Chhaava Trailer : ఛావా ట్రైలర్.. యాక్షన్ తప్ప ఎమోషన్ ఏదీ..?

Chhaava Trailer :  ఛావా ట్రైలర్.. యాక్షన్ తప్ప ఎమోషన్ ఏదీ..?
X

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ కథతో తెరకెక్కిన సినిమా ఛావా. ఛావా అంటే సింహం పిల్ల అని అర్థం. అంటే సింహం కడుపులో సింహమే పుట్టింది అనే అర్థంలో పెట్టిన టైటిల్ అనుకోవచ్చు. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం చేశాడు. ఫిబ్రవరి 14న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ మూవీని డిసెంబర్ 6నే విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ టైమ్ కు పుష్ప 2 ఉండటంతో వాయిదా వేసుకున్నారు. ఈ ట్రైలర్ చూస్తే ఇది ఇప్పుడు దేశం ఉన్న మూడ్ ను బట్టి రూపొందించి చిత్రంలా కనిపిస్తోంది. నిజానిజాలెలా ఉన్నా.. ఓ రకమైన ఉద్వేగాన్ని క్రియేట్ చేస్తూ దేశభక్తి సెంటిమెంట్ ను రంగరిస్తూ.. హిందూత్వం కోసం రూపొందించిన సినిమాలా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.శంభాజీ మహారాజ్ పోరాటం అంతా ఔరంగజేబ్ పైనే అన్నట్టుగా చూపించారు. కానీ ఔరంగజేబ్ మాత్రం బాగా వయసు మళ్లినవాడిలా కనిపిస్తున్నాడు. అంటే ఔరంగజేబ్ ఏదైతే హిందూత్వను అంతం చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడో ఆ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా శంభాజీ పోరాటం ఉండబోతోందనుకోవచ్చు.

ట్రైలర్ లోనే కథంతా చెప్పేశారు. పోరాటాలు, యుద్ధాలు, భావోద్వేగంగా చెప్పే డైలాగులే తప్ప ఎక్కడా ఎమోషన్స్ కనిపించలేదీ ట్రైలర్ లో. మహారాణి యేసూబాయి పాత్రలో రష్మిక మందన్నా నటించింది. ఆ పాత్రకు తగ్గ హుందాతనం తన క్యారెక్టరైజేషన్ లో ఉందా అంటే లేదు అనే చెప్పాలి. ముఖ్యంగా మహారాణిగా పోస్టర్ లో కనిపించినంత బెస్ట్ గా ట్రైలర్ లో లేదు తను. విక్కీ కౌశల్ మాత్రం పాత్రలోకి వెళ్లిపోయినట్టు కనిపిస్తుంది. తనే శంభాజీ అని పూర్తిగా నమ్మితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నాడు. ఈ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ కనిపించేలా ఉన్నాయి. నటుడుగా అతనికి ఓ కొత్త ఇమేజ్ తెచ్చేలాగా ఉంది.

మొత్తంగా నేటి తరానికి కొత్తగా దేశభక్తిని రగిల్చేలాగా చిత్రాన్ని రూపొందించారనేది ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అది కాకుండా సినిమాలో మంచి ఎమోషన్ తో పాటు ఏదైతే నిజంగా శివాజీ మహారాజ్ కలలు కన్నాడో ఆ రాజ్య స్థాపన కోసం ఆయన తనయుడి ఆలోచనా విధానం ఉందా లేదా అనే సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఇప్పటికైతే ట్రైలర్ మొత్తంగా ఎమోషన్ లేని యాక్షన్ తో నింపినట్టుగానే ఉందని చెప్పాలి.

Tags

Next Story