలో నిర్మితవుతున్న థియేటర్ సినిమాలకు ప్రభుత్వం నియమించిన బోర్డ్ సమీక్షించి సర్టిఫికెట్ అందజేస్తుంది. కానీ ఇప్పటి దాకా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలపై వచ్చే సినిమాలు, షోలపై ఈ నియంత్రణ లేదు. ఆన్‌లైన్‌లో ప్రసారమవుతున్న స్థానిక, అంతర్జాతీయ కంటెంట్ పలు నియమాలకు అనుగుణంగా ఉండేట్లు చూసే అవసరం ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టపరచాయి.
ఇద్దరు స్వతంత్ర సభ్యులతో కూడిన ప్యానెల్ ఆన్‌లైన్ కంటెంట్‌ని సమీక్షిస్తారని చెప్పగా, వారు అభ్యంతరాలు వ్యక్త పరిచినట్లు మీటింగ్‌కి హజరైన స్ట్రీమింగ్ కంపెనీ సభ్యులు వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com